Idream media
Idream media
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం మార్చుకుంటున్నారా? గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2024 ఎన్నికల్లో కొత్త పంథా అనుసరించనున్నారా? అంటే అవును అన్నట్లుగానే సమీకరణాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో నడుస్తున్న దోస్తానాకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో జనసేన ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ఎదుర్కుంటుందనే ఊహాగానాలకు తెరపడుతుంది. చంద్రబాబు కూడా జనసేన తో కలిసి నడిచేందుకు ఉత్సాహం చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. తొలుత బీజేపీపై దృష్టి సారించినప్పటికీ.. ఆ పార్టీ నేతలు బాబు ను నమ్మే పరిస్థితి ఉండడం లేదు. దీంతో పవన్ చుట్టూ బాబు ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయానికి కేంద్రం చకచకా పావులు కదుపుతోంది. దాన్ని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం సహా కార్మికులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మిక సంఘాలు సుమారు ఎనిమిది నెలలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఏదోక రూపంలో కేంద్రానికి తమ నిరసనను తెలియజేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా తమ ఆగ్రహం, ఆవేదన వెలిబుచ్చారు. అలా సాగుతున్న ఉద్యమాన్ని జనసేనాని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికార పార్టీ బీజేపీతో మిత్ర బంధంతో ఆయన కేంద్ర నిర్ణయాన్ని ఇప్పటి వరకు అంతగా వ్యతిరేకించలేదు. పైగా ఇటీవల పవన్ మాట్లాడుతూ, తనను గెలిపించని ప్రజలు పరిశ్రమను కాపాడాలని కోరడం సమంజసమేనా అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
Also Read : Central Government Stopped Coal Supply – బొగ్గు సంక్షోభంలో విశాఖ ఉక్కు
పవన్ నోటి వెంట ఆ తరహా వ్యాఖ్యలు రావడం విచారకరమని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. గెలిస్తేనే ప్రజలతో ఉంటారా, లేకపోతే పట్టించుకోరా అని పవన్ కు ప్రశ్నలు కురిపించారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పవన్ ఏపీలో రాజకీయంగా దూకుడు పెంచారు. తన వ్యాఖ్యలతో వేడి పుట్టిస్తున్నారు. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూనే బీజేపీకి మద్దతు ప్రకటించారు. జనసేన సూచన మేరకు టీడీపీ కూడా ఉప ఎన్నికలో పోటీ నుంచి తప్పుకుంది. దీంతో టీడీపీ – జనసేన బంధంపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, బీజేపీతో ఉండగా ఆ రెండు పార్టీలు కలిసే అవకాశం ఉండదని మెజార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే ఏ పార్టీతో కలిస్తే ఉత్తమమనే చర్చ జనసేనలో నడుస్తోంది.ఈ క్రమంలో బీజేపీ వస్తే సరే, లేకుంటే జనసేన మాత్రం టీడీపీతో కలిసి నడిచేందుకు ఆసక్తిి చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది. తాజా ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విశాఖ ఉద్యమానికి దూరంగా ఉన్న జనసేన త్వరలో ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తామని ప్రకటించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 31వ తేదీన విశాఖకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. స్టీల్ ప్లాంట్ దగ్గర జరిగే ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సభకు పవన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జారీ చేసిన ఓ ప్రకటనలో జనసేన పార్టీ ప్రజాపక్షం వహిస్తుందని, ఎవరికీ భయపడేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకటించడం ఆసక్తిగా మారింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుస్తోంది. ఎవరికీ భయపడబోమని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడతామని జనసేన ప్రకటించడం ద్వారా బీజేపీ కి వ్యతిరేకంగా సమరశంఖం పూరించనుందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఉక్కు కార్మికులకు పార్టీ తరఫున పూర్తి స్థాయిలో అండదండలు అందించాలని నిర్ణయించడం అంటే.. బీజేపీ అండ నుంచి తప్పుకున్నట్లే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయాలు ఎలా మారనున్నాయో అనేది వేచి చూడాలి.
Also Read : Veerraju Over Expectation – ఎబ్బెట్టుగా అనిపించడం లేదా వీర్రాజు..?