Idream media
Idream media
తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందని గతంలో ఏకపక్షంగా వెల్లడించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరులో మార్పు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన అనంతరం బీజేపీలో పరిణామాలు మారినట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలో విజయం సాధించి తదనంతరం రాష్ట్రంలో పట్టు పెంచుకుంటున్న తరహాలో ఏపీలో కొనసాగాలంటే మిత్రపక్షం జనసేన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పవన్ తిరుపతి పర్యటన ముగిసిన వెంటనే హైదరాబాద్ వెళ్లి.. ఆయనను సోము వీర్రాజు కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర బీజేపీ నాయకులు సరిగా లేరని, వారికి జనసేన బలం తెలియడం లేదని తిరుపతిలో పవన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీపై ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు.. కొందరు సోముకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు ఢిల్లీకి పంపుతున్న ఫిర్యాదులతో ఆయన సతమతమవుతున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో జన సైనికులను ఆకట్టుకోవాలంటే పూర్తి స్థాయిలో పవన్ మద్దతు పొందాలని సోము భావించారు. ఈ క్రమంలోనే మరోసారి పవన్ తో చర్చలు జరిపినట్లు తెలిసింది.
ఇటీవల తిరుపతిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కచ్చితంగా పోటికి దింపాలని జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. బీజేపీకి సీటు కేటాయించి వారికి సహకరించాలంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని వారు పేర్కొన్నట్లు సమాచారం. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలోనూ అదే అభిప్రాయం వ్యక్తమైంది. అనంతరం పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పవన్ కల్యాణ్‌కు వాస్తవ పరిస్థితులు వివరించారు. దీంతోపాటు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సహకరించిన నేపథ్యంలో తిరుపతిలో మనమే పోటీ చేద్దామని తేల్చిచెప్పినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు జనసేనలో ప్రచారం జరుగుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కలిశారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కు శాలువా కప్పిన వీర్రాజు.. పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితులపై ఇరువురూ సుమారు అరగంటకు పైగా చర్చించారు. మరీ ముఖ్యంగా త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలపై కీలకంగా చర్చించారు. ఎంపీ అభ్యర్ధిని ఎవర్ని బరిలోకి దింపాలనే విషయంపై మాట్లాడారు.
భేటీ అనంతరం సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధిపై చర్చించామన్నారు. ‘ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతారు. బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారా..? లేకుంటే జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా..? అనేది మాకు ముఖ్యం కాదు. ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశాం. 2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నాం. ఇరు పార్టీల అధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా ఆలోచన చేశాం. కుల, మత వర్గాల బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తాం’ అని వీర్రాజు చెప్పుకొచ్చారు. గతంలో ఆయన చేసిన ప్రకటనకు, ఇప్పటి ప్రకటనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. జనసేనతో కలిసి సామరస్యంగానే ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.