Idream media
Idream media
పేద కాపుల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు వైఎస్సార్ కాపు నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. ఏడాదికి 15 వేల చొప్పన ఐదేళ్లలో 75 వేల రూపాయలు ఇచ్చేలా పథకం ప్రారంభించింది. మొదటి విడతగా ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలోని దాదాపు 2.36 లక్షల మంది పేద కాపు మహిళలకు 15 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమచేసింది. ఈ పథకంపై ఇప్పటికే టీడీపీ నేతలు విమర్శలు చేయగా.. తాను ఉన్నానంటూ జనసేన అధినేత నిన్న విమర్శలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గాలికిపోయే పేలాల పిండి కృష్ణార్పనం అంటూ ఈ పథకంపై విమర్శలు చేశారు. లబ్ధిదారుల సంఖ్యపై కూడా ఆ ప్రకటనలో అనుమానం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో వైసీపీ ప్రభుత్వం కాపుల కోసం తెచ్చిన పథకంపై విమర్శలు చేయడం అటుంచితే.. కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆకలేసి ఏడ్చే పిల్లాడికి చేతిలో గోలీ పెట్టి బుజ్జగించాలని చూశాడు ఎనకటికి ఓ తెలివిగల ఆసామి. అలా ఆంధ్రప్రదేశ్ లో కాపు కార్పొరేష్ కూడా ఆ మాదిరిగా ఏర్పాటయింది. వెనుకబడిన జాతికి రిజర్వేషన్లను పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళన నుంచి కాపుల దృష్టి మరల్చడానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి పాలకులు తెలివిగా కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సమస్య నుంచి కొంత వరకు కాపులను ఏమార్చారు. గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌కు ఏటా 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించగా, ప్రస్తుత పాలకులు ఏటా 2 వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. మరి వారు ఇచ్చిందెంత..? వీరు ఇచ్చిందెంత..?’’ అని పవన్ కళ్యాన్ గత చరిత్రను గుర్తు చేసుకుంటూ ప్రశ్నలు సంధించారు.
పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలు బండి వెళ్లిపోయిన తర్వాత స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికుడి మాదిరిగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన జనసేనాని ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ,బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చారు. టీడీపీ, బీపేజీ కూటమి ఇచ్చిన ప్రతి హామీకి నాది పూచి అన్నారు. తమకు రిజర్వేషన్లు కావాలని, తమను బీసీల్లో చేర్చాలని కాపులెవరూ అడగలేదు. కానీ వారి ఓట్ల కోసం చంద్రబాబు నాయుడే కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకూ కాపు రిజర్వేషన్‌పై ఉలుకూ పలుకూ లేదు. 2016లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేయడంతో బాబుకు తాను ఇచ్చిన హామీ గుర్తుకు వచ్చింది. కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేచిన చంద్రబాబు..పవన్ కళ్యాణ్ అన్నట్లుగా కాపుల్లో ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏడాదికి 1000 కోట్లు ఇస్తామన్నారు. కానీ ఇచ్చారా..? అంటే అదీలేదు.
టీడీపీ హామీలకు నాది పూచి అని ఎన్నికల సభల్లో చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ఆ హామీలను అమలు చేయకపోయినా కళ్లుండి గుడ్డివాని మాదిరిగా రాజకీయాలు చేశారు. కాపుల రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని నాడు తన పార్టనర్‌ను అడగలేదు. కాపు కార్పొరేష్‌కు ఎన్నినిధులు ఇచ్చావ్ అని కూడా నిలదీయలేదు. ముద్రగడ పద్మనాభం కుటుంభాన్ని వేధించినా, వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించినా, కాపు నేతలు, యువతపై కేసులు పెట్టినా.. ఇదేమిటని పవన్ కళ్యాన్ ప్రశ్నించలేదు. ఇచ్చిన హామీని అమలు చేయమన్న కాపు సమాజంపై కేసులు పెడతారా..? అని కూడా అడగలేదు.
పవన్ కళ్యాన్ తమకు జరిగిన అన్యాయాన్ని అడిగినా, అడగకపోయినా 2019 ఎన్నికల్లో కాపులు చంద్రబాబుతోపాటు పవన్ కళ్యాన్‌కు కూడా తగిన గుణపాఠం చెప్పారు. అయితే బాబు దిగిపోయి ఏడాది దాటిన తర్వాత ఇప్పుడు కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ నిధులు పవన్ కళ్యాణ్‌కు గుర్తుకురావడమే ఇక్కడ విశేషం. ఈ విషయం ఏదో అప్పుడు అడిగి ఉంటే భీమవరం, గాజువాకల్లో ఏదో ఒక చోటైనా గెలిచుండేవారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.