iDreamPost
android-app
ios-app

పవర్ స్టార్ కి ఏమైంది?

  • Published Dec 09, 2022 | 12:15 PM Updated Updated Dec 09, 2022 | 12:15 PM
పవర్ స్టార్ కి ఏమైంది?

రీమేక్ సినిమాలు చేయొద్దని అభిమానులు ఎంత మొత్తుకుంటున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం వినేలా లేడు. ప్రత్యక్ష రాజకీయాల కారణంగా అజ్ఞాతవాసి(2018) చిత్రం తర్వాత పవన్ సినిమాలకు చిన్న విరామం ఇచ్చాడు. రీఎంట్రీ తర్వాత ఆయన నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రెండూ రీమేకే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరి హర వీరమల్లు మాత్రం రీమేక్ ఫిల్మ్ కాదు. కానీ ఆ చిత్రం ఆలస్యమవుతూ వస్తోంది. మరోవైపు ఆయన గతంలో దర్శకులు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డితో ప్రకటించిన ప్రాజెక్ట్ లను పక్కన పెట్టి.. వినోదయ సీతమ్ రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడనే వార్తలు విని అభిమానులు షాకయ్యారు. అయితే సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ కథతో సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటన రావడంతో ఇప్పట్లో ఆ రీమేక్ లేనట్లే అని ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ తేరి రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడనే న్యూస్ షాకింగ్ గా మారింది.

నిజానికి తేరి రీమేక్ లో పవన్ నటించనున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ రీమేక్ డైరెక్టర్ గా మొదట్లో సంతోష్ శ్రీనివాస్, తర్వాత సుజిత్ పేర్లు వినిపించాయి. రీసెంట్ గా సుజిత్ తో గ్యాంగ్ స్టర్ మూవీ ప్రకటన రావడంతో ఇక తేరి రీమేక్ గోల లేనట్లేనని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ వారి సంతోషానికి హరీష్ శంకర్ రూపంలో గండి పడుతోంది. గతంలో హరీష్ దర్శకత్వంలో ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ ని పక్కన పెట్టిన పవన్.. ఇప్పుడు తేరి రీమేక్ చేయడానికి సిద్ధమైనట్లు టాక్. ఈ న్యూస్ విని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ రీమేక్ తప్ప చేయడానికి కథలే లేవా అని మండిపడుతున్నారు. తేరి రీమేక్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ కొందరు సూసైడ్ నోట్స్ కూడా రాస్తున్నారు.

తేరి రీమేక్ ని పవన్ ఫ్యాన్స్ ఇంతలా వ్యతిరేకించడానికి బలమైన కారణముంది. అదెప్పుడో ఆరేళ్ల క్రితం తమిళ్ హీరో విజయ్ నటించిన సినిమా. పోలీసోడు పేరుతో తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పటికే టీవీలు, ఓటీటీలలో తెలుగు ప్రేక్షకులు దానిని చూసేసారు. పైగా అదేమీ గొప్ప సినిమా కాదు. అందుకే పవన్ ఫ్యాన్స్ అంతలా ఫైర్ అవుతున్నారు. అప్పట్లో కాటమరాయుడు విషయంలోనూ ఇదే జరిగింది. తమిళ్ మూవీ వీరం అప్పటికే వీరుడొక్కడే పేరుతో తెలుగులో డబ్ అయింది. ఆ మూవీ వచ్చిన మూడేళ్లకు కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశాడు పవన్. ఇప్పుడేమో ఏకంగా ఆరేళ్లకు తేరి రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఈ ఓటీటీ యుగంలో అందరూ అన్ని భాషల చిత్రాలను ముందే చూసేస్తున్నారు. అందుకే రీమేక్ సినిమాలకి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం ఎప్పుడో ఆరేళ్ల క్రితం నాటి పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడనే వార్త సంచలనంగా మారింది. అభిమానుల ఆవేదనను అర్థం చేసుకొని పవన్ ఆ రీమేక్ కి దూరంగా ఉండటం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.