iDreamPost
iDreamPost
ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనబరచకుండా ఆధిపత్య ధోరణితో వెళ్లిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రతినిధులతో రెండు రోజుల సుదీర్ఘ చర్చల అనంతరం ఉద్యోగులు 6వ తేదీ నుంచి చేయాల్సిన సమ్మెను విరమించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆదివారం స్పందించిన పవన్ కల్యాణ్ ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట లభించలేదని ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయే కామెంట్ చేశారు. తమ డిమాండ్లయిన ఫిట్‌మెంట్, పాత హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపు, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వడం వంటివి నెరవేరకుండానే సమ్మె విరమించే పరిస్థితిని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించిందని ఆరోపించారు. సమ్మె ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని జనసేన పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు.
ఆ పదాల అర్థమేంటి పవన్!
చర్చల సందర్భంగా ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరించింది అంటున్న పవన్ అది ఏ విధంగానో వివరిస్తే బావుండేది. స్టీరింగ్ కమిటీ తరఫున 20 మంది నాయకులు హాజరైతే వారికి సమ్మె విరమించే పరిస్థితి ప్రభుత్వం కల్పించిందీ అంటే దాని అర్థమేమిటో ఆయనే చెప్పాలి. విద్యాధికులు, సంఘాలకు నాయకత్వం వహించడంలో అనుభవం ఉన్న నాయకులపై ప్రభుత్వం ఆధిపత్య ప్రదర్శించడం, విధిలేని పరిస్థితి కల్పించడం ఎలా వీలవుతుంది? పాత హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపు, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించినా అవి పరిష్కారం కాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ వైఖరిపై, చర్చలు జరిగిన తీరుపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తుంటే పవన్ దానికి విరుద్ధంగా వారికి ఊరట లభించలేదని విమర్శలు చేయడం చిత్రంగా ఉందని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని జనసేన పరిగణనలోకి తీసుకుంటుంది అంటున్న పవన్ ఇప్పుడు వారిని రెచ్చగొట్టే పని చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
నిరాశతో విపక్షం కామెంట్లు
పీఆర్సీపై ఉద్యోగులు చేసిన ఆందోళన నుంచి రాజకీయం పిండుకుందామని ప్రయత్నించిన విపక్షాలకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వంతో చర్చలు సఫలమై ఆందోళనకు తెరపడడాన్ని విపక్ష నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తాము తలో చేయి వేసి విజయవాడలో ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీని సక్సెస్ చేసిన సంతోషం వారిలో ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆ ఫ్రస్టేషన్‌తో ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే ప్రభుత్వం అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వడానికి అంగీకారం తెలిపినా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ నివేదిక ఇవ్వరని ప్రశ్నించారని అంటున్నారు. జనసేన అధినేత కూడా ప్రభుత్వం ఆమోదించిన డిమాండ్లపై మాట్లాడుతున్నారని చెబుతున్నారు. చర్చల సందర్భంగా ఒప్పుకొని బయటకు వచ్చిన తరువాత ఉపాధ్యాయ సంఘాలు స్పందించిన తీరును స్టీరింగ్ కమిటీ నాయకులే విభేదిస్తున్నారు. ఆ ఒక్క అంశాన్ని పట్టుకొని ఉద్యోగుల ఉద్యమాన్ని మళ్లీ రాజేద్దామని విపక్ష నేతలు యత్నించడం వారి దివాళాకోరు రాజకీయానికి నిదర్శనం అని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.