iDreamPost
iDreamPost
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తోన్న సినిమా పీరియాడిక్ డ్రామా అనే లీక్ అయితే బయటికి వచ్చింది కాని అది ఎవరికి సంబందించిందో మాత్రం అర్థం కాక అభిమానులు అయోమయంలో పడ్డారు. ఈలోగా మీడియాలో పవన్ చేయబోయే కథ తెలంగాణ పోరాట యోధుడు పండగ సాయన్న బయోపిక్ అని రావడంతో ఇతను ఎవరా అనే ఆలోచన అందరిలోనూ మొదలయ్యింది. ఇది అధికారికంగా యూనిట్ చెప్పకపోయినా నిప్పు లేనిదే పొగరాదు అనే టైపులో ఎందరో మహనీయులు ఉండగా ఒక్క పండగ సాయన్న పేరు మాత్రమే ఎందుకు బయటికి వస్తుందన్న కామెంట్ లేకపోలేదు.
ఇంతకు ఈ సాయన్న ఎవరు అనే కదా మీ అనుమానం. ఈయన 19వ శతాబ్దానికి చెందినవారు. 1840 ప్రాంతంలో పుట్టి 1885 దాకా ఈయన ఉనికి ఉండేదని చరిత్ర చెబుతోంది. మెహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలోని మెరుగోని గ్రామానికి చెందిన సాయన్న ఊరిలో పెత్తనం చెలాయిస్తున్న కరణం, దొర, ఖాన్ సాబ్ ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మొదటి వ్యక్తి. వీరి దారుణాలకు స్వయానా చిన్నమ్మ బలికావడంతో పాటు ఎందరో మానధన ప్రాణాలు ఆహుతి కావడంతో రాబిన్ హుద్ తరహాలో దుర్మార్గంగా సంపాదించిన సొమ్ములున్న ఉన్నవాడిని దోచి పేదవాడికి పంచడం అనే సిద్ధాంతాన్ని సాయన్న అమలు పరిచేవారు.
సాయన్న చేస్తున్న మంచి అతనికి వస్తున్న పేరుని తట్టుకోలేక ఆరుగురు భూస్వాములు కలిసి నైజామ్ ప్రభువుల మీద ఒత్తిడి తెచ్చి కేసులు బనాయించేలా చేస్తారు. ఓ కుట్ర రూపంలో సాయన్న అరెస్ట్ అవుతాడు. అప్పటి పోలీస్ అధికారుల సాయంతో సాయన్నను చంపేందుకు కుట్ర జరిగితే ఊళ్ళకూళ్ళు ఏకమై తిరుగుబాటు చేస్తాయి. వనపర్తి మహారాణి దాకా వ్యవహారం వెళ్తుంది. ఇలా కథ ఎన్నో రోమాంచితభరితమైన మలుపులతో తిరుగుతూ సాయన్న గొప్పదనాన్ని చాటుతుంది. ఆఖరికి సాయన్నను మరోసారి పట్టుకుని ఎలా ఉరి తీశారన్నది చాలా అత్యద్భుతంగా ఉంటుంది . నిజంగా పవన్ ఎంచుకున్న కథ సాయన్నదేనా లేక క్రిష్ ఇంకేదైనా తీసుకున్నాడా అనే క్లారిటీ లేదు. సాయన్నకు సైరాకు కాన్సెప్ట్ పరంగా చాలా పోలికలున్నాయి. మరి పవన్ ఒప్పుకున్నాడు అంటే ఏదో విషయం వేరుగా ఉంటుంది. ఒకవేళ సాయన్న స్టొరీనే అయితే పవన్ కెరీర్ లో మొదటిసారి చాలా పవర్ ఫుల్ రోల్ లో చూడబోతున్నట్టే