iDreamPost
iDreamPost
పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో తన పాత డైలాగులనే అంటే రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి ,కడప రౌడీలు,పులివెందుల రాజకీయం అంటూ ప్రసంగాలు చేస్తున్నాడు. గతంలో ఇలాంటి ప్రకటనల మీద ప్రజలలో వచ్చిన వ్యతిరేకతను పట్టించుకోకుండా పవన్ తన ధోరణిలో అవే మాటలు మళ్ళీ మళ్ళీ అంటున్నాడు,
1. రాయలసీమ వేషాలు నా వద్ద వేయవద్దు .
రాయలసీమ వేషాలు అంటే ఏమిటి?రాయలసీమ ప్రజలు కానీ నాయకులు గాని ప్రత్యేకంగా వేసిన వేషాలు ఏమున్నాయి?బంగారం సినిమాలో పేడి వేషం వేసి సీమ సంస్కృతి అంటే డబ్బు కోసం పసిపిల్లల్ని ఎత్తుకుపోయి బాల్య వివాహాలు చేసుకొనేవారిగా చూపించినప్పుడు కొంచం ఆలోచించవలసింది,ఇలాంటి వేషాలు రాయలసీమ ప్రజలు వెయ్యరు అని .
2. పులివెందుల రాజకీయాలు వద్దు .
ఏమి రాజకీయాలు చేశారు పులివెందుల వాళ్ళు ? జగన్ ను విమర్శించటానికి పులివెందుల పేరు వాడటం ఎందుకు?పులివెందులలో దొమ్మీలు దోపిడీలు ,ఇళ్ల మీద పడి దోచుకోవటాలు ఎప్పుడు లేవు.జగన్ మీద కోపాన్ని ఊరి మీదికి మరల్చటం సరైంది కాదు.
3. కర్నూల్లో ముఠా కోరులను తరిమికొట్టండి .
వాళ్ళకి ముఠాలుంటే,తగాదాలుంటే వాళ్ళల్లో వాళ్ళు తన్నుకు చచ్చారు గానీ ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. అయినా ముఠా గొడవలు , ఫ్యాక్షన్ అంతరించిపోయి ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళ మానిన గాయాన్ని పెక్కులు లేపి చూడటం ఎందుకు?కర్నూల్ జిల్లాలో పెద్ద ముఠాదారులంతా ఏపార్టీలో ఉన్నారో చూశారా ? .
4. పులివెందుల వేషాలేస్తే తాట తీస్తా .
రాజకీయంగా ప్రత్యర్థిని విమర్శించటానికి ప్రతిసారి ఊరి పేరు ఎందుకు బద్నాం చెయ్యటం?నేరుగా జగన్ పేరు పెట్టి విమర్శలు చేస్తే సరిపోతుంది. పులివెందుల జగన్ కుటుంబాన్ని own చేసుకుంది,గత 40 సంవత్సరాలుగా టీడీపీ సునామిలాంటి 1983,1994 ఎన్నికల్లో కూడా జగన్ కుటుంబాన్నే గెలిపించారు. అందుకే పులివెందుల మీద కోపంతో ప్రతిసారి పులివెందుల రాజకీయాలు అని నిందిస్తున్నారా?ఆ నిందలు ఎవరికీ తగిలేది?అక్కడి ప్రజలకు తగలవా?
5 . రాజధానిని పులివెందులలో పెట్టుకొంటారా .
“నా మనసులో కర్నూల్ రాజధాని” అని ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడి ఇప్పుడు సీమలో రాజధాని పెడతారా?అని ప్రశ్నించటంలో ఔచిత్యం ఏమిటి?
6 .కర్నూల్ కి కోర్టుని మారిస్తే జగన్ కి సులభం .
జగన్ కేసులు విచారిస్తుంది హైదరాబాదులోని సిబిఐ కోర్టు. ఇప్పుడు ఆ కేసులకు కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు.
కర్నూలులో హై కోర్ట్ పెట్టటం పవన్ కు ఇష్టం లేకపోతె ఆ మాటే నేరుగా చెప్తే సరిపోతుంది. జగన్ అయితే తాడేపల్లి లేకుంటే హైద్రాబాద్ లో ఉంటాడు కానీ కర్నూలోనో పులివెందులలోనో నివాసం ఉండడు అన్న విషయం పవన్ కు తెలిసి కూడా కర్నూల్ లో హై కోర్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకు ? .
7 . కడప ఫ్యాక్షన్ రాజకీయాలు గోదావరి జిల్లాలోకి తీసుకొస్తే తాట తీస్తా .
రాజకీయ నాయకులు హుందాగా మాట్లాడకుండా ఇలా మాట్లాడితే అభిమానులు ఇంకెలా మాట్లాడుతారు , ఇలా దుష్ప్రచారం చేసేకదా ఇతర ప్రాంతాల్లో సీమవాళ్ళకి , కడప వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వాలంటే కొంతకాలం వామ్మో అనేట్టు చేసింది సినిమా వాళ్ళు . మీరు నక్సలైట్ వేషం వేసిన జల్సా సినిమా మళ్లీ చూడండి. సీమ ఫ్యాక్షన్ నేతలు కిరాయి హంతకులు,ముఠాకోరులుగా , అత్యంత క్రూరులుగా ఎలా చిత్రీకరించారో.
రాజకీయ ఆరోపణలకు సీమ పేరును వాడటం ఆపేయండి.అలా కాకూండా సీమ,కడప,పులివెందుల అంటూ ప్రసంగాలు కొనసాగిస్తే పవన్ అభిమానులు కూడా ఎదురు ప్రశ్నఅడిగే పరిస్థితి త్వరలోనే వస్తుంది.
ఇంకా కురసాల కన్నబాబు నుద్దేశించి కానీ , పలు ప్రాంతాల నేతల్ని , కొందరు వ్యక్తుల్ని ఉద్దేశించి తాట తీస్తా , తోలు తీస్తా , ఉరికించి కొడతా , చొక్కా పట్టుకు నిలదీస్తాలాంటి అభ్యంతర పదజాలాన్ని , సభ్య సమాజం ఆమోదించని దిగజారుడు భాషని పదే పదే వాడటం మీ లాంటి వ్యక్తులు ప్రజాసేవకి మూలాధారమైన రాజకీయాలకు తగరు అనే అభిప్రాయం జనాలందరిలో వ్యక్తమవుతోంది . ముందు ముందు అయినా ఇలాంటి బజారు కొట్లాటల దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకొంటారని ఆశిస్తున్నాం
ప్రాంతం గురించి,ఊరి గురించి ,సంస్కృతీ గురించి వాఖ్యలు కట్టిపెట్టి సమస్యల మీద మాట్లాడితే కనీసం మీ అభిమానులన్నా సంతోషపడతారు. సినిమా డైలాగులు రాజకీయాల్లో చెల్లవు.