Idream media
Idream media
వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బహుశా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మకమైనదని చెప్పొచ్చు. ఇంతకీ పవన్ ఏం చెప్పారంటే.. బద్వేల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బద్వేల్ అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికలో జనసేన నుంచి అభ్యర్థిని పోటీకి నిలుపడం లేదని తేల్చి చెప్పారు. అనంతపురం పర్యటనలో పవన్ ఈ విషయం స్పష్టం చేశారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చిందని, చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నామని పవన్ ప్రకటించారు. అంతేకాదు.. ఇతర పార్టీలు కూడా తప్పుకుని ఉప ఎన్నికను ఏక గ్రీవం చేయాలని కోరారు.
ఇప్పటి వరకు రాజకీయాలు చేయలేదని, ఇక నుంచి రాజకీయాలు మొదలుపెడతానని కొద్ది రోజుల క్రితమే పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ విషయం ఇప్పుడెందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే.. బద్వేల్ లో పోటీ నుంచి తప్పుకున్నట్లు పవన్ ప్రకటించడాన్ని రాజకీయ ఎత్తుగడగా పేర్కొనవచ్చు. పార్టీ పరువు పరంగా పవన్ తీసుకున్న బెస్ట్ నిర్ణయమని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే.. రిపబ్లిక్ సినిమా వేడుక అనంతరం పవన్ వ్యాఖ్యలు, ప్రచారాన్ని గమనిస్తే.. వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం అటుంచితే తనకు అధికారం ఇవ్వాలని, ఒక్కసారి గెలిపిస్తే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎల్లగొట్టే రోజులు దగ్గర పడ్డాయంటూ స్టేట్ మెంట్ లు ఇస్తున్నారు.
Also Read : అనువుగాని చోట పవన్ సభ …..
ఇటువంటి క్రమంలో.. బద్వేల్ లో పోటీ చేస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని వైసీపీ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అక్కడ వైసీపీ మినహా మరే పార్టీ గెలిచే చాన్సే లేదని కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. అందుకు స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం సాధించిన రికార్డు స్థాయి ఫలితాలే నిదర్శనం. ఆ విషయం జనసేనాని కూడా గుర్తించే ఇటువంటి నిర్ణయం ప్రకటించారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా కూడా ఓడిపోవడం వ్యక్తిగతంగా, పార్టీ పరంగా చాలా మైనస్ అయింది. ఇప్పుడు కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంతా అవినీతి, అన్నీ అప్పులు, అన్యాయాలు.. అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక వేళ జనసేన బద్వేల్ లో పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోక పోతే పవన్ పరువు పోవడం ఖాయం. అది భవిష్యత్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే పవన్ రాజకీయ నాయకుడిగా ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకున్నాడని చెప్పొచ్చు.
Also Read : కులానికి పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్.. అసలు లక్ష్యం ఏమిటి..?
మరి ఇప్పుడు ఉత్పన్నమవుతున్న మరో ప్రశ్న ఏంటంటే.. బీజేపీ సంగతేంటని. పార్టీలో చర్చించే ఈ నిర్ణయం ప్రకటించినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. తమ పార్టీతో జత కలిసిన బీజేపీతో చర్చించారా లేదా అనేది తెలియాలి. బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ రెండు సార్లు బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో సమావేశం అయ్యారు. ఇరు పార్టీలు సమష్టిగా అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించారు కూడా. ఇప్పుడు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పవన్ చెప్పారు. దీనికి బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అలాగే బద్వేల్ ను ఏకగ్రీవం చేయాలని, ఇతర పార్టీలు కూడా పోటీ నుంచి తప్పుకోవాలని పవన్ సూచించారు. తెలుగు దేశం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. జనసేన తాజా నిర్ణయం నేపథ్యంలో టీడీపీ స్పందన ఏంటో కూడా వేచి చూడాలి.