iDreamPost
android-app
ios-app

పవన్ పరామర్శ

పవన్ పరామర్శ

జనసేన అధినేత పవన్ కాకినాడ వచ్చారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల జరిగిన దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ పరామర్శించారు. ఆయనతో పాటుగా పార్టీ కార్యకర్తలు కాకినాడకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లోని కొన్ని కార్లను పోలీసులు మధ్యలోనే ఆపేశారు. కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా పంతం నానాజీ నివాసానికి వెళ్లారు. ఆదివారం జరిగిన దాడిలో గాయపడ్డ కార్యకర్తలను నానాజీ నివాసంలో పరామర్శించారు. ఘటన జరిగిన తీరును పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు వివరించారు. అనంతరం ఆరోజు జరిగిన పరిణామాలపై పార్టీ నేతలతో పవన్‌ చర్చించారు \. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పవన్ కాకినాడ పర్యటన సందర్భంగా టెన్షన్ వాతావరణం కొనసాగింది. ఈ సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో కర్ఫ్యూ మాదిరిగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విశాఖ నుండి తుని చేరుకున్న పవన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా కాకినాడ చేరుకున్నారు. మీడియాతో మాట్లాడిన జనసేనాని పార్టీ కార్యకర్తలపై దాడులు దురదృష్టకరమన్నారు. పండుగ సమయంలో ఇలాంటి ఘటనలు బాధాకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే గొడవలు సృష్టిస్తోందని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని, పోలీసులు కూడా చోద్యం చూశారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సహనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని, శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని తాము అనుకుంటే వైసీపీవాళ్లు ఇక్కడ ఉండలేరని పవన్ హెచ్చరించారు. తామ తెగించి రోడ్లపైకి వస్తే ఏమీ చేయలేరని ఆగ్రహించారు.

రాష్ట్రంలో వైసీపీ పాలన వస్తే పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్‌ రాజ్యం వస్తుందని తాను ముందే చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. మమ్మల్ని తిట్టి, మమ్మల్నికొట్టి తిరిగి మాపై కేసులు పెడతారా.? అంటూ మండిపడ్డారు. పచ్చి బూతులు తిట్టి కారణం లేకుండా దాడులు చేస్తారా.? గొడవకు కారణమైనవారిపై సుమోటోగా కేసు పెట్టకుండా.. నిరసనలు చేస్తున్నవారిని అరెస్ట్‌లు చేస్తారా.? అంటూ ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరేమైనా దిగొచ్చారా.? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీనేతలు స్థాయిదాటి మాట్లాడుతున్నారని, ఈ సంఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు. జనసేనికులపై దాడి విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ఎస్పీ స్పందించి దాడులు చేసినవారిపై కేసులు పెట్టాలని, అన్యాయాలకు పోలీసులు గొడుగు పట్టొద్దన్నారు. మరోసారి ఇలాంటి దాడులు జరిగితే పోలీసులదే బాధ్యతన్నారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కలుషితం చేయడానికే వైసీపీలో మదమెక్కిన నేతలు మాట్లాడుతున్నారని వాళ్ళ మదాన్ని ప్రజలు అణచివేస్తారని పవన్‌ విరుచుకుపడ్డారు. అయితే అందరూ ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ పర్యటనను ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసులు గాని అడ్డుకోలేదు. ఆయనకు పూర్తిస్థాయి స్వేచ్ఛనిచ్చి కాకినాడలో పర్యటించడంతో పాటుగా తన షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలకు పోలీసులు సహకరించారు.