Idream media
Idream media
పవన్ కళ్యాణ్ ను రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించడం లేదా..? పవన్ ను కేవలం నటుడిగానే భావిస్తున్నారా..? అంటే జగన్ వైఖరి అవుననే సమాధానం ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను వ్యతిరేకిస్తున్న వారికి నేడు జరిగిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సభలో సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వెంకయ్య నాయుడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి.. మీ పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సీఎం జగన్ ” నటుడు పవన్” అని సంభోదించారు.
2014 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మార్చ్ 14వ తేదీన సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ అనే పేరుతొ పార్టీ స్థాపించారు. అంతకు ముందే పవన్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజా రాజ్యం పార్టీ యువజం విభాగం అధ్యక్షుడుగా పని చేశారు. ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థుల తరఫున రాష్ట్రమంతా పర్యటించి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల పంచలు ఊడగొట్టాలంటూ ప్రకటనలు చేసి వార్తల్లో నిలిచారు. అవినీతి చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు. అనంతరం 2014 ఎన్నికల వరకు సినిమాలు చేసి ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీ పెట్టారు.
2014 ఎన్నికల్లో జనసేన తరఫున పవన్ గాని, ఇతరులు గాని పోటీ చేయలేదు. టిడిపి, బిజెపి కూటమి కి మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి గెలిచిన తర్వాత మళ్ళి మూడేళ్ళ పాటు సైలెంట్ గా ఉన్నారు. మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు రాజధాని భూసేకరణ అంశంపై బయటకు వచ్చారు. 2019 ఎన్నికలు ముందు వచ్చి.. 650 హామీలు ఇచ్చి అమలు చేయని టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, ప్రతిపక్ష పార్టీ పై విమర్శలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో కూడా జగన్.. పవన్ వ్యాఖ్యలపై స్పందించలేదు. వ్యక్తిగతంగా విమర్శలు చేసినా జగన్ పవన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోలేదు. పవన్ తో పొత్తు పెట్టుకుందామని వైఎస్సార్ సిపి లోని కొంతమంది నేతలు సూచించినా జగన్ తోసిపుచ్చారు.
2019 ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థులకు నిలబెట్టారు. తానూ గాజువాక, భీమవరం లలో పోటీ చేశారు. ఐతే ఒక్క చోటా గెలవలేదు. తూర్పుగోదావరి రాజోలు లో జనసేన అభ్యర్థిగా సుమారు 700 ఓట్ల తో రాపాక వరప్రసాద్ గెలిచినా.. అది అతని సొంత బలం వాళ్ళ సాధ్యమైందని మీడియా, రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ఎన్నికలు ముగిసి 151 సీట్ల తో అధికారం చేపట్టిన జగన్ తాను ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. టిడిపి హయాంలో గాడి తప్పిన పాలనను పట్టాలెక్కించేలా విధాన పరమైన చర్యలు తీసుకుంటున్నారు.
వైఎస్సార్ సిపి సర్కారు పధకాలపై, సీఎం జగన్ నిర్ణయాలపై పవన్ అనేక విమర్శలు చేసినా సీఎం జగన్ వాటిపై ఒక్కసారి కూడా స్పందించలేదు. ఇటీవల ఇసుక కొరతపై విశాఖ లో లాంగ్ మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించి ఆరోపణలు, జగన్ పాలన పై విమర్శలు చేసినా ఆ విమర్శలను సీఎం జగన్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ అధినేతగా సీఎం జగన్ పరిగణించడం లేదని, అందుకే ” నటుడు పవన్” అని సంభోదించారని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.