iDreamPost
iDreamPost
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఓ సమస్య ఉంది. ఆయన అనేక అంశాలను ప్రస్తావించే ప్రయత్నంలో ఉంటారు. కానీ ఏ విషయంలోనూ సమగ్రంగా వ్యవహరించలేరనే అభిప్రాయం ఉంది. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. తాజాగా కేంద్ర బడ్జెట్ మీద ఆయన స్పందించిన తీరు కొనసాగింపుగానే చెప్పాలి. ఏపీకి విభజనచట్టం ప్రకారం రావాల్సిన హామీలలో కేంద్రం ఒక్కటి కూడా పూర్తి చేయడం లేదన్నది సుస్పష్టం. కేంద్రం ఏపీ పట్ల సవతి ప్రేమ చూపుతుందనే అబిప్రాయం సర్వత్రా ఉంది. కేంద్రం కూడా ఇచ్చిన మాటనే కాకుండా చట్టంలోని అంశాలను సైతం నాన్చుతూ ఏపీని నిండా ముంచేలా కనిపిస్తోంది.
ఓ బాధ్యతగల ప్రతిపక్ష నేతగా మొదట పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని నిలదీయాలి. అందులో తాను స్వయంగా మద్ధతుగా నిలుస్తున్న ప్రభుత్వం కాబట్టి నిధులు రాబట్టే ప్రయత్నం చేయాలి. మిత్రపక్షం అన్యాయం చేస్తుంటే దానిని సవరించాలి. కానీ పవన్ మాత్రం దానికి పూర్తి భిన్నం. సమస్య కేంద్రంలో ఉంటే ఆయన దృష్టి మాత్రం జగన్ మీదే ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ జగన్ ని తప్పుబట్టడమే తప్ప సమస్యను పరిష్కరించాలనే ఆలోచన ఉన్నట్టు కనిపించదు. ఏపీకి రైల్వే జోన్ ఇవ్వాల్సి ఉంది. విభజనచట్టంలో భాగం. ఎనిమిదేళ్లవుతోంది.. అతీ గతీలేదన్నది అందరికీ అర్థమవుతోంది. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ కి ఎందుకు పట్టదో తెలియదు. కేవలం రైల్వేజోన్ మాత్రమే కాదు, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మోదీ సర్కారుది అదే తీరు.
కేంద్రాన్ని ప్రశ్నించి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు నిధులు రాబట్టలేకపోతోందనే సందేహం వెలిబుచ్చితే పవన్ కనీసం అభిమానులనయినా సంతృప్తి పరచగలుగుతారు. కానీ జనసేన ధోరణి అందుకు విరుద్ధంగా ఉంటుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు, దానిని కేంద్రమే పూర్తి చేయాల్సి ఉందనే అంచనా కూడా లేకుండా రాష్ట్రం ఎందుకు చేయలేకపోతోందని మాట్లాడడమే రాజకీయ అవివేకాన్ని చాటుతోంది. పోలవరంతో పాటుగా కనీసం కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు శంకుస్థాపన చేసి ఎంత కాలమయ్యింది. ఏవేవి ఎక్కడున్నాయన్నదయినా పవన్ మాట్లాడాలి కదా. అది కూడా లేకుండా పవన్ కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే నిందించి ఏం సాధిస్తారన్నది సందేహమే. బడ్జెట్ ఇచ్చిన మరునాడే పార్లమెంట్ సాక్షిగా వైఎస్సార్సీపీ కేంద్రాన్ని నిలదీసింది. ఏపీకి అన్యాయం చేస్తున్నారని గళమెత్తింది. అయినా అది పవన్ కి వినిపించకపోవడమే కాకుండా, కనీసం మోదీ పట్టించుకోవడం లేదనే గ్రహించకపోవడం ఆపార్టీ దుస్థితికి అద్దంపడుతోంది.
Also Read : నొప్పించక తానొవ్వక … సన్నాయి నొక్కులు !