Idream media
Idream media
మామూలుగా అయితే అదేం పిచ్చి ప్రశ్న అనే ప్రశ్న ఎవరికైనా తలెత్తుతుంది. కాకపోతే.. తాజా సమీకరణాలపై కాస్త లుక్కేస్తే కొంచెం కొంచెం అనుమానాలు రావడం మొదలవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి కనీసం అధినేత పవన్ కల్యాణ్ కూడా గెలవలేదు. రెండు చోట్ల పోటీ చేస్తే.. రెండు చోట్లా కూడా ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి ఒకే ఒక్కడు విజయం సాధించాడు. ఇప్పుడు ఆయన కూడా జనసేనతో సంబంధం లేనట్లే ఉంటున్నాడు. అంటే.. ఏపీలో జనసేన కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనట్లే లెక్క. పవన్ పార్టీ పెట్టిన కొత్తలో ఎంతో ఊపుండేది. యువతలో రాజకీయ నాయకుడిగా కూడా క్రేజు కనిపించేది. ఎన్నికలకు వచ్చేసరికి అవేమీ అక్కరకు రాలేదు. పవన్ ను రాజకీయ నాయకుడిగా ప్రజలు గుర్తించలేదు.
ఎన్నికల అనంతరం కొంత కాలం రాజకీయాలకే పరిమితమైన పవన్ కల్యాణ్.. గతంలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా మళ్లీ సినిమాల బాట పట్టారు. నాకు సినిమాలు తప్ప వేరే వ్యాపారం లేదని, పార్టీని నడిపించేందుకు డబ్బు కోసం నటించకతప్పదంటూ స్టేట్ మెంట్ ఇచ్చి మళ్లీ మొదలెట్టేశారు. వకీల్ సాబ్ రిలీజ్ అనంతరం వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నారు. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది. ఆ తర్వాత హరిహర వీరమల్లు, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న యథా కాలమ్.. తథా వ్యవహారమ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా.. ఇలా వరుస పెట్టి నటించేందుకు సిద్ధమవుతున్న పవన్.. అనూహ్యంగా కొద్ది రోజులుగా పొలిటికల్ గా కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నారు.
అయితే.. ఆ రాజకీయాలు కేవలం వైసీపీ టార్గెట్ గానే కొనసాగుతుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విపక్షం అధికార పార్టీని విమర్శించడం అనేది సాధారణమే. అందులో అనుమానం అవసరం లేదు. అయితే.. అధికారంలోకి రావాలంటే అధికార పార్టీతో పాటు.. ప్రతిపక్ష పార్టీ టీడీపీ తప్పులను కూడా ఎత్తి చూపాలి. అప్పుడే అధికార, ప్రతిపక్ష పార్టీలకు కాకుండా జనం మూడో పార్టీ వైపు చూస్తారు. కానీ జనసేనాని వైసీపీ సర్కారుపైన, ముఖ్యమంత్రిపైన మాత్రమే బాణాలు ఎక్కుపెడుతున్నారు. ‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ ఆర్ సీపీ’ అంటూ కొద్దిరోజుల క్రితం ట్విట్టర్ లో పెట్టిన పోస్టు, తాజాగా రిపబ్లిక్ మూవీ వేడుకలో పవన్ వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఇది కొత్త అనుమానాలను, ఊహాగానాలను తెరపైకి తెస్తోంది.
‘ఇక నుంచి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజల పక్షాన నిలబడతాం. ప్రతిపక్ష నాయకులను ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు బలంగా నిలిచారు.‘ అని పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల లోపు జనసేనను బలోపేతం చేసేందుకే పవన్ పర్యటనలకు సిద్ధమవుతున్నారని జనసైనికులు భావిస్తుండగా.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం.. ఏకాకిగా మిగిలిన పవన్ ఈసారి మళ్లీ టీడీపీ జట్టుకట్టే అవకాశాలు భారీగానే ఉన్నాయన్న అంచనాలు పెరుగుతున్నాయి.
2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకోగా జనసేన అధినేత వారికి మద్దతుగా నిలిచారు. పవన్ – మోదీ మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ 2014 ఎన్నికల ఫలితాల తరువాత పెద్ద ఎత్తున చర్చ సాగింది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ..ఏపీ ప్రభుత్వంలో బీజేపీ చేరి పరస్పరం సహకరించుకున్నారు. కొద్ది కాలం తర్వాత గడిచేకొద్దీ ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఉప సంహరించుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందంటూ టీడీపీకి జనసేన అధినేత పవన్ గుడ్ బై చెప్పారు. ఫలితంగా ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో జగన్ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జనసేన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. అయినప్పటికీ ఏడాది కాలంలో వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధించింది.
తాజాగా, జరిగిన ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికారికంగా కాకున్నా..లోపాయి కారీగా స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో జనసేన-టీడీపీ నేతలు పరస్పరం సహకరించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైన అవగాహన బహిరంగంగానే కనిపించింది. అయితే, ఇది అధినేతల అంగీకారంతో కాదని..స్థానికంగా తీసుకున్న నిర్ణయాలని చెబుతున్నారు. పోనీ అలాగే అనుకున్నా.. మరి కేవలం వైసీపీనే టార్గెట్ చేస్తూ పవన్ చేస్తున్న రాజకీయాలు దేనికి సంకేతం? జనసేన బలోపేతానికా, ఏం చేసైనా సరే వైసీపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యమా? అనే సందేహాలు ఎవరికైనా తలెత్తుతాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట లో టీడీపీ – జనసేన కలిసి ఎంపీపీ గెలుచుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో రాజోలు నియోజకవర్గ పరిధిలోని రాజోలు, మలికిపురం మండల పరిషత్ లు గెలుచుకున్నాయి. దీంతో..మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా జనసేన – టీడీపీ తిరిగి పొత్తు ఖరారు చేసుకోవాలని..దీని ద్వారా సంచలనాలు జరగుతాయంటూ చెప్పుకొస్తున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మరో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా అన్నీ పరిశీలిస్తే.. ప్రస్తుతం సినిమాల్లో విపరీతరమైన బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారం మోయకుండా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మరి మున్ముందు ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయో చూడాలి.