iDreamPost
android-app
ios-app

పింక్..కాషాయం!

  • Published Dec 05, 2019 | 11:28 AM Updated Updated Dec 05, 2019 | 11:28 AM
పింక్..కాషాయం!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్, పొలిటిక‌ల్ జ‌న‌సేనాని ప‌య‌నం ఎటు అన్న‌ది సందిగ్ధంగా మారింది. మళ్ళీ మొఖానికి రంగులు వేసుకుంటార‌ని భావిస్తున్న ద‌శ‌లో ఆయ‌న రాజ‌కీయంగా రంగులు మారుస్తున్నారు. ఓ వైపు సినీ ద‌ర్శ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూ మ‌రోవైపు రాజ‌కీయంగా త‌న‌కు దర్శ‌క‌త్వం వ‌హించే బాధ్య‌త‌ను బీజేపీకి అప్ప‌గిస్తున్నారు. జ‌న‌సేన భ‌విత‌వ్యాన్ని ఆత్మ‌హ‌త్యాస‌దృశ్యం చేయ‌డ‌మే కాకుండా, త‌న రాజ‌కీయ జీవితాన్ని ప‌ణంగా పెడుతున్న‌ట్టు తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హార‌శైలి చాటుతోంది. 
రాజ‌కీయంగా ఎద‌గ‌డానికి విప‌క్షంలో ఉన్నవాళ్ల‌కే ఎప్పుడ‌యినా అవ‌కాశం ఉంటుంది. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ఛాన్స్ ద‌క్కుతుంది. అందుకు వైఎస్సార్ నుంచి జ‌గ‌న్ వ‌ర‌కూ అనేక ఊద‌హ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే రీతిలో రాజ‌కీయాలు చేయాల్సిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆరు నెల‌ల‌కే ప్ర‌తిప‌క్షంలో ఉండ‌లేక పాల‌క బీజేపీ ప‌క్షాన చేరేందుకు స‌న్న‌ద్ధ‌మ‌యిపోయారు. త‌ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌త్యామ్నాయ నేత‌గా ఎదిగే అవ‌కాశం చేజార్చుకుంటున్నారు.

Read Also: కడపే ఒక గ్రంథాలయం పవన్ కళ్యాణ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం, బీజేపీ సంక‌ట స్థితిలో ఉన్నాయి. టీడీపీకి నాయ‌క‌త్వం స‌మ‌స్య వెంటాడుతోంది. చంద్ర‌బాబు త‌ర్వాత ఎవ‌రూ అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం దొర‌క‌డం లేదు. నారా లోకేష్ ఇప్ప‌టికే విఫ‌ల నేత‌గా అంతా అంచ‌నాకు వ‌చ్చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియ‌దు. ఒక‌వేళ ఆయ‌న వ‌చ్చినా టీడీపీ ప‌రిస్థితి ఏమ‌వుతుందోన‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. ఇక కేంద్రంలో అధికారాన్ని ఉప‌యోగించుకుని ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీది కూడా అదే ప‌రిస్థితి. స‌ర‌యిన నాయ‌క‌త్వం లేక స‌త‌మ‌తం అవుతోంది. చాలామందిని చేర్చుకున్నా ప్ర‌జాక్షేత్రంలో ప‌ట్టున్న వారు బీజేపీ పంచ‌న చేరడానికి సందేహిస్తున్నారు. కొత్త‌గా క‌మ‌లం వైపు చూసినట్టు క‌నిపించిన నేత‌ల్లో కూడా స్ప‌ష్ట‌త క‌నిపించ‌డం లేదు. క్రౌడ్ ఫుల్ల‌ర్ లేని ఆపార్టీకి ఏపీలో బ‌ల‌ప‌డే అవ‌కాశాలు చాలా నామ‌మాత్రంగా ఉన్నాయి. 
ఇలాంటి స‌మ‌యంలో నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి మంచి అవ‌కాశం ద‌క్కింది. ఏపీలో ప్ర‌త్యామ్నాయ నేత‌గా ఎదిగేందుకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. యువ‌త‌లో ఆద‌ర‌ణ‌, బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం వంటివి ఆయ‌న‌కు పెద్ద ఆయుధాలుగా ఉన్నాయి. మొన్న‌టి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వాటినుంచి పాఠాలు నేర్చుకుని, పార్టీని పునర్నిర్మించుకుంటే ఆయ‌న‌కు మంచి భ‌విష్య‌త్ ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ప‌వ‌న్ పూర్తిగా జ‌గ‌న్ తో పోటీప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. సినిమాల్లో మెయిన్ విల‌న్ ని ఢీకొట్టి హీరో అయిన‌ట్టుగా రాజ‌కీయాల్లో సీఎంపై కాలుదువ్వితే త‌న‌కు క్రేజ్ పెరుగుతుంద‌నే అపోహ‌ల్లో ప‌వ‌న్ ఉన్నారు. దానికార‌ణంగానే ఆరు నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే వీధుల్లోకి వ‌చ్చి జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌ల‌కు దిగుతూ, ఓ వ‌ర్గాన్ని సంతృప్తిప‌ర‌చ‌డానికే ప‌రిమితం అవుతున్నారు.

Read Also: రంగుల రాజకీయం – అప్పుుడు మీరు వేశారు కాబట్టి ఇప్పుడు మేము కూడా !!!

వాస్త‌వానికి ప‌వ‌న్ తీరు ఆయ‌న వీరాభిమానుల‌కు రుచిస్తోంది. వారి త‌ర్వాత టీడీపీ, బీజేపీ నేత‌ల‌కే ఆనందాన్నిస్తోంది. ఏపీ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా చేస్తున్న విమ‌ర్శ‌ల కార‌ణంగా ప‌వ‌న్ మ‌రింత ప‌లుచ‌న అవుతున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఇప్ప‌టికే ఇంగ్లీష్ భాషా బోధ‌న వంటి అనేక అంశాల్లో ప‌వ‌న్ తీరు దానికి ఉదాహ‌ర‌ణ‌. రాజ‌కీయంగా గ‌డిచిన మూడు ద‌శాబ్దాలుగా కీల‌కంగా ఉన్న సామాజిక‌వ‌ర్గంలోని పెద్ద‌ల‌కు కావాల్సింది అదేన‌ని కొంద‌రు సందేహిస్తున్నారు. కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి నేత‌లు బ‌ల‌ప‌డితే ప్ర‌త్యామ్నాయ నేత‌గా మారే అవ‌కాశం ఉంటుంది. అప్పుడు రాజ‌కీయాల్లో పున‌స్స‌మీక‌ర‌ణాల కారణంగా ఇన్నాళ్లుగా రెడ్డి సామాజిక‌వ‌ర్గాన్ని ఢీ కొడుతున్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గం మూడో స్థానానికే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. అందుకే ఆ వ‌ర్గం ప‌వ‌న్ మ‌రింత వేగంగా ప‌త‌నం కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప‌వ‌న్ బ‌ల‌హీన‌ప‌డితే కాపు నేత‌లు త‌మ‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డమే మ‌రో మార్గం లేకుండా చేయ‌వ‌చ్చ‌ని క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలో కొంద‌రి వ్యూహంగా అంచ‌నా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే మీడియాలో ప్రాధాన్య‌త, ఇత‌ర ర‌కాల స‌హాయాలు అందిస్తూ ప‌వ‌న్ పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టించే దిశ‌గా సాగుతున్న‌ట్టు సందేహిస్తున్నారు. 
బీజేపీలో విలీనం చేసే దిశ‌గా ప‌వ‌న్ సాగుతున్న‌ట్టు తాజా ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. అదే జ‌రిగి కాషాయం ధరించినా ప‌వ‌న్ కి ప్ర‌యోజ‌నం ద‌క్క‌దు. దానికి ప్ర‌ధాన కార‌ణం ఏపీ బీజేపీలో పెత్త‌నం చేసే సామాజిక‌వ‌ర్గం చాలాకాలంగా పాగా వేసింది. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ని పేరుకి పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్ప‌టికీ పెత్త‌నం మాత్రం మ‌రో వ‌ర్గం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఒక‌వేళ నిజంగా ప‌వ‌న్ కి ప్రాదాన్య‌త ఇచ్చిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల త‌ర్వాత కమ‌లం గూటిలో క‌మ్మ నేత‌లు వేసే ఎత్తుల ముందు ప‌వ‌న్ చిత్తు కాక త‌ప్ప‌ద‌ని ప‌లువురు భావిస్తున్నారు.  విలీనం కాకుండా పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ పార్టీ పూర్తిగా తోక‌పార్టీగా మిగ‌ల‌క త‌ప్పేలా లేదు. క్యాడ‌ర్ ఉన్న టీడీపీ, అధికార బ‌లం ఉన్న బీజేపీ ముందు జ‌న‌సేన ఆఖ‌రికి జ‌న‌సున్నాగా మారినా ఆశ్చ‌ర్యం లేదు. త‌ద్వారా ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలంటూ ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ భ‌విత‌వ్యం గ‌డ్డు స్థితికి నెట్ట‌బ‌డేలా క‌నిపిస్తోంది. క్రౌడ్ ఫుల్ల‌ర్ గా ప‌వ‌న్ ని ముందు పెట్టి ఆ రెండు పార్టీల్లోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే వ‌ర్గమే రాజ‌కీయాలు చేసుకునే దిశ‌లో ప‌రిస్థితి సాగుతున్న‌ట్టుగా ఉంది.

Read Also: ట్రాన్స్ జెండర్స్ బిల్-2019 పై రాష్ట్రపతి సంతకం పెట్టొద్దు

ఈ ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం కూడా విస్మ‌య‌క‌ర‌మే. ఇప్ప‌టికే ఆయ‌న పింక్ రీమేక్ లో న‌టిస్తున్న బోనీక‌పూర్ లీకులిచ్చారు. దాంతో నిజంగానే  పింక్ మువీతో పొలిటిక‌ల్ బ్రేక్ తీసుకున్నా, లేక కాషాయధారిగా బీజేపీ బాట ప‌ట్టినా చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో క‌ష్టాలు కొనితెచ్చుకున్న‌ట్టేన‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. రాజ‌కీయంగా అవ‌కాశాల‌ను చేజార్చుకుని, ఆఖ‌రికి అమ్మ‌డూ లెట్స్ డూ కుమ్ముడూ అంటున్న చిరంజీవి మాదిరిగానే ప‌వ‌న్ కూడా చేజేతులా ఉభ‌య భ్ర‌ష్టుత్వం అవుతున్న‌ట్టు అనుమానిస్తున్నారు.