నవ్విన నాపచేనే పండుతుందని ఒక సామెత ఉంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న తరుణంలో కోవిడ్ 19 వ్యాప్తిని క్యాష్ చేసుకునేందుకు పతంజలి సంస్థ రూపొందించిన “కరోనిల్ కిట్” విషయంలో చెలరేగిన దుమారం అంతా ఇంతా కాదు.శరీరంలోని కరోనా వైరస్ ను నాశనం చేస్తుందంటూ స్వయంగా యోగా గురువు, పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్ ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
కరోన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న తరుణంలో బాబా రామ్‌దేవ్ ప్రకటన పెద్ద షాక్ కలిగించిందనే చెప్పవచ్చు. వెంటనే ఆయుష్ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల ధృవీకరణ జరగకుండానే బాబా రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద కరోనిల్ ఔషధాన్ని ప్రకటించారని వెల్లడించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ రంగంలోకి దిగడంతో అప్పటివరకూ కరోనా వైరస్ బారినుండి తమ కిట్ కాపాడుతుందని ప్రకటించిన బాబా రామ్‌దేవ్ మాట మార్చి తమ కరోనిల్ కిట్ వ్యాధి నిరోధక శక్తిని పెంపోందిస్తుందని ప్రకటించారు. దీంతో కరోనిల్ కిట్ పనితీరుపై ప్రజల్లో పలు సందేహాలు చెలరేగాయి.
ఇదిలా ఉంటే పతంజలి సంస్థ తాజా ప్రకటనతో పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నాలుగు నెలల వ్యవధిలోనే ఈ కరోనిల్ కిట్‌లను అమ్మడం ద్వారా 250 కోట్ల రూపాయల బిజినేస్ చేసినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది. మనదేశంలోనే కాక విదేశాల్లో కూడా కరోనిల్ కిట్‌ల అమ్మకాల ద్వారా ఈ మొత్తాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. పతంజలి సంస్థ దాదాపు 2.5 మిలియన్ల కిట్‌లను ఆన్‌లైన్, పతంజలి స్టోర్‌లు, డైరెక్ట్ మార్కెటింగ్, మెడికల్ షాపుల ద్వారా విక్రయించినట్లు ప్రకటించడంతో పతంజలి సంస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు.
ప్రజలను కరోనా వైరస్ బారినుండి కరోనిల్ ఔషధ కిట్లు కాపాడతాయని గర్వంగా ప్రకటించిన బాబా రామ్‌దేవ్ కు ఆ ప్రకటనలు బ్యాన్ చేసి కరోనిల్ ఔషధం కరోనా బారినుండి ఎలాంటి రక్షణను ఇవ్వదని ప్రకటించి ఆయుష్ మంత్రిత్వశాఖ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దాంతో కరోనిల్ కిట్లను రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఔషధంగా ప్రచారం చేస్తూ మార్కెట్లోకి తీసుకొచ్చింది పతంజలి సంస్థ.. ప్రజలు మాత్రం పతంజలి కరోనిల్ కిట్లపై నమ్మకం ఉంచినట్లు కంపెనీ వెల్లడించిన ఫలితాల ద్వారా స్పష్టం అవుతుంది. కాగా పతంజలి ప్రకటించిన ఫలితాల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ వివాదాస్పద కరోనిల్ కిట్ల అమ్మకం ద్వారా నాలుగు నెలల్లో 250 కోట్ల మొత్తాన్ని ఆర్జించిందనే వార్త చిన్నపాటి సంచలనం కలిగించే వార్తగా గుర్తించొచ్చు. ఎందుకంటే కరోనిల్ ఔషధంపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ ని తట్టుకుని నిలబడి నవ్విన నాపచేనే పండుతుందని మరోసారి పతంజలి కరోనిల్ కిట్లు నిరూపించాయి.