iDreamPost
android-app
ios-app

ఎన్నికల కోడ్ ఎత్తివేసిన సుప్రీం కోర్ట్, ఎన్నికల అధికారం మాత్రం ఈసీ దే..

ఎన్నికల కోడ్ ఎత్తివేసిన సుప్రీం కోర్ట్,  ఎన్నికల అధికారం మాత్రం ఈసీ దే..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేవియట్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ లో కొద్దిసేపటి క్రితం విచారణ ముగిసింది. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిజ్ ఎస్.ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిజ్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలను వాయిదా వెయ్యాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనని ధర్మాసనం కొట్టిపారేసింది. అయితే రాష్ట్రంలో అమలులో ఉన్న ఎన్నికల కోడ్ ని ఎత్తివేయాలని ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమిషన్ తదుపరి కొత్త షెడ్యూల్ విడుదల చేసేవరకు, ఎన్నికల కోడ్ తో పాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కూడా ఎత్తివేయాలని కోర్ట్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఊరట లభించింది.

ఎన్నికల కోడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన మేరకు ప్రతిఫలం పొందింది అని చెప్పొచ్చు . రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను నిరభ్యంతరంగా కొనసాగించ వచ్చని, కొత్తగా ప్రారంభించబోయే పధకాల విషయంలో మాత్రం ఎన్నికలసంఘంతో చర్చించి వారినుండి అనుమతి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి నేపథ్యంలో ఎన్నికలు తిరిగి ఎప్పుడు నిర్వహించాలి అనే అంశంపై నిర్ణయాధికారం ఎన్నికల సంఘానిదేనని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. కాగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల సంఘం తీసుకున్న ఏకపక్ష వాయిదా పై సుప్రీం కోర్ట్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు నిర్ణయం తీసుకునేముందు ముందస్తుగా రాష్ట్రప్రభుత్వంతో సంప్రదించాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈరోజు జరిగిన విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆత్మారాం వాదనలు వినిపించగా, ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్ తన వాదనలు వినిపించారు. సుప్రీం కోర్ట్ తాజా తీర్పు నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వం ఏవిధంగా ముందుకెళుతుందో చూడాలి. అయితే ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్లపట్టాల పంపిణీకి, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులకు కూడా అడ్డంకులు తొలిగినట్టేనని భావించాలి.