Idream media
Idream media
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులపై బీజేపీ ప్రభుత్వం నిఘా పెట్టిందనే వార్తల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. ఆదివారం దివైర్, వాషింగ్టన్ పోస్టు వంటి మీడియా సంస్థలు పెగాసస్ నిఘాను వెలుగులోకి వార్తలను ప్రచురించడంతో పార్లమెంట్ లోపల, బయట ప్రతిపక్ష పార్టీల నేతలు బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ పరిణామాలపై తాజాగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ స్పందించింది. పౌరుల సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత అంశాలపై చర్చిస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. సమాచార, ఐటీ, హోం మంత్రిత్వ శాఖ అధికారులు కమిటీ ముందు హాజరుకావాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొనడంతో.. పెగాసస్ స్పైవేర్‌పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ విచారణ చేపట్టేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ ఉండడంతో అందరి దృష్టి ఈ కమిటీ చేపట్టబోయే విచారణపై నెలకొంది.
Also Read : టీడీపీ, జనసేనల్లో హోదా అలజడి
కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కూడా పెగాసస్ నిఘానే కారణమనేలా వార్తలు రావడంతో అందరి చూపు బీజేపీ వైపు నిలిచింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం.. పలు రాష్ట్రాలలో బలం లేకపోయినా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కూలిపోయాయి. ఆయా పార్టీలలో ఉండే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం లేదా బీజేపీ వైపు రావడంతో కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి. అక్కడ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టి, అందుకు అనుగుణంగా రాజకీయాలు నడిపి బీజేపీ కుట్రలకు పాల్పడిందనేది ప్రతిపక్ష పార్టీల వాదన.
పెగాసస్ నిఘా ఆరోపణలను బీజేపీ లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆయా వార్త సంస్థల కథనాలకు ఆధారాలు లేవని కొట్టిపారేస్తోంది. కానీ రాజకీయంగా జరిగిన పరిణామాలు ఆయా ఆరోపణలకు బలం చేకూరుతుండడం బీజేపీకి తలనొప్పులు తెచ్చి పెట్టడడం ఖాయంగా కనిపిస్తోంది. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం, నిత్యవసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటడం వంటి పరిణామాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల వైఖరి మారుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అంతకు ముందుగానే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పెగాసస్ నిఘాపై ఏం తెల్చుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : టీఆర్ఎస్ టికెట్ కౌశిక్ రెడ్డికి కాదా?