iDreamPost
android-app
ios-app

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఉమ్మడి సమావేశంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ రోజు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే తో పాటు 15 వ ఆర్ధిక సంఘం ఇచ్చిన నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. రేపు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. గత సంవత్సరంలో ఆర్థిక పనితీరుపై వివరణాత్మక రిపోర్ట్ కార్డ్ అయిన ఎకనామిక్ సర్వే ముందస్తు అంచనా ప్రకారం ఈ రాబోయే సంవత్సరం జాతీయ వృద్ధి రేటు 6 నుండి 6.5 % నమోదవొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ బడ్జెట్ సెషన్ యొక్క మొదటి దశ ఫిభ్రవరి 11 వరుకు జరుగుతుంది. అనంతరం మార్చి 2 నుండి పార్లమెంట్ తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 3 తో ​​ముగుస్తుంది. ఇది ఇలా ఉంటే పార్లమెంట్ సమావేశాలకు ఒక్క రోజు ముందు, ఉభయ సభల పనితీరు సజావుగా జరిగేలా ప్రభుత్వం నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్ సింగ్ ఇతర కేంద్ర మంత్రుల తో పాటు తవార్ చంద్ గెహ్లోట్, అర్జున్ మేఘవాల్, వి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ఈ బడ్జెట్ సమావేశంలో 45 బిల్లులు వరకు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.