iDreamPost
android-app
ios-app

రేప‌టి నుంచే పార్ల‌మెంట్ : ఆ అంశాల‌పై ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌దా?

రేప‌టి నుంచే పార్ల‌మెంట్ : ఆ అంశాల‌పై ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌దా?

సోమ‌వారం (ఈ నెల 19) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క‌రోనా కార‌ణంగా చాలా రాష్ట్రాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయ్యాయి. వ్యాక్సిన్ కొర‌త తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాయి. కేంద్ర స‌హాయం అంతంత మాత్ర‌మే ఉంద‌ని చాలా బీజేపీయేత‌ర రాష్ట్రాలు ప‌లు సంద‌ర్భాల్లో ఆరోప‌ణ‌లు ఎక్కుపెట్టాయి. దీనికితోడు ప‌లు కీల‌క బిల్లులు స‌మావేశాల సంద‌ర్భంగా ఆమోదానికి రానున్నాయి. ఈ క్ర‌మంలో వాటిపై చ‌ర్చ‌ల సంద‌ర్భంగా పార్ల‌మెంట్ స‌మావేశాలు హాట్ హాట్ గా జ‌రిగేట‌ట్లు క‌నిపిస్తున్నాయి.

ఈ స‌మావేశాల్లో కీల‌క‌మైన అంశాల‌పై చర్చ జరగనుంది. మ‌రోవైపు రైతు ఉద్య‌మం సెగ తాక‌నుంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దానికి సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది. ఈ పనిని ఇద్దరు కేంద్ర మంత్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది. కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి, రాజ్యసభలో అధికార పక్షనేత పీయూశ్ గోయల్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇందులో భాగంగా వీరిద్దరూ విపక్ష నేతలతో భేటీ అవుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతున్నారు.

సీనియ‌ర్ నేత‌ల‌తో భేటీలు

కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సవివరంగా వారికి వివరించారు. చైనా విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తరుచుగా కేంద్రంపై విమర్శలకు దిగుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార పక్షాన్ని వివిధ అంశాలపై ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. దీనిని గ్రహించిన అధికార పక్షం బీజేపీ, అన్ని పార్టీలతో సత్సంబంధాలున్న నేతలను రంగంలోకి దింపుతోంది. రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్ష నేతలతో భేటీ కావడం ఇందులో భాగమేనని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి, రాజ్యసభలో అధికార పక్ష నేత పీయూశ్ గోయల్ కూడా విపక్ష నేతలతో సంప్రదింపులు జరిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరో సీనియర్ నేత ఆనంద్ శర్మతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కూడా సంప్రదింపులు జరిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని విజ్ఞప్తి చేశారు.

వాగ్వాదాలు త‌ప్ప‌వా?

కేంద్రం ప్ర‌భుత్వం ఎంత ప్ర‌య‌త్నించినా ఈ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టే జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్ కోడ్ అంశాలపై వాగ్వాదాలు జరిగే అవకాశాలున్నాయి. దీనికి కారణం ఈ రెండు అంశాలపై ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నిస్తుండటమే. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడం అసోం సైతం ఆ ఆలోచనలో ఉండటంతో పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టాలనేది బీజేపీ ఎంపీల ఆలోచనగా ఉంది. రాజస్థాన్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న కిరోరి లాల్ మీనా యూసీసీ బిల్లును జూలై 24న ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మంత్రులు ప్రవేశపెట్టేవి కాకుండా ఎంపీలు ప్రవేశపెడితే ప్రైవేటు బిల్లులుగా వ్యవహరిస్తారు.

రాజ్యాంగ విరుద్ధ‌మంటున్న ఓవైసీ

ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే సంపూర్ణ మెజార్టీ అవసరం. అందుకే సాధారణంగా ప్రైవేటు బిల్లలు ఎప్పుడూ చట్టరూపం దాల్చవు. 1970 తరువాత ఒక్క ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంట్ లో ఆమోదం పొందలేదు. ఈ బిల్లులు ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేస్తున్న ప్రయత్నాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. యూపీ సర్కారు తీసుకొచ్చిన ‘జనాభా నియంత్రణ’ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఏ వ్యక్తి అయినా చట్టానికి లోబడి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్-21 చెబుతోందని చెప్పారు. పిల్లలకు జన్మనిచ్చే నిర్ణయాధికారం మహిళకే ఉండాలని జనాభా నియంత్రణ బిల్లు చట్టరూపం దాలిస్తే మహిళల హక్కులను హరించినట్లు అవుతుందని వి వరించారు. దేశంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స 93% మహిళలకే చేస్తున్న సంగతిని అందరికి గుర్తు చేశారు.