iDreamPost
android-app
ios-app

పార్ల‌మెంట్ స‌మావేశాలు : ఆది నుంచీ అదే తీరు

పార్ల‌మెంట్ స‌మావేశాలు : ఆది నుంచీ అదే తీరు

పార్ల‌మెంటు స‌మావేశాలు మ‌రో మూడు రోజుల్లో ముగియ‌నున్నాయి. మొద‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మావేశాల్లో ఒక‌టే తీరు క‌నిపిస్తోంది. అవే దృశ్యాలు రోజూ ఆవిష్కృత‌మ‌వుతున్నాయి. స‌రిగ్గా స‌మావేశాల‌కు ముందు వెలుగులోకి వ‌చ్చిన పెగాసస్‌ నిఘా కుంభకోణంపై ప్రతిపక్ష పార్టీల సభ్యుల తీవ్ర నిరసనలు వ్య‌క్తం చేయ‌డం, ఆ నిర‌స‌న‌ల మ‌ధ్యే ప‌లు బిల్లుల‌ను అధికార పార్టీ ఆమోదింప చేసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న‌లు, స‌స్పెష‌న్లు, అధికార స‌భ్యుల ఎదురుదాడి, ఇది స‌రికాదంటూ సూక్తులు మిన‌హా ప్ర‌జాప‌యోగ సంబంధ అంశాల‌పై ఈ ద‌ఫా చ‌ర్చ జ‌రిగింద‌నేది త‌క్కువ‌నే చెప్పాలి.

ఈసారి విచిత్రం ఏంటంటే, పెగాస‌స్ ప్ర‌కంప‌న‌ల‌తో అట్టుడుకుతున్న పార్ల‌మెంట్ వర్షాకాల సమావేశాల తొలివారంలో ఒక్క బిల్లూ ఆమోదం పొందలేదు. కానీ, త‌ర్వాత ఎనిమిది రోజుల్లో ఇర‌వై రెండు బిల్లులు ఏక‌ప‌క్షంగా ఆమోదం పొందాయి. సోమవారం కూడా ఉభయ సభల్లో రభస కొనసాగింది. పెగాసస్‌ నిఘా కుంభకోణంపై ప్రతిపక్ష పార్టీల సభ్యుల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ ఐదుసార్లు, రాజ్యసభ నాలుగు సార్లు వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల నిరసనలు, గందరగోళం మధ్యే లోక్‌సభలో మూడు, రాజ్యసభలో మూడు కీలక బిల్లులను ఆమోదించారు. సభలో గందరగోళం నెలకొన్నప్పుడు బిల్లులను ప్రవేశపెట్టడం సంప్రదాయం కాదని విప‌క్ష‌లు నేత‌లు అంటుంటే, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌మైన బిల్లుల‌పై చ‌ర్చించాల్సిన స‌మ‌యంలో ఆందోళ‌న‌లు చేస్తూ స‌భ జ‌ర‌గ‌కుండా అడ్డుకోవ‌డం స‌బ‌బు కాద‌ని అధికార ప‌క్ష నేత‌లు చెబుతున్నారు.

ఈ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్ర‌ధానంగా పెగాస‌స్ చుట్టూనే ఎక్కువ‌గా తిరిగాయి. వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ల త‌ర్వాత ఆ కుంభ‌కోణంపై రాజ్య‌స‌భ‌లో ర‌క్ష‌ణ శాఖ మంత్రి నోరు విప్పారు. ఆ సాఫ్టేవేర్ త‌యారుచేసిన సంస్థ‌తో తాము ఎలాంటి లావాదేవీలూ పెట్టుకోలేద‌ని ప్ర‌క‌టించారు. దీన్ని విప‌క్షాలు కొట్టిపారేశాయి. సోమ‌వార‌మైతే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగానే కాంగ్రెస్‌, డీఎంకే, తదితర పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్‌ సభను 12 గంటలకు వాయిదా వేశారు.

తిరిగి సభ సమావేశమైనప్పుడు ప్యానెల్‌ స్పీకర్‌ రాజేంద్ర అగర్వాల్‌ గందరగోళం మధ్యే జాతీయ హోమియోపతి కమిషన్‌ సవరణ బిల్లు, భారత వైద్య వ్యవస్థ జాతీయ కమిషన్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. అనంతరం సభ మ‌ళ్లీ వాయిదా ప‌డింది. 12.30 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైన తర్వాత సభాపతి 377 నిబంధనల కింద సభ్యులు ప్రత్యేక ప్రస్తావనలు చేసేందుకు అనుమతించారు. నిరసనల మధ్యే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన పరిమిత రుణ బాధ్యత భాగస్వామ్య సవరణ బిల్లు, డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ సవరణ బిల్లు; సామాజిక సంక్షేమ మంత్రి అర్జున్‌ ముండా ప్రవేశపెట్టిన రాజ్యాంగ (షెడ్యూల్డు జాతుల) ఆర్డర్‌ సవరణ బిల్లులను అరగంటలోపే మూజువాణీ ఓటుతో ఆమోదించారు. పార్ల‌మెంట్ లో దాదాపు రోజూ ఇదే దంతు కొన‌సాగుతోంది. విప‌క్ష స‌భ్యుల అభిప్రాయాల‌తో సంబంధం లేకుండా పది నిమిషాలకో బిల్లు ను ఏకపక్షంగా ఆమోదిస్తున్నార‌ని టీఎంసీ ఎంపీ ట్వీట్ చేశారు.

కాగా, ‘‘మంగళవారం రాజ్యసభలో అత్యంత ప్రధానమైన కార్యకలాపాలు, చర్చ, బిల్లుల ఆమోదం ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో సభ్యులంతా తప్పనిసరిగా సభల్లో ఉండాలి’’ అని బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ విప్‌ జారీ చేయ‌డంతో ఈ రెండు రోజుల స‌మావేశాల‌పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో చివ‌రి మూడు రోజులైనా స‌భ స‌జావుగా సాగుతుందా, అదే తంతు కొన‌సాగుతుందా చూడాలి.