Idream media
Idream media
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశాల్లో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్ ప్రవేశపెట్టడం, దానిపై చర్చ జరిగింది. ఆ తర్వాత సమావేశాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జరిగే రెండో విడత సమావేశాల్లో రంగాల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ, ఆర్ధిక బిల్లు ఆమోదం తోపాటు అద్దె గర్భం బిల్లు, గర్భ విచ్చిత్తి బిల్లు, విమానాల చట్ట సవరణ బిల్లు, బ్యాంకింగ్ నియంత్రణ బిల్లు.. తదితర బిల్లులు చర్చకు రానున్నాయి.
పౌర సత్వ సవరణ చట్టం నేపథ్యంలో ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ లో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అల్లర్లను అదుపు చేసేందుకు ఆర్మీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అల్లర్ల వల్ల ఢిల్లీ పోలీస్ కమిషనర్ పై వేటు పడింది. ఈ నేపథ్యంలో అల్లర్లు, 42 మంది మరణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
తాజా పరిణామాల నేపథ్యంలో జరగబోతున్న పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ లో ఢిల్లీ అల్లర్లపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సమావేశాలు సజావుగా జరుగుతాయా..? లేదా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సమావేశాలు ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్నాయి.