iDreamPost
android-app
ios-app

పరిటాల ‘బుల్లెట్‌’ కథేంది..? సునీత ఎందుకు కలవరపడుతున్నారు..?

పరిటాల ‘బుల్లెట్‌’ కథేంది..? సునీత ఎందుకు కలవరపడుతున్నారు..?

మాజీ మంత్రి పరిటాల సునీతకు కొత్త కలవరం మొదలైంది. చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ ‘బుల్లెట్‌’ కేసులో చిక్కుకోవడమే ఆమె ఆందోళనకు కారణం. స్నేహితులతో కలసి శ్రీనగర్‌ పర్యటనకు వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లిన సిద్ధార్ధ్‌.. బ్యాగులో బుల్లెట్‌ ఉన్న విషయాన్ని అక్కడ తనికీల్లో బయటపడింది. విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది సిద్ధార్థ్‌ బ్యాగ్‌లో 5.5 క్యాలిబర్‌ బుల్లెట్‌ను గుర్తించారు. అయితే ఆ బుల్లెట్‌ తన బ్యాగులోకి ఎలా వచ్చిందో తనకు తెలియదని సిద్ధార్థ్‌ చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సిద్ధార్థ్‌ను సొంతపూచికత్తుపై విడుదల చేశారు. బుల్లెట్‌తోపాటు తన లైసెన్స్‌ గన్‌ వివరాలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారు.

బుల్లెట్‌ వ్యవహారంలో సిద్ధార్థ్‌ పోలీసుల నుంచి తప్పించుకున్నా.. పరిటాల సునీతలో మాత్రం కుమారుడి విషయంలో కొత్త కలవరం మొదలైంది. పరిటాల రవీంద్ర–సునీత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకుమారుడు పరిటాల శ్రీరామ్‌ రాజకీయాల్లో ఉండగా.. చిన్న కుమారుడు సిద్ధార్థ్‌ హైదరాబాద్‌లో చదువు పూర్తి చేసుకుని అక్కడే వ్యాపారాలు చేస్తున్నారు. కుమార్తె స్నేహలత డాక్టర్‌గా స్థిరపడ్డారు.

Also Read : హర్షకుమార్‌కు షాకిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ

రాజకీయాల్లో ఉన్న పెద్ద కుమారుడు శ్రీరామ్‌పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. ఇందులో హత్యానేరం కింద నమోదైన కేసులున్నాయి. ఇంకో కొత్త కేసు నమోదైన పెద్ద విషయం కాదు. కానీ రాజకీయాలకు దూరంగా వ్యాపారంలో ఉన్న సిద్ధార్థ్‌ విషయంలో ఊహించని విధంగా వెలుగులోకి బుల్లెట్‌ వ్యవహారం సునీతను ఆందోళనకు గురి చేస్తోంది. అసలు సిద్ధార్థ్‌ బ్యాగ్‌లోకి ఆ బుల్లెట్‌ ఎలా వచ్చింది..? అదీ సిద్ధార్థ్‌కు తెలియకుండా ఆ బుల్లెట్‌ బ్యాగులోకి వచ్చిందంటే తెర వెనుక ఏమి జరిగి ఉంటుంది..? కావాలనే ఎవరైనా సిద్ధార్థ్‌ను ఇరికించేందుకు బుల్లెట్‌ను బ్యాగులో వేశారా..? లాంటి ప్రశ్నలు పరిటాల సునీత మదిని తొలిచేస్తున్నాయి.

పరిటాల రవీంద్ర హయాంలో జరిగిన పరిణామాలతో ఆ కుటుంబానికి అనేక మంది శతృవులు ఏర్పడ్డారు. అందులో ఎవరైనా ఇలా చేసి ఉంటారా..? పరిటాల శ్రీరామ్‌ను పోలీసు కేసుల్లో ఇరికించే అవసరం లేదు. ఆయనే ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ్‌ను ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ బుల్లెట్‌ వ్యవహారం కొలిక్కి వచ్చే వరకు పరిటాల సునీతలో కలవరం తగ్గే అవకాశం లేదు.

Also Read : హర్షకుమార్‌కు షాకిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ