Idream media
Idream media
అఖండ భారతంలో గాంధారి పుట్టినిల్లుగా వెలుగొందిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఇండియా కంటే ముందుగా ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం 1919 ఆగస్టు 19న సిద్ధించింది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని వందేళ్లు దాటినా ఆఫ్ఘన్‌లో నేటికి రాజకీయ అనిశ్చిత కొనసాగుతోంది. మరోసారి తాలిబాన్‌ల ఆక్రమణతో ఆఫ్ఘన్ ప్రజల భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారింది.నేటి దుర్బల పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్థానీయులకు ఓ ఆశాకిరణంలా కనిపిస్తుంది ఆ ప్రాంతం..
అమెరికా సేనలు వైదొలిగిన తరువాత కేవలం పది రోజుల వ్యవధిలోనే అంచనాలను తలకిందులు చేస్తూ రాజధాని కాబూల్‌తో సహా దేశమంతటిని ఆక్రమించి తాలిబన్లు సవాలు విసిరారు.కానీ ఆ దేశంలోని ఒక ప్రాంతంలో అడుగు పెట్టటానికి మాత్రం తాలిబన్లు గుండెల్లో దడ పుడుతుంది.ఇరవయ్యేళ్లకు పైగా ఆ ప్రాంతంపై పట్టుకు ప్రయత్నించినప్పటికీ దాని దరిదాపుల్లోకి కూడా తాలిబాన్లు చేరుకోలేకపోయారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ నేత పేరు వింటేనే తాలిబన్‌ల వెన్నులో వణుకు పుడుతోంది.
పేరుకు తగ్గట్లే శత్రుదుర్భేద్యం “పంజ్‌షిర్”
తాలిబన్‌ల దురాక్రమణపై ఎదురొడ్డి పోరాడుతున్న ఆ ప్రాంతమే “పంజ్‌షిర్”..పంజ్‌షిర్ అంటే సంస్కృతంలో ఐదు సింహాలు అని అర్థం. హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్ ప్రావిన్స్ ఉంది. సుమారు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికంగా కలరు.అక్కడి ప్రజల పోరాట పటిమకు తోడు దట్టమైన అడవులు ఆ ప్రాంతానికి కోటలా నిలిచి శత్రుదుర్భేద్యంగా మారింది. కొన్ని శతాబ్దాలుగా పంజ్‌షిర్ ప్రాంతం అరాచక శక్తులను ప్రతిఘటించే ప్రాంతంగా పేరొందింది.దీంతో శత్రు సేనలకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షిర్ ప్రాంతంలోకి అటు సోవియట్ రష్యా బలగాలు గానీ,ఇటు తాలిబన్లు గానీ కాలుపెట్టలేకపోతున్నాయి.
పంజ్‌షిర్ పేరుకు తగ్గట్టే అక్కడి ప్రజలలో ధైర్య సాహసాలతో కూడిన తెగింపు అధికం.గతంలో తాలిబన్ల అరాచక పాలనను తుదముట్టించడంలోనూ ఈ ప్రాంతానికి చెందిన తజిక్ జాతి ప్రజలదే కీలక పాత్ర.అక్కడి ప్రజలలో ఉన్న స్వతంత్ర కాంక్ష,ఉద్యమ స్ఫూర్తిని మరింతగా రగిలించి వారిని ముందుండి నడిపిన వ్యక్తిగా,తాలిబన్ వ్యతిరేక నాయకుడిగా అహ్మద్ షా మసూద్ పేరొందారు.ఆయన తాలిబాన్‌ల అంతానికి తన సర్వశక్తులూ ధారపోశారు.
సింహంలా గర్జించిన మసూద్
తాలిబన్ వ్యతిరేక నాయకుడైన అహ్మద్ షా మసూద్ కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు,మిలటరీ కమాండర్ కూడా.ఆయన గెరిల్లా పోరాటంలో దిట్ట.1979-1989 మధ్య గెరిల్లా కమాండర్‌గా సోవియట్ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంతో పాటు 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంత పోరాటం జరిపారు.1990లలో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వ సైనిక విభాగానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత తాలిబన్ స్వాధీనంలోకి ఆఫ్ఘన్ వెళ్లాక వారి రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్ష కమాండర్‌గా తన తుది శ్వాస వరకు పోరాడారు.ఆయన ఉత్తర కూటమిని ఏర్పాటు చేసి 2001లో యూరప్‌లో పర్యటించి తాలిబాన్లకు పాకిస్థాన్ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు. తాలిబన్ పాలనలో ఆఫ్ఘన్ ప్రజలు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులు వివరించి మానవతా దృక్పథంతో సాయం చేయాలని కూడా అభ్యర్థించారు.
గెరిల్లా యుద్ధ వ్యూహాలతో తమకు పంటికింద రాయిలా తయారైన అహ్మద్ షా మసూద్ ని అంతమొందించడానికి తాలిబాన్లు కుట్ర పన్నారు.నకిలీ విలేకరుల వేషాలలో తాలిబన్లు,ఆల్‌ఖైదా సభ్యులు కలిసి మీడియా సంస్థకి ఇంటర్వ్యూ పేరుతో వచ్చి 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో అహ్మద్ షా మసూద్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణించిన రెండు రోజులకే అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం,పెంటగాన్ రక్షణ భవనంపై ఆల్‌ఖైదా దాడులు చేయడం నాడు తాలిబన్లకు శాపంగా మారింది. దీంతో తాలిబాన్‌ల పీచమనచడానికి ఆఫ్ఘన్‌లోకి నాటో దళాలు రంగ ప్రవేశం చేశాయి. అప్పటికే తాలిబాన్‌లపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఉత్తర కూటమికి చెందిన మసూద్ దళాలతో ఆ బలగాలకి స్నేహం కుదిరింది. రెండు నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం ఉత్తర కూటమి డిసెంబర్ 2001 నాటికి తాలిబన్‌ల రాక్షస పాలనను అంతం చేసి విజయం సాధించింది.ఆ తర్వాత ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ఎన్నికైన హమీద్ కర్జాయ్ అహ్మద్ షా మసూద్‌ను నేషనల్ హీరో గా ప్రకటించి ఆయన మరణించిన రోజును సెలవు దినంగా నిర్ణయించారు.
తాలిబన్‌లకి వ్యతిరేకంగా మరోమారు..
ప్రస్తుతం పంజ్‌షిర్ ప్రాంతమే ఆఫ్ఘన్ జాతీయ ప్రతిఘటనకు వేదికగా నిలుస్తోంది.ఈ ప్రాంతానికి చెందిన అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్,ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, బిస్మిల్లాఖాన్ మొహమ్మది తదితర కీలక నేతలు తాలిబాన్‌ల దురాక్రమణను సవాల్ చేస్తున్నారు. తాలిబన్లు కాబుల్‌ను కైవసం చేసుకున్న మరుక్షణమే అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయారు.కానీ ఆఫ్ఘన్ తొలి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అమ్రుల్లా సలేహ్ మాత్రం తాలిబన్లకు పాలనా పగ్గాలు అప్పగించేది లేదని ధైర్యంగా ప్రకటించారు. ప్రస్తుతం దేశం లోపలే ఉన్నానని,ఆపద్ధర్మ దేశ అధ్యక్షుడిని కూడా తానేనని ప్రకటించుకున్నారు.
తాజాగా అహ్మద్ మసూద్ కూడా తన తండ్రి మార్గంలోనే తాలిబాన్‌ల దురాక్రమణని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.ఆయన తాలిబన్ ఉగ్రమూకలపై పోరాటానికి పశ్చిమ దేశాల మద్దతును కోరుతున్నారు.మరోమారు తాలిబన్ వ్యతిరేక శక్తులకి కేంద్రబిందువుగా మారిన పంజ్‌షిర్ ప్రాంతం ఆఫ్ఘనిస్థానీయులకు చిమ్మ చీకటిలో చిరుదీపంలా కనిపిస్తోంది.
Also Read : తాలిబన్లను వణికించిన ఒకే ఒక్కడు