iDreamPost
android-app
ios-app

పంచాయతీ ఎన్నికలు : ఇదెలా సాధ్యమైంది..?

పంచాయతీ ఎన్నికలు : ఇదెలా సాధ్యమైంది..?

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలకు అనేక ప్రత్యకతలు ఉన్నాయి. ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు మధ్య తలెత్తిన భిన్నాభిప్రాయాలలో పంచాయతీ ఎన్నికలు జరగగా.. ఒక ప్రాణం పోకుండా, రీపోలింగ్‌ అవసరమే లేకుండా ఎన్నికల తంతు ముగియడం మరో ప్రత్యేకత. చిన్నచిన్న తోపులాటలు, వాగ్వాదాలు మినహా ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం ఓ చరిత్ర.

పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగకపోయినా.. స్థానికమైన అంశాలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్థానికులు ఈ ఎన్నికలను ప్రత్యేక దృష్టితో చూస్తారు. వ్యక్తిగతంగా తీసుకుంటారు. ఈ క్రమంలో గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొట్లాటలు జరిగాయి. ప్రాణాలు పోయాయి. పలు చోట్ల రీపోలింగ్‌ తప్పనిసరయ్యేవి. సాధారణ ఎన్నికల కన్నా పంచాయతీ ఎన్నికలంటేనే పోలీసులకు తలనొప్పులు ఉండేవి.

కానీ ఈ సారి మునుపటికి భిన్నంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ క్రెడిట్‌లో మెజారిటీ భాగం పోలీసులదే. తక్కువ సమయం ఉన్నా.. పంచాయతీ ఎన్నికలకు పోలీసులు పక్కా ప్లానింగ్‌ రచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ గ్రామాల్లోనూ పోలింగ్‌ బూత్‌ పరిధిలోని వంద మీటర్ల లోపు ఇద్దరు పోలీసులను మోహరించారు. ప్రతి 50 మీటర్లకు ఒకరు చొప్పన పోలీసులు పోలింగ్‌ను పర్యవేక్షించారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు నిత్యం పర్యవేక్షించాయి. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు పోలింగ్‌ సమయంలోనూ, కౌటింగ్‌ కేంద్రంలోనూ, ఫలితం తర్వాత సంబరాల్లోనూ ఎలా వ్యవహరించాలో పోలీసులు దిశానిర్ధేశం చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చింది.

గతంలో మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 13,097 పంచాయతీలకు గాను 2,197 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 1,31,023 వార్డులకు గాను 47,459 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా స్థానాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. రాయలసీమ, గుంటూరు జిల్లా పల్నాడు వంటి ప్రాంతాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం అందరినీ ఆలోచింపచేస్తోంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు నమోదుకాకపోవడం విశేమంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం. ఎన్నికలు జరిగిన తీరు ఇలా ఉంటే.. పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించడం కొసమెరుపు.