Idream media
Idream media
వివాదాలు, విభేదాలు, కరోనా సవాళ్ల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ పోరు జరుగుతోంది. నాలుగు దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. ఈ రోజు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. మధ్యాహ్నం 3:30 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత లెక్కింపు ప్రారంభించనున్నారు. సర్పంచ్‌కు పింక్, వార్డుకు తెలుపు రంగు బ్యాలెట్ వినియోగిస్తున్నారు. మొదట వార్డు, తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించనున్నారు.
రెవెన్యూ డివిజన్ల ఆధారంగా విడతల వారీగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో విజయనగరం మినహా మిగతా 12 జిల్లాలోని 3,249 పంచాయతీలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన పంచాయతీల్లో 7,506 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 29,732 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. కరోనా పాజిటివ్ వ్యక్తులు ఓటేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పీపీఈ కిట్లతో వచ్చి చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు.
వెబ్‌కాస్టింగ్ ద్వారానే ఎన్నికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదులకు ఎన్నికల కమిషనర్ తెచ్చిన ప్రైవేటు ఈ వాచ్ యాప్‌కు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ అంశంపై ఈ రోజు విచారణ కొనసాగనుంది. ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో పూర్వ పద్ధతిలోనే పోలింగ్ పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ జరగనుంది. సాధారణ ఎన్నికల పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ ద్వారానే పర్యవేక్షిస్తుంది. సి విజిల్, నిఘా యాప్‌ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పుడు కూడా ఫిర్యాదుల స్వీకరణకు నిఘా యాప్‌నే ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తోంది.
ఎన్నికలు ఏవైనా.. రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీ ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యహరిస్తున్న తీరు సరికొత్త పోకడ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న బేధాభిప్రాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏకగ్రీవాలు వద్దు.. ఎన్నికలే జరగాలి, నామినేషన్లు అందరూ వేయండి, ఎన్నికల్లో అందరూ భాగస్వాములు కండి.. అంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రభుత్వాన్ని, అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని సాగించిన హడావుడి నేపథ్యంలో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. సాయంత్రం ఆరు గంటలకు అన్ని పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తొలి దశ ఫలితాల ప్రభావం మలి దశపై కొద్దిమేర పడే ఛాన్స్ ఉంది. వైసీపీ పట్టు నిలుపుకుంటుందా..? టీడీపీ ఉనికి కాపాడుకుంటుందా..? వేచి చూడాలి.