Idream media
Idream media
పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం సద్దుమణగకముందే.. తెలుగుదేశం పార్టీలో మరో కలకలం రేగింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఇంఛార్జి పదవికి పమిడి రమేష్‌బాబు గుడ్‌బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడుకు రమేష్‌బాబు పంపారు. దీంతో దర్శి టీడీపీ పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా తయారైంది.
జనార్థన్ సూచనతో పమిడికి పదవి..
ఎమ్మెల్యేగా ఉన్న శిద్ధారాఘవ రావు ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికలు ముగిసిన తర్వాత దర్శిలో పోటీ చేసిన కదిరి బాబూరావు, శిద్ధా రాఘవరావులు సైలెంట్ అయ్యారు. కొద్ది కాలం తర్వాత కదిరి బాబూరావు వైసీపీలో చేరారు. శిద్ధా రాఘవరావు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో దర్శి టీడీపీ పరిస్థితి చుక్కాని లేని నావ మాదిరిగా తయారైంది. కొత్త ఇంఛార్జిని నియమించేందుకు వెతుకులాట ప్రారంభించిన టీడీపీ.. గత ఏడాది నవంబర్ 7వ తేదీన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడైన దామచర్ల జనార్థన్ సూచనతో పమిడి రమేష్‌బాబును దర్శి ఇంఛార్జి పదవిలో నియమించింది.
అపనమ్మకమే కారణం..
దర్శిలో అధ్వాన్నంగా తయారైన పార్టీని నడిపించేందుకు పమిడి రమేష్‌బాబు తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. పదవి చేపట్టిన నాటి నుంచి పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని రమేష్‌బాబు నిర్వహించారు. పార్టీ శ్రేణులను ముందుకు నడిపారు. అయితే పార్టీ అధిష్టానం తన పట్ల వ్యవహరిస్తున్న తీరుతో పమిడి తీవ్ర మనస్తాపం చెందారని సమాచారం. తాను సమర్థవంతంగా పని చేస్తున్నా.. ప్రత్యామ్నాయ నాయకుడి కోసం టీడీపీ అధిష్టానం వెతుకులాట ప్రారంభించింది. ఈ పరిణామమే పమిడి రాజీనామాకు దారితీసింది. తన పట్ల ఇలాంటి తీరుతో ఉన్న అధిష్టానం.. రాబోయే రోజుల్లో తనను పక్కనపెట్టడం ఖాయమని అంచనాకు వచ్చిన రమేష్‌బాబు.. ముందుగానే తప్పుకున్నారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ వ్యవహారశైలి కూడా రమేష్‌బాబు రాజీనామాకు మరో కారణమని సమాచారం.
నిలకడలేని నాయకత్వం..
ప్రకాశం జిల్లాలో టీడీపీ పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో ఒక ఎత్తు అయితే.. దర్శిలో మరో ఎత్తు. ఇక్కడ టీడీపీకి నిలకడలేని నాయకత్వం ఆది నుంచి సమస్యగా వెంటాడుతోంది. 2004 కనిగిరి నియోజకవర్గానికి చెందిన కదిరి బాబూరావు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఎన్నికల్లో కదిరి బాబూరావు కనిగిరి నుంచి పోటీ చేయగా.. దర్శిలో ఎన్‌ఆర్‌ఐ మన్నెం వెంకట రమణను టీడీపీ బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోయింది. 2014లో శిద్ధా రాఘవరావును పోటీలో పెట్టగా.. స్వల్ప మెజారిటీతో ఆయన గెలిచారు. మంత్రి కూడా అవడంతో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్న రాఘవరావును.. 2019 ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసేలా టీడీపీ అధిష్టానం ఒత్తిడి చేసింది. లోక్‌సభ అభ్యర్థి కొరత కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఒంగోలు నుంచి పోటీ చేసిన రాఘవరావు ఓడిపోయారు. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబూరావును బలవంతంగా దర్శి నుంచి పోటీ చేయించగా.. ఆయన అక్కడ ఓడిపోయారు. ఇప్పుడు పమిడి కూడా రాజీనామా చేయడంతో.. దర్శి ఇంఛార్జిగా మరో కొత్త నాయకత్వం రాబోతోంది.
Also Read : టీడీపీ జిల్లా సమావేశం.. నియోజకవర్గ ఇంఛార్జిలందరూ ఎందుకు డుమ్మా కొట్టారు..?