iDreamPost
android-app
ios-app

రాజీనామా చేసిన నెలకే పిలిచి మళ్లీ అదే పదవి.. టీడీపీ దుస్థితికి నిదర్శనం

రాజీనామా చేసిన నెలకే  పిలిచి మళ్లీ అదే పదవి..  టీడీపీ దుస్థితికి నిదర్శనం

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కుదేలైన టీడీపీ.. పుంజుకోవడానికి రెండున్నరేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ పరిస్థితులు మాత్రం ఏ మాత్రం అనుకూలించడం లేదు. పార్టీ భవిష్యత్, బాబు లోకేష్‌ల నాయకత్వంపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన నేతలు.. తమదారి తాము చూసుకుంటున్నారు. కొంత మంది ఇతర పార్టీలలో చేరితే. మరికొంత మంది రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటిస్తూ వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీకి నేతల కొరత ఏర్పడుతోంది.

ఎన్నికలు ముగిసి రెండున్నరేళ్లు అయినా చాలా నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించలేని పరిస్థితిలో ఉండడం టీడీపీ దుస్థితికి అద్దం పడుతోంది. తాజాగా ఆరు నియోజకవర్గాలకు టీడీపీ ఇంఛార్జిలను నియమించింది. అందులో ప్రకాశం జిల్లా దర్శి కూడా ఒకటి. దర్శి ఇంచార్జిగా పమిడి రమేష్‌బాబును నియమించారు. ఈ నియామకమే టీడీపీ ప్రకాశం జిల్లాలో ఏ పరిస్థితిలో ఉందో తెలియజేస్తోంది. పమిడి రమేష్‌బాబు ఆగస్టు నెలాఖరులో దర్శి ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు. అయితే మళ్లీ నెల రోజులకే తిరిగి ఆయన్నే ఇంఛార్జిగా నియమించడం టీడీపీలో నేతల కొరతకు నిదర్శనంగా నిలుస్తోంది.

Also Read : టీడీపీలో కలకలం.. దర్శి ఇంఛార్జి పదవికి పమిడి గుడ్‌బై

2014 ఎన్నికలో దర్శి నుంచి గెలిచి, మంత్రి కూడా అయిన శిద్ధా రాఘవరావు 2019 ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కనిగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన కదిరి బాబూరావు.. 2019లో దర్శి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు వైసీపీలో చేరడంతో దర్శి టీడీపీకి చుక్కాని లేని నావ మాదిరిగా తయారైంది. చాలా కాలం వెతుకులాట తర్వాత.. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు దామచర్ల జనార్థన్‌ సూచనతో 2020 నవంబర్‌లో దర్శి ఇంఛార్జిగా పమిడి రమేష్‌ను నియమించారు.

ఇంఛార్జిగా నియమితులైన తర్వాత పమిడి తన శక్తిమేరకు పని చేశారు. దర్శిలో టీడీపీ శ్రేణులను నడిపించారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని చేశారు. అయితే పమిడి రమేష్‌ను టీడీపీ తాత్కాలిక సర్దుబాటులో భాగంగానే ఇంఛార్జిగా నియమించింది. రమేష్‌ ఇంఛార్జిగా కొనసాగుతున్న తరుణంలోనే.. బలమైన నేతను ఇంఛార్జిగా నియమించేందుకు టీడీపీ అధిష్టానం వెతుకులాట మొదలెట్టింది.

ఈ పరిణామాలను గమనించిన రమేష్‌.. ఎప్పటికైనా తనను పక్కపెడతారని గ్రహించి.. ఈ ఏడాది ఆగస్టులో రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినాయకత్వానికి పంపారు. రమేష్‌ రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో మరో కొత్త నేత వస్తారని దర్శి టీడీపీ శ్రేణులు ఆశించాయి. అయితే మళ్లీ నెల రోజులకే పమిడినే ఇంఛార్జిగా నియమిస్తూ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడు ప్రకటన విడుదల చేయడం టీడీపీలో నేతల కొరతకు నిదర్శనంగా నిలుస్తోంది.

Also Read : కనిగిరి వైసిపి నేత టీడీపీలో చేరిక.. బాబు వక్ర భాష్యం