iDreamPost
iDreamPost
ఒకనాటి తెలుగుదేశం అడ్డాగా ఉన్న పలాసలో వైఎస్సార్సీపీ పట్టు పెరుగుతోంది. ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్న సీదిర అప్పలరాజు వ్యూహాల ముందు టీడీపీ తేలిపోతోంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకున్న అధికార పార్టీ ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. దాంతో టీడీపీ పునాదులే కదిలిపోతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా నలుగురు కౌన్సిల్ అభ్యర్థులు ఆపార్టీకి బైబై చెప్పేశారు. మంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో మునిసిపల్ చైర్మన్ వైఎస్సార్సీపీ గెలచుకోవడం అనివార్యంగా మారింది. పలాస మునిసిపాలిటీలో జగన్ జెండా ఎగరేయడానికి మార్గం సుగమం అయ్యింది.
గత ప్రభుత్వ హయంలో పలాస మునిసిపాలిటీ చుట్టూ పెను వివాదాలు అలముకున్నాయి. అప్పట్లో అచ్చెన్నాయుడు- గౌతు శివాజీ మధ్య రాజకీయాలతో పలాస పరువు తీసినంత పనయ్యింది. ఏకంగా మునిసిపల్ చైర్మన్ కూడా అప్పట్లో పరారీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రి అండదండలతో అప్పట్లో సాగిన అక్రమాల మూలంగా పలాస ప్రజలకు అభివృద్ధి దూరమయ్యింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారనే సంకేతాలున్నాయి. దానికి తగ్గట్టుగానే టీడీపీ నేతలు కూడా ఇక సైకిల్ పై సాగడం సాధ్యం కాదంటూ ఫ్యాన్ పక్కన చేరుతుండడం విశేషం.
తెలుగుదేశం పార్టీ తరఫున పలాస మున్సిపాలిటీకి నామినేషన్ వేసిన కౌన్సిలర్ అభ్యర్థులు కూడా మంత్రి నాయకత్వానికి జై కొట్టారు. దాంతో ఆ వార్డులలో అప్పలరాజు బలపరిచిన అభ్యర్థుల విజయపరంపరకు అడ్డులేకుండా పోయింది. అంతేగాకుండా కౌన్సిల్ ని కైవసం చేసుకోవడం ఖాయంగా మారింది. పలాసలో పూర్తిస్థాయి ఆధిక్యత సాధిస్తున్న వైఎస్సార్సీపీ విజయాలను టీడీపీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నిమ్మాడలో కూడా ఎదురుదెబ్బలు తింటున్న అచ్చెన్నాయుడుకి పలాస పరిణామాలు మింగుడుపడడం లేదు. దాంతో మంత్రి చుట్టూ ఆరోపణలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ప్రజల్లో పలుచయిపోయిన టీడీపీకి మళ్లీ అక్కడ కోలుకునే అవకాశాలు సన్నగిల్లుతున్నట్టు అంతా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అప్పలరాజుకి పలాస రాజకీయాల్లో తిరుగులేని ఆధిక్యం ఖాయంగా కనిపిస్తోంది.