iDreamPost
android-app
ios-app

పాకిస్తాన్ లో అంత‌ర్యుద్ధం..!

పాకిస్తాన్ లో అంత‌ర్యుద్ధం..!

ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే పాకిస్తాన్ లో అంత‌ర్యుద్ధం మొద‌లైన‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వానికి, సైన్యానికి వ్య‌తిరేకంగా ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు రోడ్డెక్కుతున్నారు. దేశంలో జరుగుతున్న ప్ర‌జా వ్య‌తిరేక ఘ‌ట‌న‌లు, శాంతి భ‌ద్ర‌త‌ల‌పై అధికారుల నిర్ల‌క్ష్యానికి వ్య‌తిరేకంగా కొంత కాలంగా కొన‌సాగుతున్న నిర‌స‌న‌లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇదే అదునుగా విప‌క్షాలు రంగంలోకి దిగి ఉద్రిక్త‌త‌ల‌కు ఆజ్యం పోస్తున్న‌ట్లుగా క‌నిపిస్తున్నాయి. రాజకీయ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యం ఉండకూడదంటూ పోరాడుతున్నాయి. దేశమంతా ర్యాలీలు చేస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ బజ్వా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ పై అక్క‌డి ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెరుగుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. గత నెలలో జరిగిన ఒక గ్యాంగ్ రేప్ చినికి చినికి గాలి వానై అంత‌ర్యుద్ధానికి దారి తీసిన‌ట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న లాహోర్ నేషనల్ హైవేపై కారులో వెళ్తున్న మహిళపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేశారు. తన ముగ్గురు పిల్లలతో కలిసి ప్రయాణం చేస్తుండగా ఆయిల్ అయిపోవడంతో లాహోర్ శివారుల్లో కారు ఆగిపోయింది. సాయం కోసం కారు దిగి రోడ్డుపై నిలబడి ఉన్న ఆమెను అటుగా వెళ్తున్న ఇద్దరు తుపాకీతో బెదిరించి పిల్లల ఎదురుగానే రేప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ సామాన్యుల్లో ఆవేశాన్ని రగిల్చింది. బాధితురాలికి న్యాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.. లాహోర్లో మహిళలు రోడ్లపైకి వచ్చి బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు.

లాహోర్ పోలీస్ అధికారి ఉమర్ షేక్ బాధితురాలిదే తప్పన్నట్లుగా మాట్లాడారు. ‘పిల్లలతో కలిసి రాత్రి టైమ్ లో బయటకు ఎందుకొచ్చింది? వచ్చినా ఆమె ఆ రూట్ లో వెళ్లి ఉండాల్సింది కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా మహిళలు నిరసనలకు దిగారు. ముఖ్యంగా చదువుకున్న మిడిల్ క్లాస్ ఆడవాళ్లు రోడ్లపై ర్యాలీలు చేశారు. ఉమర్పై చర్యలు తీసుకోవాలని, మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. కానీ అతడిపై కనీసం సస్పెన్షన్ వేటు పడలేదు. ఈ కేసు కోసం ఉమర్ను ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖానే ఏరికోరి వేశారన్న ప్రచారం జరగడంతో ప్రజల కోపం ఇమ్రాన్, అధికార పార్టీ పీటీఐపైకి మళ్లింది. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి ప్రజలను పాలించే హక్కు లేదంటూ భారీ స్థాయిలో ర్యాలీలు జరిగాయి.

పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో న్యాయవ్యవస్థ, ఆర్మీలపై వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం నేరం. ప్రజాస్వామ్య దేశంలో మాదిరిగా ఎన్నికలు జరుగుతున్నా.. ప్రభుత్వాలపై పెత్తనం ఆర్మీదే. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ అంగీకరిస్తూ వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు తిరగబడ్డాయి. పాకిస్తాన్లో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని, ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆర్మీ చీఫ్ బజ్వా కూడా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలను భారీగా కూడగట్టి ఈ ఏడాది చివరి వరకు నిరసన ర్యాలీలు, సభలు పెట్టాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేసుకున్నాయి. ఎలాగైనా ఇమ్రాన్ ప్రభుత్వాన్ని దించేయాలని చూస్తున్నాయి. విపక్షాల్లో పెద్ద పార్టీలైన నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్, భుట్టో-జర్దారీస్ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహా మొత్తం 11 పార్టీలు కలిసి పాకిస్తాన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్(పీడీఎం) పేరుతో ఒక కూటమిగా ఏర్పడి ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగాయి.

ప్రభుత్వం, ఆర్మీ మాత్రం ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇదంతా తన ప్రభుత్వాన్ని కూల్చడానికి విదేశీ శక్తులు చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలను బయటకు రానీయకుండా చేసేందుకు ఆర్మీ లోలోపల బెదిరింపులు కూడా స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా ఉన్న నవాజ్ షరీఫ్ కూతురు మరియం షరీఫ్ ను అరెస్టు చేసేందుకు ఆర్డర్ ఇవ్వలేదని కరాచీ పోలీస్ చీఫ్ నే కిడ్నాప్ చేసి సంతకం చేపించుకుంది ఆర్మీ. దీనిపై మిగతా పార్టీలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లకుండా చేసేందుకు ఇమ్రాన్ సర్కారు కొత్తదారులు వెతుక్కుంటోంది. ఇప్పుడు దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ నేప‌థ్యంలో లాక్ డౌన్ విధిస్తే అల్ల‌ర్లు స‌ద్దుమ‌ణుగుతాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. మ‌రి సాధ్యం అవుతుందా, లేదా చూడాలి.