iDreamPost
iDreamPost
పాకిస్తాన్ రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరిగి.. చివరికి మధ్యంతర ఎన్నికల వైపు మళ్లాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరుగుతుందని.. అసెంబ్లీ విశ్వాసం కోల్పోవడం.. ఇమ్రాన్ పదవి నుంచి తప్పుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో ఇమ్రాన్ పావులు కదిపి అవిశ్వాస గండం నుంచి బయటపడటమే కాకుండా.. జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని దేశాధ్యక్షుడికి సిఫార్సు చేశారు. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు పెట్టకుండానే తిరస్కరిస్తున్నట్లు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ప్రధాని సిఫార్సు మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దానిపై ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఓటింగ్ జరపనున్నట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. ఈలోగా మిత్రపక్షం ఎంక్యూఎం పార్టీ ప్రతిపక్షాలతో కలిసిపోగా.. పలువురు అధికార పార్టీ ఎంపీలు సైతం ఇమ్రాన్ కు దూరంకావడంతో ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. జాతీయ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 342 కాగా.. ప్రభుత్వం కొనసాగాలంటే 172 మంది మద్దతు అవసరం. కానీ అధికార పార్టీ మద్దతుదారులు సంఖ్య 160కి తగ్గిపోవడంతో ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమని అందరూ భావించారు. ఆదివారం ఉదయం జాతీయ అసెంబ్లీకి ప్రతిపక్షానికి చెందిన 176 మంది, అధికార పీటీఐ పార్టీకి చెందిన 26 మంది సభ్యులు హాజరైనా ప్రధాని ఇమ్రాన్, అసెంబ్లీ స్పీకర్ మాత్రం హాజరుకాలేదు. వారిద్దరూ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వితో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. దాంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సభకు వచ్చి అవిశ్వాస తీర్మానం విదేశీ శక్తుల కుట్రగా ఆరోపిస్తూ దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి, అసెంబ్లీని ఈ నెల 25కు వాయిదావేశారు. అదే సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ ను అస్థిరపరచడానికి విదేశీ కుట్ర జరిగిందని పేర్కొన్నారు. తన ప్రభుత్వంపై తీర్పు ఇవ్వాల్సింది ప్రజలేనని.. ఎవరు పాలించాలో వారే నిర్ణయించాలని.. అందుకే జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాశానని ఇమ్రాన్ వెల్లడించారు.
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫార్సును దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించినట్లు సమాచారం. జాతీయ అసెంబ్లీని రద్దుచేస్తూ కొద్దిసేపటి క్రితమే ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. అంతవరకు ఇమ్రాన్ ప్రభుత్వం ఆపద్ధర్మంగా కొనసాగుతుంది. పాకిస్తాన్ లో రాజకీయ అనిశ్చితి కొత్త కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గత 75 ఏళ్లలో ఏ ప్రజాప్రభుత్వం కూడా పూర్తికాలం పనిచేయలేదు. 2018 ఆగష్టులో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇమ్రాన్ ఖాన్ సర్కారుకు ఆ గండం తప్పలేదు.