Idream media
Idream media
ఆడాగాదు.. ఈడాగాదు..
అమీరోల్లో మేడాగాదు..
నాగర్‌కర్నూలు జిల్లా తాలూకా..
తెల్కపల్లి మండలం..
గట్టురాయిపాకుల గ్రామంలో పుట్టింటాడు.
పొట్టచేత పట్టుకుని..
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీకొచ్చింటాడు..
అవాసంగా చిన్న రేకుల ఇల్లు..
అందులో పది మంది కుటుంబసభ్యులతో తను..
భార్యా పేరు శంకరమ్మా..
ఓ కూతురు పేరు రాములమ్మ..
పూట గడిచేందుకూ తిప్పలు..
భార్య చనిపోతే దహన సంస్కారానికీ ఇబ్బందులు..
ఇదీ.. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ పాడి పాపులర్ అయిన ఆ దర్శనం మొగులయ్య.. ఇప్పుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్య.. కథ కొంచెం పేరడీగా..
శతాబ్దాల నాటి అత్యంత అరుదైన కిన్నెర వాయిద్య పరిజ్ఞాన్ని నమ్ముకునే దశాబ్దాల తరబడి గుర్తింపు కోసం ఎదురుచూశారు మొగులయ్య. ప్రస్తుతం ఆయన వయసు అరవై ఎనిమిది ఏళ్లు. ఆ వాయిద్య పరికరంతో మొగులయ్య అనుబంధం అరవై ఏళ్లు. తన కళ అంతరించిపోతుందనే బెంగతో నిత్యం కిన్నెరను పట్టుకునే ఊరూవాడా తిరిగారు. తిరుగుతూనే ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే కిన్నెర వాయిద్య సాధనను మొగులయ్య మొదలు పెట్టారు. స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలకుంట. గ్రామంలో బతుకుదెరువు కష్టమవడంతో ఎనిమిదేళ్ల క్రితం ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో కలిసి హైదరాబాద్‌కు వచ్చారాయన. సింగరేణి కాలనీ గుడిసెల్లో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు.
తాత, ముత్తాల నాటి నుంచి వంశపారపర్యంగా కొనసాగిస్తున్న పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కళనే మొగులయ్య నమ్ముకున్నారు. ఊరూరా ప్రదర్శనలిస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం భార్య శంకరమ్మ మృతి చెందగా దహనసంస్కారాలు చేసుకోలేని పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండో కుమారుడు నరాల సంబంధిత వ్యాధితో ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. కిన్నెర వాయిద్య కళలో పరిజ్ఞానంతో ఆలస్యంగానైనా మొగులయ్యకు గుర్తింపునిచ్చింది. ఏడేళ్ల క్రితం కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దమడూరుకు చెందిన డాక్టర్ రంగయ్య పీహెచ్‌డీ కోర్సులో భాగంగా మొగులయ్య జీవితచరిత్రను ప్రచురించారు. ఫలితంగా అంతరించిపోతున్న కిన్నెర వాయిద్య కళను కాపాడుతున్న ఆయన్ను ప్రభుత్వం గుర్తించింది. ఉగాది పురస్కారంతో సన్మానించింది. అంతేనా.. ఏనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో మొగులయ్య జీవిత గమనాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది.
పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్‌ను మొగలయ్యతో పాడించారు. ఈ పాటలో కిన్నెర వాయిద్యం పుట్టు పూర్వోత్తరాలు చెబుతూ మొగులయ్య ప్రోమోలో కనిపించారు. దీంతో మొగులయ్య పేరు బాగా పాపులర్ అయింది. ఇప్పుడు పద్మశ్రీ వరించడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.