iDreamPost
android-app
ios-app

ఎలా ఉండాల్సిన గిడ్డి ఈశ్వరి ఎలా ఉన్నారు..!

  • Published Jul 27, 2021 | 10:54 AM Updated Updated Jul 27, 2021 | 10:54 AM
ఎలా ఉండాల్సిన గిడ్డి ఈశ్వరి ఎలా ఉన్నారు..!

నమ్మకం, విధేయత, నిబద్ధత, సహనంతో పనిచేస్తే ఎటువంటి గుర్తింపునిస్తామన్నది వైఎస్సార్సీపీ ఆచరణలో చూపించింది. పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని పార్టీ విజయానికి పనిచేసిన చాలామందికి ఇటీవల నామినేటెడ్ పదవుల నియామకాలతో అందలమెక్కించింది.

పార్టీని నమ్ముకుంటే జరిగే మేలు ఇదీ అని సీఎం జగన్ ఆచరణలో చూపించారు. అదే సమయంలో ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగిపోయి ఫిరాయింపులకు పాల్పడినవారు ప్రాముఖ్యత కోల్పోయి.. ఉత్త నేతలుగా మిగిలిపోవడం విశేషం. అటువంటివారికి ఉదాహరణగా విశాఖ మాన్యప్రాంత నాయకురాలు గిడ్డి ఈశ్వరిని పేర్కొనవచ్చు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీలో ప్రముఖ నాయకురాలిగా, ఎమ్మెల్యేగా ఎదిగిన ఆమె.. ప్రోత్సహించిన పార్టీకే ద్రోహం చేసి.. టీడీపీలోకి ఫిరాయించడం ద్వారా తన భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారు. ఆమె వైఎస్సార్సీపీలోనే కొనసాగి ఉంటే కచ్చితంగా ఉప ముఖ్యమంత్రి అయ్యేవారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

టీచర్ నుంచి ఎమ్మెల్యేగా.. 

రాజకీయ కుటుంబానికి చెందిన గడ్డి ఈశ్వరి వైఎస్సార్సీపీతోనే రాజకీయాల్లో చేరారు. ఆమె తండ్రి గిడ్డి అప్పలనాయుడు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినందున ఆ కుటుంబం అందరికీ చిరపరిచితమే. అయితే ఈశ్వరి మాత్రం ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. వైఎస్సార్సీపీలో చేరి మన్యంలో కీలక నేతగా ఎదిగిన ఆమెకు 2014 ఎన్నికల్లో పార్టీ పాడేరు అభ్యర్థిగా నిలబెట్టి ప్రోత్సహించింది. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఆమె పార్టీలోనూ, అసెంబ్లీలోనూ చురుగ్గా వ్యవహరిస్తూ అధ్యక్షుడు జగన్ మనసు చురగొన్నారు. పార్టీ తరఫున అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ పక్షాన బలమైన వాయిస్ వినిపించిన ఈశ్వరికి అధికారంలోకి వస్తే మంచి పదవే లభిస్తుందని అప్పట్లోనే అందరూ అనుకున్నారు.

ప్రలోభాలకు లొంగి పార్టీకి ద్రోహం.. 

కానీ డబ్బు, ప్రలోభాలు రాజకీయాలను భ్రష్టు పట్టించిన నేపథ్యంలో గిడ్డి ఈశ్వరి కూడా వాటి మాయలో పడ్డారు. టీడీపీ విసిరిన ప్రలోభాల వలలో చిక్కుకున్నారు. చంద్రబాబు ఎర వేసిన కోట్ల రూపాయలు, మంత్రి పదవికి ఆశ పడి 2017 నవంబర్ 27న టీడీపీలో చేరిపోయారు. కానీ మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు ఆమెకు హ్యాండ్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో పాడేరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈశ్వరితో పాటు రాష్ట్రంలో టీడీపీ ఓడిపోవడంతో ప్రాభవం కోల్పోయి సాధారణ నేతగా మిగిలిపోయారు.

ఇప్పటికీ తగ్గని ప్రజావ్యతిరేకత.. 

ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతతో ఓటమిపాలైన ఈశ్వరి ఇప్పటికీ అదే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న ఆమె ఇటీవల అంజలి అనే గ్రామంలో రోడ్డు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడానికి ప్రయత్నించారు. విశేషమేమిటంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె అదే గ్రామానికి వెళ్లారు. స్థానికులు రోడ్డు సమస్య గురించి ప్రస్తావించగా.. మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నా ఆ పని చేయించలేదు. ఇప్పుడు అదే రోడ్డు సమస్యపై అదే టీడీపీ నేతగా ధర్నాకు దిగడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. ఆమె ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ నిలదీశారు. ఈ సందర్భంగానే పలువురు నేతలు గడ్డి ఈశ్వరి చేజేతులా రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆమె పార్టీలోనే ఉండి ఉంటే పుష్ప శ్రీవాణి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండేవారని అంటున్నారు.

Also Read : ఏవీ నాటి “విజయనగరం” వెలుగు జిలుగులు