iDreamPost
android-app
ios-app

Paddy Purchase – 48 గంటల డెడ్ లైన్ ఇచ్చిన కేసీఆర్, స్పీచ్ అయిన వెంటనే క్లారిటీ ఇచ్చేసిన మోడీ…!

Paddy Purchase – 48 గంటల డెడ్ లైన్ ఇచ్చిన కేసీఆర్, స్పీచ్ అయిన వెంటనే క్లారిటీ ఇచ్చేసిన మోడీ…!

తెలంగాణాలో ధాన్యం సమస్య ఏ మలుపు తిరుగుతుందో గాని సిఎం కేసీఆర్ మాత్రం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు దంచుతున్నారు. ఇక బిజెపి నేతలు కూడా తామేమి తక్కువ తినలేదన్నట్టు ఘాటుగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా సిఎం కేసీఆర్ ధర్నా చౌక్ లో ధర్నా చేసిన అనంతరం కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, కేంద్ర జలశక్తి, విద్యుత్ శాఖల పనితీరుని ఆయన టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. మన దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయని కేవలం 36 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని అన్నారు.

ఇంకో 30 వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు. రాష్ట్రాల మధ్య కొట్టాట పెట్టి.. ఆగం చేస్తున్నారన్న సిఎం… దేశంలో సాగు భూమిగా ఉన్న 40 కోట్ల ఎకరాలకు… ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినా.. ఇంకా 25 వేల టీఎంసీలు ఉంటాయన్నారు. మిషన్‌ భగీరథ పథకం మాదిరిగా దేశంలోని ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చినా ఇంకా 10 వేల టీఎంసీలు ఉంటాయని ఇంకా వందేళ్ల వరకు కొరత లేదని స్పష్టం చేశారు. అలాగే నాలుగు లక్షల మెగా వాట్ల కరెంట్‌ ఉందని రోజుకు రెండు లక్షల మెగా వాట్లకు మించి వాడడం లేదని తెలిపారు. తెలంగాణ తప్పా.. ఏ రాష్ట్రంలోనూ 24 గంటలు కరెంట్‌ ఇవ్వడం లేదని ఎవరి చేతగాని తనం ఇది అని ఆయన నిలదీశారు.

సమస్యలు ఎత్తిచూపితే పాకిస్తాన్‌ అంటూ విమర్శలు చేస్తోంది. సూటిగా సమాధానం చెప్పలేక వంకర టింకరగా మాట్లాడుతున్నారని… వాట్స్‌ అప్, ఫేస్‌బుక్‌లలో వితండవాదాలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు. తాను కేంద్రానికి 48 గంటల సమయం ఇస్తున్నానని ఈ సమయంలో కచ్చితంగా ధాన్యం కొంటున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని లేదంటే మాత్రం కచ్చితంగా తాము పోరాటాన్ని ఉదృతం చేస్తాం అన్నారు. తెలంగాణాలో అధికార పార్టీ దేశం మొత్తం కూడా రైతుల పోరాటానికి లీడ్ తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

దండం పెట్టి అడుగుతున్నామని ధాన్యం కొనసాల్సిందే అని సిఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ధాన్యం కొనే విషయంలో తమను ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు. ఇక కేసీఆర్ ప్రసంగం సమయంలో వర్షం పడగా… వర్షం కాదు పిడుగులు పడినా సరే తమ పోరాటం ఆగదని తెలంగాణా రైతాంగం కోసం తాము ఎక్కడి వరకు అయినా వెళ్తామని స్పష్టం చేశారు. మాట్లాడితే కేసులు పెడతాం అంటున్నారు అని ఏం పెడతారో రండి పెట్టండని ఎవరూ ఎవరికి భయపడేది లేదని ధాన్యం కొంటారో లేదో స్పష్టంగా చెప్పాల్సిందే అన్నారు.

అయితే కేసీఆర్ రెండు రోజుల డెడ్ లైన్ పెట్టగా ఈ లోపే కేంద్రం స్పందించి సమాధానం చెప్పింది. నిమిషాల వ్యవధిలో కేంద్రం పార్ బాయిల్డ్ బియ్యం తీసుకోదు అని ప్రకటన చేసింది. యాసంగి పంట ధాన్యం కూడా పరిమితం గానే కొంటాం అని కేంద్రం ప్రకటించింది. రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత.. వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం జరుగుతుందని తెలిపింది. ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్ ఒక్కో విధంగా ఉంటుంది అని ఆయా డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం.. బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదని వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని కోరుతున్నామని సూచించింది. ప్రస్తుతం.. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపింది. అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామని వివరించింది.

ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు చేస్తున్నామని పేర్కొంది. ఆయిల్, పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని కోరుతున్నామని క్లారిటీ ఇచ్చేసింది. ఇది ఏవో ఒకటి రెండు రాష్ట్రాలకు కాదు.. అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నామని ఆయా రాష్ట్రాలు.. ఎంత వరకు సేకరించగలుగుతారో.. అంత వరకే పరిమితం కావాలని అడుగుతున్నామని, 60 లక్షల టన్నుల ధాన్యం, 40 లక్షల టన్నుల బియ్యం సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తన నిర్ణయాన్ని తెలంగాణా ప్రభుత్వానికి చెప్పింది.

Also Read : Paddy Purchase, KCR Protest – ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ధర్నా