iDreamPost
android-app
ios-app

KCR Farm House, Paddy Cultivation, Revanth Reddy – రేవంత్‌ ఏ మాత్రం తగ్గడం లేదుగా..

KCR Farm House, Paddy Cultivation, Revanth Reddy – రేవంత్‌ ఏ మాత్రం తగ్గడం లేదుగా..

టీఆర్ ఎస్‌, బీజేపీ మ‌ధ్య న‌డుస్తున్న వ‌రి ఇష్యూలోకి ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేరింది. అది ఇప్పుడు ఉద్రిక్త‌తకు దారి తీస్తోంది. ‘వరి వేయొద్దు.. వరి వేస్తే ఉరే’ అంటూ ప్రజలకు చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో ఈ యాసంగిలోనే వరి పండిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో వరి సాగవుతున్న ఫొటోలను మీడియాకు చూపిస్తూ, సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ సాగు చేస్తున్న వరిని చూపిస్తానని ఆదివారం ప్రకటించారు. చెప్పిన‌ట్లుగానే జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఎర్రవల్లికి బయల్దేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుంచీ రేవంత్ నివాసంతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

సోమవారం తెల్లవారుజామునుంచే పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు చేశారు. అయితే.. మధ్యాహ్నం రెండు గంటలు కావస్తుండటంతో రేవంత్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. రేవంత్ బయటకు రాగానే అరెస్ట్ చేసిన పోలీసులు భారీ బందోబస్తుతో తరలించారు. ఈ క్రమంలో పోలీసులు-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచే ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తూ.. ఇంటి నుంచి ఎటు వైపు నుంచి బయటికి వచ్చినా అడ్డుకుని అరెస్ట్ చేయాలని ముందస్తు వ్యూహంతో పోలీసులు ఉన్నారు. ఆయన బయటికి రాగానే అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను ఎక్కడికి తరలించారన్న విషయం మాత్రం తెలియరాలేదు.

మ‌రోవైపు బీజేపీ దీక్ష‌..

బీజేపీ చీఫ్‌, ఎంపీ బండి సంజయ్‌ కుమార్ నిరుద్యోగ దీక్ష కొన‌సాగుతోంది. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలన్న డిమాండ్‌తో ఈ దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మొదట దీక్ష ఇందిరాపార్కు వద్ద చేపట్టాలని భావించారు. కానీ కరోనా నిబంధనల కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో పార్టీ ఆఫీసులోనే దీక్షకు దిగారు బండి సంజయ్. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 2 వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో బీజేపీ ఆఫీస్‌లో దీక్ష చేయాలని పార్టీ నిర్ణయించింది. తన దీక్షకు భయపడే కేటీఆర్‌ బహిరంగ లేఖ విడుదల చేశారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం మొదలైందని, అయితే నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read : ఉద్యోగ దీక్ష.. కాదు రాజకీయ ఉద్యోగం లేక చేస్తున్న దొంగ దీక్ష..!