iDreamPost
iDreamPost
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఒకటి రెండు చోట్ల తప్ప ఇంకా మూసే ఉన్నాయి కానీ పక్కన తమిళనాడులో తెరుచుకోవడమే కాదు ఏకంగా కొత్త సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. నిజానికి యుఎఫ్ఓ సంస్థలు విపిఎఫ్ ఫీజును కొంత కాలం పాటు నూరు శాతం మినహాయిస్తే తప్ప ఏ కొత్త విడుదలలు చేయకూడదని అక్కడి నిర్మాతల సమాఖ్య నిర్ణయించుకుంది. మొదట బెట్టు చేసిన డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు పలు దఫాల చర్చల తర్వాత ఫైనల్ గా ఆ కండీషన్ కు ఒప్పుకుని నవంబర్ మొత్తం ఎలాంటి రుసుము తీసుకోమని ప్రకటించాయి. దీంతో అక్కడ సందడి నెలకొనబోతోంది.ఓటిటిలో రాని సినిమాలతో హాళ్లు కళకళలాడబోతున్నాయి
సుమారు తొమ్మిది సినిమాల దాక ఇప్పుడు వరసలో ఉన్నాయి. కమెడియన్ సంతానం నటించిన బిస్కోత్, హారర్ మూవీ ఇరండాం కూత్తు, జీవా అరుళ్ నిధి మల్టీ స్టారర్ కళత్తిల్ సందిప్పోమ్, షాజీ యాక్ట్ చేసిన తాబ్రోమ్ తూక్రోమ్ లాంటి మీడియం రేంజ్ మూవీస్ అన్నీ థియేటర్లకు వచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. అలా అని అక్కడేమి వంద శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతులు ఇవ్వలేదు. సగం సీట్లే అయినప్పటికీ ఇలాంటి వాటికి సరిపడా కలెక్షన్లు వస్తే చాలని నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతుందన్న మీద మిగిలిన రాష్ట్ర ఎగ్జిబిటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రేపు సూర్య ఆకాశం నీ హద్దురా ప్రైమ్ లో రాబోతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తికరం. ఇక్కడా అలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే బెటర్. 50 శాతం టికెట్లు తెగినా చాలనుకునే చిన్న బడ్జెట్ సినిమాలు ధైర్యం చేసి విడుదల చేయడం చాలా అవసరం. పబ్లిక్ పల్స్ తెలియాలంటే ఈమాత్రం చేయక తప్పదు. ఎంతసేపూ భీష్మ, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరులు లాంటివి ఫీడింగ్ చేయలేవు. ఎక్కడా వీటికి షోకి పట్టుమని పది మంది కూడా రావడం లేదు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా మల్టీ ప్లెక్సుల ఘోష లోలోపల గట్టిగానే ఉంది. ఎలాగూ నవంబర్ కర్పూరమైపోయింది. డిసెంబర్ లో అయినా మార్పు వస్తే మేలు