iDreamPost
android-app
ios-app

తిరుగులేని ‘గోల్డెన్’ కాంబినేషన్ – Nostalgia

  • Published Apr 27, 2020 | 12:25 PM Updated Updated Apr 27, 2020 | 12:25 PM
తిరుగులేని ‘గోల్డెన్’ కాంబినేషన్ – Nostalgia

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు మాములే కానీ కొన్ని కాంబినేషన్లు మాత్రం అనూహ్యమైన ఫలితాలు అందుకుంటూ ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంటాయి. అలాంటిదే మీరు ఇక్కడ చూస్తున్న ఫోటో. గుర్తుపట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. హీరో నందమూరి బాలకృష్ణ – దర్శకుడు కోడి రామకృష్ణ – నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి. వీళ్లది గోల్డెన్ కాంబో అని చెప్పొచ్చు. గోపాల్ రెడ్డి అంటే బాలయ్యే గుర్తొచ్చే స్థాయిలో ఈ కలయిక ఇలా కుదిరింది.

మొదటిసారి ఈ టీమ్ కి పునాది పడింది 1984లో వచ్చిన ‘మంగమ్మ గారి మనవడి’తో. తమిళ సూపర్ హిట్ మూవీ రీమేక్ గా అచ్చమైన పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం అప్పటిదాకా ఉన్న పాత రికార్డులను తిరగరాసి ఏకంగా ఏడాది థియేట్రికల్ రన్ సాధించింది. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తో 1986లో ‘ముద్దుల కృష్ణయ్య’ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ముచ్చటగా మూడోసారి 1987లో వచ్చిన ‘మువ్వగోపాలుడు’ మరోసారి మేజిక్ ని రిపీట్ చేసింది. ఇక 1989లో వచ్చిన ‘ముద్దుల మావయ్య’ది. హ్యాట్రిక్ పూర్తయినా వీళ్ళ దాహం తీరలేదు. మరోసారి రీమేక్ నే ఎంచుకుని ఈ సారి భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పేరు మారుమ్రోగిపోయేలా రికార్డుల భరతం పట్టింది.

సిస్టర్ సెంటిమెంట్ తో ఇంత గొప్ప సినిమా తీయడం గురించి అందరూ మాట్లాడుకున్నారు. పాటలు ఎక్కడా విన్నా మారుమ్రోగిపోయేవి. ఇది కూడా రీమేక్ కావడం గమనార్హం. మళ్ళీ 1991లో ‘ముద్దుల మేనల్లుడు’తో ఇంకోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి లెక్క తప్పింది. ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. ఇదీ రీమేక్ అయినా రిజల్ట్ రాలేదు. కారణాలు తెలియలేదు కానీ భార్గవ్ ఆర్ట్స్ మొదటిసారి 1995లో దర్శకుడి మార్పుతో బాలకృష్ణతో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘మాతో పెట్టుకోకు’ తీస్తే దారుణంగా ఫెయిల్ అయ్యింది. గోపాల్ రెడ్డికి భారీ నష్టం వచ్చింది. ఆ తర్వాత హై బడ్జెట్ తో ఓ జానపద చిత్రాన్ని ప్రారంభించారు కానీ అది కొంతకాలానికే ఆగిపోయింది. బాలయ్య-కోడి-గోపాల్ రెడ్డి మళ్ళీ జతకూడి సినిమా చేయలేకపోయారు. కొంతకాలానికి గోపాల్ రెడ్డి కన్నుమూశారు.