iDreamPost
iDreamPost
కొన్ని భోజనశాలల పేర్లకు ముందు “బ్రాహ్మణ” అనే పదం ఉండడంపై ఓ యూజర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారి కుల వ్యవస్థపై వాడివేడి చర్చకు దారి తీస్తోంది. @peeleraja అనే యూజర్ బెంగళూరులో “బ్రాహ్మణ” పదంతో మొదలయ్యే రెస్టారెంట్లు, కెఫేల పేర్లను స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేశారు. జొమాటో, స్విగ్గీ యాప్స్ రెండింటిలో తీసిన స్క్రీన్ షాట్స్ ను వేర్వేరుగా అప్ లోడ్ చేశారు.
ఆ తర్వాత యూజర్ తన చిన్ననాటి అనుభవాన్నొకదాన్ని వరస ట్వీట్లలో ఇలా చెప్పుకొచ్చారు- “మాది బ్రాహ్మణ ఆచారాలు పాటించే సంఘీ స్కూల్. హైస్కూల్ కి వెళ్ళిపోతున్న మాకు టీచర్లు ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. పిల్లలందరూ పులిహోర కానీ వెజ్ పులావ్ కానీ తీసుకురావచ్చని చెప్పారు. మాంసాహారం మాత్రం వద్దన్నారు. ఒకబ్బాయి పులిహోర తెచ్చాడు. మీరు అయ్యంగార్లు అని నాకు తెలీదు అన్నారు టీచర్. తను అయ్యంగార్ కాదని ఆ అబ్బాయి ఇబ్బందిగానే చెప్పాడు. ఆ టీచర్ తను జోక్ చేశా అన్నారు. కానీ అది జోక్ కాదు. ఆ అబ్బాయి తెచ్చిన పులిహోరను కావాలనే చివరలో వడ్డించారు. అప్పటికే కడుపు నిండిపోయిన పిల్లలు దాన్ని ముట్టుకోలేదు. ఆరోజుల్లో అయ్యంగార్లే పులిహోర తయారు చేసేవాళ్ళు. అందుకే అయ్యంగార్ కాని వారు పులిహోర తేవడాన్ని ఆ టీచర్ జీర్ణించుకోలేకపోయారు.” ఇలా తన అనుభవాన్ని చెబుతూ పీలేరాజా (@peeleraja) దేశవ్యాప్తంగా బ్రాహ్మణులు తమ తమ ప్రాంతాలకు చెందిన వంటకాలు తింటారు తప్ప బ్రాహ్మణ పాకరీతి (Brahmin cuisine) అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు అని వివరించారు. కొన్ని చోట్ల బ్రాహ్మణులు చేపలు, మాంసం కూడా తింటారని గుర్తు చేశారు.
Here is a screenshot from swiggy. They even suggest "Brahmins special puliogare". So let me tell you a story from my school days pic.twitter.com/LMVgVoIDuu
— peeleraja (@peeleraja) July 24, 2022
నిముషాల్లో ఈ ట్వీట్ కి సంబంధించిన త్రెడ్ (thread) ఫై తీవ్ర వాదోపవాదాలు మొదలయ్యాయి. హలాల్ భోజనం ఓకే కానీ బ్రాహ్మణ భోజనమంటే ఇబ్బంది వచ్చిందా అని ఒక యూజర్ ప్రశ్నించారు. ఒక్క బ్రాహ్మణులకే ఈ నియమం వర్తిస్తుందా? కులాల పేర్లు వ్యాపారాలకు తగిలించే మిగతా వాళ్ళను కూడా ఇదే ప్రశ్న అడగొచ్చుగా అని ఇంకొంతమంది యూజర్లు కామెంట్ చేశారు. మరికొందరు సంఘి అంటే బ్రాహ్మణవాదం అనడాన్ని ఖండించారు.
ఇలాంటి వాదనలు ట్విటర్ కి కొత్తేమీ కాదు. గతంలో “బ్రాహ్మణ లంచ్ బాక్స్ సర్వీస్” పేరుతో ఒక క్యాటరింగ్ సంస్థ ఇచ్చిన యాడ్ కి సంబంధించిన ఫొటోను ఓ లాయర్ ట్వీట్ చేశారు. అప్పుడు కూడా ఇలానే వాడి వేడి చర్చ జరిగింది.