iDreamPost
iDreamPost
మాములుగా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా విజయవంతం అయ్యిందా లేదా అనేది దానికొచ్చిన వసూళ్లను బట్టి కొలుస్తారు. పెట్టిన పెట్టుబడి వచ్చిన కలెక్షన్లను బట్టి లాభమా నష్టమా తేలిపోతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ల లెక్కలు, థియేటర్ల సంఖ్య, పెట్టిన రేట్లు, ఆడిన ఆటలు ఇలా ఎన్నో సమీకరణాలు ఉంటాయి. కానీ ఓటిటి అలా కాదు. నేరుగా వరల్డ్ ప్రీమియర్ రూపంలో అందరి స్మార్ట్ ఫోన్, టీవీ, లాప్ టాప్స్ లో వచ్చేస్తుంది. ఎంత మంది చూశారో, సదరు సంస్థకు ఎంత ఆదాయం వచ్చిందో ఎలాంటి డీటెయిల్స్ బయటికి రావు. ఉదాహరణకు ఇటీవలే విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య నెట్ ఫ్లిక్స్ ఇండియా ట్రేండింగ్ లో ఐదో ప్లేస్ లో ఉంది..
అంటే భారీ వ్యూస్ వచ్చాయనే అర్థం. అయితే ఎన్ని కోట్ల మంది చూశారో మాత్రం ఎవరికీ తెలియదు. వాళ్ళు చెప్పరు కూడా. గతంలో వచ్చిన 47 డేస్, భానుమతి అండ్ రామకృష్ణ, పెంగ్విన్ ఇవేవి ఎంతమేరకు స్పందన తెచ్చుకున్నాయో మీడియాకు సైతం అంతుచిక్కడం లేదు. యుట్యూబ్ తరహాలో వీటికి వ్యూస్ బయటికి కనిపించవు. అందులో అయితే ఎన్ని మిలియన్లు చూశారనేది లైకులు డిజ్లైకులతో సహా అంతా క్లియర్ గా ఉంటుంది. కానీ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, హాట్ స్టార్ దేంట్లోనూ వివరాలు ఉండవు. ఒక్క ఈటీవీ విన్ యాప్ మాత్రమే అది మైంటైన్ చేస్తోంది. కాకపోతే అందులో ఉన్నవన్నీ దాదాపు పాత సినిమాలే కావడంతో మరీ ఎక్కువ స్పందన అయితే లేదు. మొన్న సుశాంత్ సింగ్ రాజ్ పూత్ దిల్ బేచారాకు మాత్రమే హాట్ స్టార్ అఫీషియల్ గా 24 అవర్స్ రికార్డుని ప్రకటించింది తప్ప మిగిలినవాటి విషయంలో సైలెంట్ గానే ఉంది.
ఇప్పటికీ అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి బ్లాక్ బస్టర్స్ ని ఎంతమంది చూశారు అనే వివరాలు ఎవరికీ తెలియవు. సాధారణంగా ప్రేక్షకులు ఈ యాప్స్ లో ఎంత సమయం స్ట్రీమింగ్ కోసం ఖర్చు పెట్టారు అనేదాని మీద ఆదాయం ఆధారపడి ఉంటుంది. థియేటర్లో అయితే ఎక్కడికి కదిలే అవకాశం ఉండదు కాని ఓటిటిలో అలా కాదు. ఏ మాత్రం బోర్ కొట్టినా షిఫ్ట్ అయిపోవచ్చు లేదా ఫార్వార్డ్ చేసుకుంటూ రెండు గంటల మూవీని గంటలో పూర్తి చేయొచ్చు. అందుకే వీటికి నిడివి చాలా ముఖ్యం. వాళ్ళు ఫాలో అవుతున్న పాలసీలు, స్ట్రాటజీల ప్రకారం ఇవన్ని చెప్పే అవకాశం లేదు కాని అభిమానులకు మాత్రం ఈ గణాంకాలు తెలియకపోవడం వల్ల తమ హీరో ఇందులోనూ రికార్డులు కొట్టాడని చెప్పుకోవడానికి లేకుండా పోయింది