iDreamPost
android-app
ios-app

OTT Platforms : భవిష్యత్తుపై ఆశలు పెంచేసిన ఓటిటి ట్రెండ్

  • Published Dec 30, 2021 | 6:19 AM Updated Updated Dec 30, 2021 | 6:19 AM
OTT Platforms : భవిష్యత్తుపై ఆశలు పెంచేసిన ఓటిటి ట్రెండ్

గత ఏడాది తాలూకు కరోనా ప్రభావం ఓటిటి సంస్థలకు ఎంత పెద్ద వరంగా మారిందో కళ్లారా చూశాం. పెద్ద హీరోల సినిమాలు థియేటర్ కు వెళ్లే అవసరం లేకుండా నేరుగా ఇంట్లోనే కూర్చుని కుటుంబంతో సహా చూడొచ్చని రెండేళ్ల క్రితం ఎవరైనా ఊహించారా. కనీసం కలలో కూడా అనుకోలేని వింత ఇది. కానీ వాస్తవం అయ్యింది. నిర్మాతలకు తమ సినిమాలు అమ్ముకునేందుకు ఆప్షన్లు పెరిగాయి. దానికి తగ్గట్టే సినిమా బడ్జెట్ ని మించిన మొత్తాన్ని హక్కుల రూపంలో ఆఫర్ చేస్తూ ప్రైమ్ లాంటి కంపెనీలు తమ ఎత్తుగడలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పకనే చెప్పాయి. రేపటితో సెలవు తీసుకుంటున్న 2021లో ఓటిటి ట్రెండ్ ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం

ఓటిటికి ఓటేసిన స్టార్లు

పరిస్థితులు సాధారణంగా ఉండి ఒకవేళ నారప్ప-దృశ్యం 2లు కనక థియేటర్లలో వచ్చి ఉంటే ఈజీగా యాభై కోట్లకు పైగా బిజినెస్ చేసుకునేవి. ఫలితం ఎలా ఉండేదన్న ఊహను పక్కనపెడితే అభిమానులు కోరుకునే సందడి, కుటుంబాలు వెంకటేష్ కోసం హాలుకు వచ్చే సన్నివేశాలు పూర్తిగా మిస్ అయ్యాయి. అయినా వ్యాపార సూత్రాలకు కట్టుబడి సెంటిమెంట్లను పక్కనపెట్టిన నిర్మాత సురేష్ బాబు వీటిని ఓటిటికి ఇవ్వడం ద్వారా పూర్తిగా లాభపడ్డారు. వెంకటేష్ తన ఫ్యాన్స్ కి ఈ విషయంగా సారీ చెప్పినా ఆయనా మరీ ఎక్కువ బాధ పడలేదు. సూర్య తర్వాత రెండు స్ట్రెయిట్ ఓటిటి సినిమాలు విడుదల చేసిన స్టార్ హీరో వెంకటేషే

బాలీవుడ్ రీమేక్ అంధాదున్ రీమేక్ గా రూపొందిన నితిన్ మాస్ట్రో ఓటిటి రూటు పట్టడం ద్వారా చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. కనెక్టివిటీ పరంగా చాలా రిస్కీ పాయింట్ ఉన్న ఇలాంటి సబ్జెక్టులు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీద బాగా వర్కౌట్ అవుతాయి. డిస్నీ హాట్ స్టార్ కు ఇది నిజంగానే ప్రూవ్ అయ్యింది. థియేటర్ లో రిలీజైన నితిన్ ఇతర చిత్రాలు రంగ్ దే, చెక్ లు బాక్సాఫీస్ లెక్కలో నష్టాలు తేవడం గమనించాల్సిన అంశం. ఒకవేళ మాస్ట్రో కూడా ఇలాగే చేసుంటే ఆడేది కాదన్న కామెంట్ ని కొట్టిపారేయలేం. నాని టక్ జగదీష్, సూర్య జై భీమ్ నేరుగా ప్రైమ్ లో రావడం ద్వారా కోట్లాది ప్రేక్షకులకు రీచ్ అవ్వడం కొట్టిపారేయలేని అంశం

తగ్గిపోతున్న గ్యాప్

థియేటర్లో విడుదలైన కొత్త సినిమాలకు వాటి ఓటిటి స్ట్రీమింగ్ కు మధ్య గ్యాప్ కూడా గణనీయంగా తగ్గిపోతోంది, క్రాక్ అంత పెద్ద హిట్ అయినా ఆహాలో నెల రోజులకే అందుబాటులోకి వచ్చింది. ఉప్పెన ఫిఫ్టీ డేస్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేశారు. మంచి రోజులు వచ్చాయి, అనుభవించు రాజా , రొమాంటిక్, లక్ష్య, ఎస్ఆర్ కల్యాణమండపం లాంటివి పెట్టుకున్న స్పేస్ కేవలం ముప్పై రోజుల కంటే తక్కువే. అగ్రిమెంట్ టైంలోనే ఇవన్నీ స్పష్టంగా రాసుకుంటున్నాయి డిజిటల్ కంపెనీలు. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఒక పది పదిహేను రోజుల అదనపు వెసులుబాటు మాట్లాడుకుంటున్నారు కానీ అది కూడా ఇచ్చే సొమ్ములో కోతపడే కండీషన్ మీదే

వెబ్ సిరీస్ ల హవా

ఇంగ్లీష్ హిందీ కొరియన్ ఇంగ్లీష్ అనే తేడా లేకుండా ఇప్పుడు పాపులర్ వెబ్ సిరీస్ లన్నీ తెలుగు డబ్బింగ్ తోనూ వస్తున్నాయి. మనీ హీస్ట్ 5, ఫ్యామిలీ మ్యాన్ 2 లాంటివి మనవాళ్ళు కూడా ఎగబడి చూశారని సోషల్ మీడియా ట్రెండ్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడా మంచి ప్రొడక్షన్ వేల్యూస్ తో వీటి నిర్మాణం ఊపందుకుంది. ఇటీవలే హాట్ స్టార్ లో వచ్చిన పరంపర రెగ్యులర్ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకోవడానికి కారణం అందులో ఉన్న క్యాస్టింగ్ ప్లస్ బాహుబలి నిర్మాతలు చేసిన మార్కెటింగే. ఆహా ప్రత్యేకంగా బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోతో టాక్ షో చేయడం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది.

బయటికొస్తున్న యంగ్ టాలెంట్

థియేటర్ సినిమా అయితే రిస్కులు బోలెడు ఉంటాయి. షూటింగ్ పూర్తి చేయడం ఒక ఎత్తయితే దాన్నితెరమీద పడేలా చేయడం అంతకు మించిన ప్రహసనం. కానీ ఓటిటి మూవీకి అలాంటి చిక్కులేవి ఉండవు. అందుకే ఫ్రెష్ టాలెంట్ తమ ప్రతిభను చూపించుకోవడానికి వీటినే వేదికగా మార్చుకుంటున్నాయి. సినిమా బండి, థాంక్ యు బ్రదర్, అర్ధ శతాబ్దం, బట్టల రామస్వామి బయోపిక్కు, నెట్, ఆకాశవాణి, హెడ్స్ అండ్ టేల్స్, అద్భుతం, నిన్నిలా నిన్నిలా, సూపర్ ఓవర్, మెయిల్ లాంటివన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆడియన్స్ ని బాగా రీచ్ అయ్యాయి. కోట్లలో వ్యూస్ తెచ్చుకున్నాయి.

భవిష్యత్తు బంగారమే

థియేటర్లు తెరుచుకున్నాయి కాబట్టి ఓటిటిలు తగ్గిపోతాయనుకుంటే అమాయకత్వమే అవుతుంది. ఇకపై వీటి జోరు మరింత పెరగనుంది. మారుతీ లాంటి స్టార్ డైరెక్టర్లు సైతం వీటిలో అడుగుపెడుతున్నారు. దీన్ని బట్టే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, జీ5, హాట్ స్టార్ లాంటి సంస్థలు స్వంత కంటెంట్ ని నిర్మించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. చందాలు పెంచడమే కాదు సినిమాలు వెబ్ సిరీస్ ల నిర్మాణం మీద కోట్ల రూపాయల పెట్టుబడులు పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో థియేటర్ ఓటిటి సమాంతరంగా నడుస్తాయి. వీటి మధ్యలో ఉన్న శాటిలైట్ పూర్తిగా వెనుకబడింది

Also Read : Debut Heroines : కొత్త భామలతో కళకళలాడిన టాలీవుడ్