iDreamPost
android-app
ios-app

వంట గ్యాస్‌కు ఓటీపీ

  • Published Oct 19, 2020 | 6:52 AM Updated Updated Oct 19, 2020 | 6:52 AM
వంట గ్యాస్‌కు ఓటీపీ

ఒకప్పుడు వంట గ్యాస్‌ సిలెండర్‌ పొందాలంటే అనేకానేక ఇబ్బందులుండేవి. మధ్యలో ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్‌ల మేజిక్కులకు లెక్కే ఉండేది కాదు. దశలవారీగా సదరు ఇబ్బందులను పరిష్కరించే దిశగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే ఫోను ద్వారా గ్యాస్‌ సిలెండర్‌ బుక్‌ చేసుకోవడం అందుబాటులోకొచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బుక్‌ చేసుకున్న తరువాత డెలివరీ తీసుకునే సమయంలో కూడా వినియోగదారుడు పాస్‌వర్డ్‌ను చెబితేగానీ సిలెండర్‌ రాని విధంగా మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం వంద నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న ఈ విధానం త్వరలోనే అన్ని చోట్లా అమలవుతుందని మార్కెటింగ్‌ కమిటీల ప్రతినిధులు చెబుతున్నారు.

ఇదీ విధానం..

సబ్సిడీ వంట గ్యాస్‌ సిలెండర్‌ కావాల్సిన వారు తమ ఫోను నంబరు ద్వారా బుక్‌ చేసుకున్న వెంటనే డెలివరీ అథంటికేషన్‌ కోడ్‌ (డీఏసీ) వస్తుంది. డెలివరీ బాయ్‌ దగ్గర్నుంచి సిలెండర్‌ను పొందే సమయంలో ఈ డీఏసీని వారికి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే సిలెండర్‌ డెలివరీకి అవకాశం ఉంటుంది. తద్వారా సిలెండర్లు బ్లాక్‌ మార్కెట్‌కు అవకాశం లేకుండా చూడాలన్నదే సదరు సంస్థల ప్రధాన ధ్యేయంగా చెబుతున్నారు. ఒక వేళ రిజిష్టర్‌ ఫోను నంబరు లేని వారు డెలివరీ బాయ్‌ వద్ద ఉండే యాప్‌లోతమ ఫోను నంబరును రిజిష్టర్‌ చేసుకోవడం ద్వారా సిలెండర్‌ పొందేందుకు అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. ఈ విధానంలో ప్రతి వినియోగదారుడికి రిజిష్టర్డ్‌ ఫోను నంబర్‌ ఉండడం తప్పని సరి అంటున్నారు.

అడ్రస్‌ సక్రమంగా తెలపనివారు, ఫోన్‌ నెంబర్‌ నమోదు కాని వారు ఈ విధానంలో ఇబ్బందులు పడేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వారికి గ్యాస్‌ బుక్‌ అయినప్పటికీ డెలివరీ ఇవ్వరు. సబ్సిడీపై పొందే సిలెండర్లకు మాత్రమే ప్రస్తుతం ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్టుగా చెబుతున్నారు. కమర్షియల్‌ సిలెండర్లు ఎప్పటిలాగే పొందవచ్చునంటున్నారు. అయితే ఈ విధానం అమలు తరువాత మాత్రమే వినియోగదారుల సౌలభ్యం తెలుస్తుందని సంబంధిత మార్కెటింగ్‌ సిబ్బందే చెబుతున్నారు.