iDreamPost
android-app
ios-app

దంపతుల మధ్య గొడవలు.. నాలుగు నిండు ప్రాణాలు బలి!

దంపతుల మధ్య గొడవలు.. నాలుగు నిండు ప్రాణాలు బలి!

కలహాలు లేని కాపురం, గొడవలు లేని కుటుంబాలు ఉండవేమో. నిజానికి ప్రతి ఇంట్లో చిన్నా పెద్ద ఏదొక వివాదం అయితే ఉంటూనే ఉంటుంది. ఇంక దంపతుల మధ్యలో గొడవల కోసం అయితే ప్రత్యేకంగా కారణాలు ఏమీ అక్కర్లేదు. చాలా మంది వివాదం ఏదైనా కాసేపటి తర్వాత అన్యోన్యంగా కలిసిపోతారు. కానీ, కొందరు మాత్రం చినికి చినికి గాలివాన అయ్యేలా చేసుకుంటారు. పైగా ఆ క్షణికావేశంలో లేనిపోని నిర్ణయాలు తీసుకుని నిండు ప్రాణాలను బలిగొంటున్నారు. అలాంటి ఘటనల వల్ల నాలుగు నిండు ప్రాణాలు బలి అయ్యయి.

ఈ విషాదం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఒక ఘటనలో భార్యాపిల్లలను కోల్పోయి ఒక వ్యక్తి ఒంటరి కాగా.. మరో ఘటనలో భర్తను కోల్పోయి భార్య తన ఆధారాన్ని కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన కొక్కుల ఎల్లం అనే వ్యక్తికి మెదక్ మండలం వంకటాపూర్ కు చెందిన నాగలక్ష్మి(28)ని ఇచ్చి వివాహం చేశారు. వీరికి శరణ్య(5), శ్రావ్య(3) అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

అయితే గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. దాంతో 9 రోజుల క్రితం ఎల్లం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. అయితే నాగలక్ష్మి మంగళవారం ఉదయం భర్తను చూసేందుకు పిల్లలను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. తర్వాత తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో కొంటూరు వద్దనే ఆటో దిగేసింది. అక్కడే ఉన్న చెరువులో పిల్లలను తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రామాయంపేట మండలం కాట్రియాలకు చెందిన రాగిశెట్టి సాయికుమార్(28)కు స్రవంతి అనే యువతితో వివాహం జరిగింది. సాయికుమార్ వ్యవసాయం చేస్తుండగా.. స్రవంతి స్థానిక ఆస్పత్రిలో పనిచేస్తోంది. వీరి మధ్య గొడవలు జరుగుతుండటంతో.. స్రవంతి శానిటైజర్ తాగేసింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా కోలుకుంది. అయితే సాయికుమార్ శాలిపేట గేటు వద్ద తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు వాట్సాప్ లొకేషన్ షేర్ చేశాడు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. సాయికుమార్ చెట్టుకు ఉరివేసుకుని ఉన్నాడు. అతని బావమరిది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో క్షణికావేశమే అనర్థాలకు కారణంగా కనిపిస్తోంది. ప్రతి చిన్న గొడవకు ప్రాణాలు తీసుకోవాలి అనుకోవడం అసలు కరెక్ట్ కాదు. ఏదైనా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. బలవన్మరణం అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి.