రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణం అయిపోయాయి. ఇంక హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ట్రాఫిక్ తగ్గించాలి, ప్రమాదాలు నివారించాలంటూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రోడ్డు వైడ్నింగ్, వంతెనల నిర్మాణం చేయిస్తోంది. మరోవైపు ప్రజలు మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు.
తాజాగా ఒక ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో చూస్తే ఒళ్లు జలదరించకమానదు. హైదరాబాద్ శివారులోని హైదర్ షా కోటే ప్రధాన రహదారపై ఘోర ప్రమాదం సంభవించింది. షార్ప్ టర్నింగ్ వద్ద ఓ కారు అతి వేగంగా వచ్చి వాకింగ్ చేస్తున్న మహిళలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, బిడ్డ, మరో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఈ ప్రమాదానికి కారణమైన కారు.. రెడ్ కలర్ హోండా(ఏపీ09బీజే 2588)గా గుర్తించారు.
కారు గుద్దిన వేగానికి మహిళలు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి ఎగిరి పడ్డారు. మృతులు శాంతి నగర్ కాలనీకి చెందిన అనురాధ, మమతగా గుర్తించారు. కారు అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా కారులో మారణాయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కార్లు ఇలా అతివేగంతో ప్రమాదాలు చేస్తుంటే.. పాదచారులకు ఎక్కడ భద్రత ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.