రైతే రాజు అంటారు.. కానీ, ఆ వ్యవసాయం చేసేందుకు మాత్రం ఎవరూ ముందుకు రారు. అయితే రోజులు మారాయి. ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కూడా మానేసి వ్యవసాయం చేయడం ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయంలో కూడా కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాగే ఒక వ్యక్తి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రైతుగా మారాడు. అంతేకాకుండా ఇప్పుడు తన వ్యవసాయం కోసం హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నాడు. ఈ వార్త బయటకు రాగానే.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈయనే ట్రెండింగ్.
రైతే రాజు అనే స్లోగన్ కు ఈయన బెస్ట్ ఉదాహరణ అని చెప్పచ్చు. ఎందుకంటే ఛత్తీస్ గఢ్ కు చెందిన ఈ రైతు.. ఇష్టమైన వ్యవసాయం కోసం ఉన్న బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కొండగావ్ జిల్లాకు చెందిన రాజారాం త్రిపాఠి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఎందుకంటే ఆయన తమ వ్యవసాయం కోసం ఏకంగా రూ.7 కోట్ల పెట్టి హెలికాప్టర్ బుక్ చేశారు. హాలెండ్ కు చెందిన రాబిన్సన్ కంపెనీకి చెందిన 4 సీట్లు ఉండే ఆర్-44 బుక్ చేశారు.
రాజారాం త్రిపాఠికి వెయ్యి ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో వారు ప్రధానంగా నల్ల మిరియాలను పండిస్తుంటారు. వాటిని ఐరోపా, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాజారాం పలు దేశాల్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడ పాటిస్తున్న పద్ధతులు చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా హెలికాప్టర్ తో వ్యవసాయం ఆయన్ను బాగా ఆకట్టుకుంది. అదే తడవుగా దాని గురించి మరింత అధ్యయనం చేశారు. చేతుల్తో మందులు పిచికారీ చేయడం కంటే కూడా హెలికాప్టర్ తో మందులు చల్లడం ఉత్తమం అని భావించారు. అందుకే హెలికాప్టర్ బుక్ చేశారు.
హెలికాప్టర్ నడిపేందుకు తన కొడుకు, సోదరుడికి ఉజ్జయినిలోని ఏవియేషన్ అకాడమీలో పైలెట్ శిక్షణ కూడా ఇప్పించనున్నారు. రాజారాం వ్యవసాయ క్షేత్రంలో మొత్తం 400 గిరిజన కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వారి సాయంతో ఆయన సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు కేంద్రం నుంచి ఉత్తమ రైతు అవార్డు కూడా అందుకున్నారు. రాజారాం త్రిపాఠి టర్నోవర్ ఏడాదికి రూ.25 కోట్లుగా చెబుతున్నారు. 1998లో ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన తాతలాగా రైతులా మారారు. ఆయన తండ్రి మాత్రం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు. రాజారాంకు వ్యవసాయంతో పాటుగా.. ఓ హెర్బల్ సంస్థ కూడా ఉంది.