iDreamPost
android-app
ios-app

రాష్ట్రపతి ప్రసంగం.. ప్రతిపక్షాల బహిష్కరణ నిర్ణయం

రాష్ట్రపతి ప్రసంగం.. ప్రతిపక్షాల బహిష్కరణ నిర్ణయం

నూతన సాగు చట్టాల రద్దు కోరుతూ సుమారు రెండు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తతతో ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు.. ఆ రోజు కొందరి దూకుడు చర్యల వల్ల హింస తలెత్తడం రైతు సంఘాల మధ్య చీలికను కూడా తెచ్చింది. ఇదిలా ఉండగా ఆ రైతు ఉద్యమ సెగ నేడు పార్లమెంట్‌ను కూడా తాకనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ఆది నుంచీ మద్దతు పలుకుతున్న విపక్షాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నేటి ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు మూకుమ్మడిగా ప్రకటించాయి. ఈ మేరకు 18 ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి.

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విపక్షాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన, తృణమూల్‌ ఆధ్వర్యంలో గురువారం సమావేశమైన ప్రతిపక్ష నేతలు ఈమేరకు దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ‘‘కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలన్న రైతుల డిమాండ్లపై ప్రధాని, బీజేపీ అహానికి పోతున్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మొండివైఖరిని మేం తీవ్రంగా నిరసిస్తున్నాం. రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని గట్టిగా కోరుతున్నాం. రైతులకు మద్దతుగా శుక్రవారం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాం’’ అని ప్రతిపక్షాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

అలాగే గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన విధ్వంసాన్ని కూడా ప్రతిపక్షాలు ఖండించాయి. ఈ విధ్వంసంలో కేంద్రం పాత్రపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినట్టు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎస్పీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, ఆర్‌ఎస్పీ, పీపుల్స్‌ డెమొక్రటిక్‌పార్టీ, ఎండీఎంకే, కేరళకాంగ్రెస్‌ (ఎం), ఆల్‌ఇండియా యునైటెడ్‌ డెమెక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. కాగా, ఆమ్‌ ఆద్మీపార్టీ కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది. రైతు ఆందోళలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆపార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ గురువారం చెప్పారు. ఆప్‌తోపాటు శిరోమణి అకాలీదళ్‌ కూడా ప్రతిపక్షాలతో గొంతుకలిపింది. తాము కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని బ్యాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, టీఆర్‌ఎస్‌తోపాటు బీజేడీ, జనతాదళ్‌ (ఎస్‌) మాత్రం ఈ పార్టీలతో చేతులు కలపలేదు.

ఇదిలా ఉండ‌గా.. 33 పనిదినాలపాటు పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగనుండగా.. ప్రతి రోజు నాలుగు గంటల చొప్పున లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలలో యథావిధిగా జీరో అవర్, ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్రం ఎకనామిక్ సర్వే టేబుల్ చేయనుంది. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు కరోనా, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, చైనా దూకుడు తదితర అంశాలతో పాటు రైతు ఉద్యమం, ప‌ర్య‌వ‌సానాలను ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ స‌మావేశాల‌పై రైతు సంఘాలు దృష్టి కేంద్రీక‌రిస్తున్నాయి. ఎర్రకోటపై దాడి నేపధ్యంలో రాష్ట్రపతి కూడా తన ప్రసంగం లో రైతు సమస్యలు, చట్టాల ప్రస్తావన తెచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు.