Idream media
Idream media
కలిసి కాకపోయినా, విడివిడిగా అయినా ప్రజా సేవకు శ్రీకారం చుట్టాయి తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు. ప్రభుత్వాన్ని నిలదీయడమే కాదు, కరోనా బాధితులకు సేవలు అందించడంలోనూ తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూంలు, హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసి బాధితులకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ప్రగతినగర్‌లో ఐసొలేషన్ కేంద్రాలను ఇప్పటికే నిర్వహిస్తున్న సీపీఎం.. శక్తి మేరకు వాటిని జిల్లాలకూ విస్తరించడానికి కృషి చేస్తోంది. గాంధీభవన్ ఆవరణలో ఉన్న ఇందిరా భవన్‌లో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన టీపీసీసీ ఉంది. అలాగే జిల్లాలకు అంబులెన్స్‌లను అందివ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది పార్టీ అధినాయకత్వం.
కరోనా బాధితుల సహాయార్థం గాంధీభవన్‌లో, రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. వీటికి వస్తున్న ఫోన్ కాల్స్‌తో పాటూ.. సోషల్ మీడియాలో, ట్విటర్ ద్వారా ట్యాగ్ చేసిన సమస్యలనూ పరిష్కరించేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. ఆస్పత్రులు, కొవిడ్ బాధితులకు అవసరమైన ఆక్సిజన్, రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లు, ఇతర మందుల సరఫరాలో సమన్వయం చేసుకోవడం.. బాధితుల సమస్యలను హెల్త్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయడం, అవసరమైన వారికి బెడ్స్ సమకూర్చడం వంటి సేవలనూ అందిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంల ద్వారా పరిష్కారం కాని సమస్యలను రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితులకు అవసరమైన బెడ్లను సమకూర్చడం, ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలనూ పర్యవేక్షిస్తున్నారు. యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలు. కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేస్తున్నారు.
హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసిన బీజేపీ
కరోనా బాధితుల సహాయార్థం బీజేపీ రాష్ట్ర శాఖ.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, జిల్లా కార్యాలయాల్లో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. వీటి పర్యవేక్షణకు పార్టీ సీనియర్ నేతలతో కమిటీని కూడా నియమించింది. ఈ హెల్ప్‌లైన్లకు సంబంధించిన ఫోన్ నంబర్లను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. వ్యాక్సిన్ ఎక్కడ అందుబాటులో ఉన్నది, రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సమకూర్చడం, కొవిడ్ పేషంట్లకు ఉచిత భోజనం సరఫరా వంటివీ నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీకి అండగా ఉండే ఆర్‌ఎస్‌ఎస్‌కు.. ఘట్‌కేసర్‌లో రాష్ట్రీయ విద్యా కేంద్రం ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో 200 పడకలతో ఐసొలేషన్ కేంద్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ సేవాభారత్ నిర్వహిస్తోంది.
కదిలిన కామ్రేడ్లు
సీపీఎం రాష్ట్ర కమిటీ.. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పది రోజులుగా ఐసొలేషన్ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం 20 పడకలుగా ఉన్న ఈ కేంద్రాన్ని మరో మూడు రోజుల్లో 50 పడకల స్థాయికి విస్తరించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ కేంద్రంలో ఉన్నవారికి అత్యవసరమైతే అందించేందుకు ఏడు లీటర్ల సామర్థ్యం కలిగిన ఐదు కాన్సెంట్రేటెడ్ ఆక్సిజన్ యూనిట్లను జిగ్రీ అనే సేవా సంస్థ సమకూర్చింది. కాగా, ప్రగతినగర్‌లోని ఓ స్కూలు భవనంలో 20 పడకలతో మరో ఐసొలేషన్ కేంద్రాన్ని సీపీఎం నిర్వహిస్తోంది. ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండలలో మరో మూడు రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో ఐసొలేషన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శక్తి మేరకు జిల్లాల స్థాయిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. అలాగే అన్ని జిల్లాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసి బాధితులకు అవసరమైన సహకారాన్ని ఆ పార్టీ అందిస్తోంది. రానున్న మూడు నెలలూ ఇతర పనులన్నీ పక్కన పెట్టి.. కరోనా బాధితులకు పార్టీ నేతలు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కాగా.. సీపీఐ సైతం కరోనా బాధితులకు సహకారాన్ని అదించేందుకు ఒకటి, రెండు రోజుల్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ హెల్ప్‌లైన్‌ను పార్టీ నేత డాక్టర్ సుధాకర్ పర్యవేక్షిస్తారు.