iDreamPost
iDreamPost
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టి నేటికి సరిగ్గా పదేళ్ళు. అంటే వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ పుట్టి ఓ దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ దశాబ్ద కాలంలో పార్టీ తిరుగులేని విజయాలెన్నో తన ఖాతాలో వేసుకుంది.
దేశంలోని అనేనాకానేక ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఒకటి అనడానికి వీలులేని పార్టీ ఇది. తమిళనాడులో డీఎంకే నేపధ్యం వేరు. ఉత్తరాది ఆర్యుల నాయకత్వాన్ని విభేదిస్తూ ద్రావిడ నాయకత్వం ముందుకు తెచ్చిన నేపధ్యం అది.
అలాగే మదరాసీలుగా పిలవబడుతున్న తెలుగువారికి ఓ గుర్తింపుకోసం వచ్చిన పార్టీ టీడీపీ. తెలుగునేలపై రెండో తరగతి పౌరులుగా చూడబడుతున్నామన్న ప్రాంతీయ భావనతో వచ్చిన పార్టీ తెరాస. ఇక ఉత్తర భారత దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నా వాటి వాటి నేపథ్యం వేరు. జగన్ ప్రారంభించిన ప్రాంతీయ పార్టీ నేపధ్యం వేరు.
ఇది ఒక్కడి పార్టీ. ఒక్కడి ఆత్మగౌరవం అంశం ఆధారంగా పురుడుపోసుకున్న పార్టీ. అది కూడా ఓ యువకుడు మొదలు పెట్టిన రాజకీయ ప్రస్థానం. వాస్తవానికి జగన్ ఈ ప్రయత్నంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయగలిగిన పరిస్థితి కాదు.
Also Read: పోరాటపథం.. ప్రజాసంక్షేమం – పదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రస్థానం
ఒకవైపు నూటపాతికేళ్ళ పార్టీ. అధికారంలో ఉన్న పార్టీ. ఓ మహిళ యావత్ దేశాన్ని శాసిస్తున్న రోజులు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న నేతలు కూడా అనుభవ సూన్యులేమీ కాదు. పైగా పార్టీ అధికారంలో ఉంది. అధికార బలం, అర్ధబలం, అంగబలం పుష్టిగా ఉన్న సందర్భం అది.
రెండో వైపు అప్పటికే ముప్పయ్యేళ్ళ ప్రస్థానం పూర్తి చేసుకున్న టీడీపీ. దేశంలో చక్రం తిప్పుతున్న సీనియర్ నేత ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేస్తున్న కాలం అది.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జగన్ మార్చి 12, 2011న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ పదేళ్ళ ప్రస్థానంలో పార్టీ తిరుగులేని అధిక్యంతో అధికారంలోకి వచ్చింది. ఈ విజయంలో జగన్ పట్టుదల, వ్యూహం, కృషి ఎంత ఉందో ప్రత్యర్థుల వైఫల్యం కూడా అంతే ఉంది. జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయడంలో కాంగ్రెస్ ఉద్దండపిండాలే కాదు, టీడీపీ చాణుక్యుడు, ఆయనకు అండదండలు అందించే వ్యూహకర్తలు కూడా విఫలం అయ్యారు.
కాంగ్రెస్ నాయకత్వం జగన్మోహన్ రెడ్డిని పిల్లాడు, పిల్ల చేష్టలు అని కొట్టిపారేసింది. తాను కుందేలులా పరుగెత్తగలను అనుకొంది. జగన్ తాబేలులాంటివాడు అని కొట్టిపారేసింది. ఈ కథలో అంతిమంగా తాబేలు గెలిచినట్టు జగన్ గెలిచాడు. కుందేలు కుదేలయింది.
ఇక ప్రత్యర్థి టీడీపీ నేత, ఆయన రాజగురువులు, వ్యూహకర్తలు ఇంకో రకంగా తప్పు చేశారు. జగన్ రాజకీయాలను వదిలేసి ఆయన్ను “నెగిటివ్” పాత్రలో చూపించడం మొదలుపెట్టారు. జగన్ అంటే ఓ ఫ్యాక్షనిస్టు అని, ఓ అవినీతి పరుడు అని, అహంకారి అని ప్రజలకు చెప్పడం మొదలుపెట్టారు. ఓ వైపు చంద్రబాబు విజినరీ అని చెపుతూనే జగన్ వినాశకారి అని, విధ్వంసకారి అని ప్రచారం చేశారు.
జగన్ ను తండ్రి రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా పరిచయం చేయకముందే చంద్రబాబు, ఆయన అనుచరగణం, ఆయన పల్లకీ మోసే మీడియా జగన్ ను ఒక విధ్వంసకారిగా పరిచయం చేయడం మొదలుపెట్టారు. ఓ నలుగురు దొంగలు కలిసి నల్ల కుక్క పిల్లగా చెప్పి ఓ పేద బ్రహ్మణుణ్ణి మోసం చేసినట్టుగా జగన్ ను విధ్వంసకారిగా పరిచయం చేసి, ప్రచారం చేస్తే జనం నమ్మేస్తారని, జగన్ కు రాజకీయ సమాధి కట్టేయవచ్చని అనుకున్నారు.
అయితే జగన్ జనంలోకి వెళ్ళారు. అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తానేంటో జనానికి తెలిసేలా జనంలో మమేకం అయ్యారు. చంద్రబాబు అండ్ కో చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, జగన్ విధ్వంసకారి కాదని జనం తెలుసుకున్నారు.
Also Read: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం.. సీఎం జగన్ సందేశం
కాంగ్రెస్ నాయకులు, టీడీపీ, మీడియా… అంతా కలిసి జగన్ ను ఒంటరి చేసి వేధిస్తున్నారని, విషప్రచారం చేస్తున్నారని జనం తెలుసుకున్నారు. అందుకే జగన్ కు బ్రహ్మరధం పట్టారు. ఆయన పార్టీకి తిరుగులేని మెజార్టీతో పట్టం కట్టారు.
చంద్రబాబు అండ్ కో మాత్రం ఇంకా చిన్నయసూరి కథల కాలంలోనే ఉంది మేకపిల్లను నల్ల కుక్కపిల్ల అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. జగన్ ను జనం అర్ధం చేసుకున్నట్టుగా ఆయన ప్రత్యర్ధులు అర్ధం చేసుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. జగన్ రాకెట్ యుగం వైపు వెళుతుంటే, ప్రత్యర్ధులు మాత్రం నీతి చంద్రిక పట్టుకొని తిరుగుతున్నారు. అందుకే జగన్ ప్రత్యర్థులకు అందనంత దూరంలో, అర్ధంకానంత విశ్వరూపంతో ముందుకెళుతున్నారు.
జగన్ ఓ పదేళ్ళు ముందుకేళితే ఆయన ప్రత్యర్థులు మాత్రం యుగాలు దాటి వెనక్కు వెళుతున్నారు.