iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ప్రస్థానంలో గడిచిన 30ఏళ్ళు గమనిస్తే రాజకీయం, కులం విడదీయలేని బంధంగా కలిసిపోయాయి.. తొలుత బ్రిటీష్ పాలనలో ఉద్యోగాల దగ్గర బ్రాహ్మణులు, బ్రాహ్మనేతరులు అంటూ మొదలైన కుల జాడ్యం తరువాత కాలంలో తమ కుల బలం నిరూపించుకోవడానికి సంఘాలుగా ఏర్పడి రాజకీయాలను శాసించాయి. అయితే స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం జరిగిన పరిణామాలతో రాజకీయాల్లో కుల ప్రమేయం కాస్త తగ్గినా , 1983లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడం, దానికి దీటుగా విజయవాడ కేంద్రంగా వంగవీటి మోహనరంగ ఆద్వర్యంలో కాపునాడు సభలు పెద్దఎత్తున జరగడంతో కుల జగడం తిరిగి ప్రాణంపోసుకుని , నాటి కాంగ్రెస్ శాసన సభ్యులుగా ఉన్న కాపు నాయకుడు వంగవీటి మోహన రంగ హత్యతో కార్చిచ్చులా మారి ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం, సినీ అంటూ పలు రంగాలు కులం అనే చట్రంలో ఇరుక్కుపోయే ఉన్నాయి.
అయితే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న కుల జాడ్యం చాలదు అన్నట్టు ఏనాడు జాడలేని మతతత్వ రాజకీయం కూడా పురుడు పోసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అధిక శాతం కుల ప్రాతిపదికన రాజకీయ చేయడానికే అలవాటు పడిన చంద్రబాబు తాజాగా మతతత్వ రాజకీయానికి కూడా తెరలేపినట్టు ఇటీవలి ఆయన వ్యవహార శైలి చూస్తే అర్ధం అవుతుంది. చంద్రబాబు కుల పరంగా చేసుకుంటూ వచ్చిన రాజకీయాన్ని 2019 ఎన్నికల్లో గ్రహించిన ప్రజలు తనకి ఓటమిని కట్టబెట్టారు. అయితే తను నమ్ముకున్న కులపరమైన రాజకీయం గెలుపు తీరాలకు చేర్చకపోగా తెలుగుదేశం చరిత్రలోనే ఘోర ఓటమిని చవి చూడడం. అలాగే డిల్లీలో భారతీయ జనతా పార్టీ మతతత్వం ప్రాతిపదికన రెండోసారి కూడా విజయం సాధించడంతో . చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం తో పాటు మతతత్వ రాజకీయాలు కూడా చేయడానికి సిద్దపడినట్టు తెలుస్తుంది.
2019 ఎన్నికల్లో జగన్ ఘన విజయం సాధించినప్పటి నుంచి సంక్షేమ పాలనే మా ముందు ఉన్న ప్రధానమైన ఎజండా అంటూ ఇచ్చిన హామీలను ఇచ్చినట్టు నెరవేర్చుకుంటు పోతున్నారు. ఇప్పటివరకు భారత దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా గెలిచిన ఏడాదిలోనే 90% హామీలను నెరవేర్చి రాజకీయాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. అయితే పాలనా పరంగా జగన్ దూకుడుని అడ్డుకోలేమని గ్రహించిన ప్రతిపక్షాలు ముఖ్యoగా తెలుగుదేశం పార్టీ ఆయన పై మత పరమైన దాడిని తీవ్రతరం చేశాయి.
గడిచిన ఏడాదిగా జగన్ ను హైందవ సమాజానికి దూరం చేయాలన్న ఉద్దేశ్యంతో అభూతకల్పనలను సృష్టించి పనికట్టుకుని చేసిన విషప్రచారం చూస్తే ప్రతిపక్షాలు రాజకీయం కోసం ఎంత మతోన్మాధం సృష్టించటానికి కూడా వెనకాడటం లేదనే విషయం అర్ధం అవుతుంది. బస్సు టికెట్లు పై మత ప్రచారం అన్నారు, తిరుమలలో వాచ్ హౌస్ లో టవర్ ను చూపి తిరుమల కొండ పై శిలువ అన్నారు, రేషన్ కార్డులపై ఏసు బొమ్మలు అన్నారు, టి.టి.డి సైట్ లో ఉండే పుస్తకం లో ఏసు ప్రస్తావన అన్నారు, తిరుమల , శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు అన్నారు, గుంటూరు గ్రామ సచివాలయంలో మత ప్రచారం అన్నారు, గుంటూరులో గుడులని కూలగొట్టారు అన్నారు. ఇలా అనేక విషప్రచారాలను పుంఖాను పుంఖాలుగా పుట్టిస్తూ జగన్ పై మతతత్వ దాడిని తీవ్రతరం చేశాయి ప్రతిపక్షాలు.
నిజానికి చంద్రబాబు ఆద్వర్యంలో నడిచే వారి సామాజిక మాధ్యమాల్లో పుట్టిస్తున్న ఈ మత రక్కసి చూసి చంద్రబాబుకు హైందవ సమాజం మీద ఎంతో అభిమానం అని అనుకుంటే పొరపాటే… ఆయన ప్రధాన ఎజండా రాష్ట్రంలో జగన్ ను రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే మత రక్కసిని నిద్రలేపాలి, ఆ మంటలో తన రాజకీయ భవిష్యత్తు వెతుకులాడుకోవాలనే తపన, తాపత్రయం తప్ప మరొకటి కాదు. నిజానికి చంద్రబాబు తన పాలనా హయాంలో హైందవుల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వాఖ్యలు కానీ , తీసుకున్న నిర్ణయాలకు కొదవేలేదు.
విజయవాడ నగరంలో అభివ్రుద్ది పేరు చెప్పి కూలగొట్టిన 40 పురాతన గుడులు దగ్గర నుంచి తిరుమలలో ప్రధాన అర్చకుడిని తన స్వార్ధం కోసం తప్పించడం వరకు ఆయన పాలనలో అనేక హైందవ వ్యతిరేక కార్యక్రమాలు చేశారు. హిందువులు గుళ్ళల్లో వేసే కానుకలు పాపాలు చేసి వేస్తారు అన్న ఆయనే తిరుపతి హుండిలో ఆయన మనవడి పేరు పై 10 లక్షలు వేశారు. అయ్యప్ప మాల వల్ల మధ్యం ఆదాయం తగ్గిపోయిందన్నారు. పుష్కరాల్లో పవిత్ర స్నానం చేయడం కోసం వచ్చిన భక్తులని తన ప్రచార యావ తో మృత్యుఒడికి చేర్చారు. ప్రతి హైందవ కార్యక్రమం కూడా పాదరక్షలతోనే పూజలు నిర్వహించారు. ఇంత నిష్ట నిబద్దత కలిగిన వ్యక్తి నేడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ చెప్పటం వెనక కారణం మతతత్వ రాజకీయంలో భాగమే .
అంతర్వేదిలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి రధం అగ్నికి ఆహుతవ్వడం వెనక కారణాలను చేదించే పనిలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే జరిగిన ఘటనకు సంభందించి ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేశారు. రాబోయే ఫిబ్రవరి నెలలో జరగబోయే అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఉత్సవ సమయానికి నూతన రధాన్ని 95 లక్షలతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ప్రభుత్వం తన భాద్యతను నిర్వర్తిస్తున్న సమయంలో తెలుగుదేశం ఇతర పక్షాలు మత రక్కసి కారు చిచ్చు రగిల్చేలా వ్యవహరించడం భాదాకరం. రాష్ట్రం విడిపోయి పూర్తిగా నష్టపోయిన ఈ తరుణంలో రాష్ట్రంలో మత , కుల రాజకీయ రగడ రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రాజకీయ పక్షాలు అధికారం చేజిక్కించుకునే ప్రయత్నంలో స్వలాభంకోసం ఏ రగడ కైనా సిద్దపడతారు. కానీ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని విజ్ఞత ప్రదర్శించాల్సింది ప్రజలే.