iDreamPost
android-app
ios-app

“తిరుపతి” వ్యూహం మార్చుకుంటున్న విప‌క్షాలు

“తిరుపతి” వ్యూహం మార్చుకుంటున్న విప‌క్షాలు

ఏపీ రాజ‌కీయాల‌న్నీ ఇప్పుడు తిరుప‌తి చుట్టూ తిరుగుతున్నాయి. లోక్ సభ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నిక‌ల సంఘం తేదీ ప్రకటించ‌డంతో విప‌క్షాల‌లో టెన్ష‌న్ మొద‌లైంది. స్థానిక ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన అన్నీ తిరుప‌తినే వేదిక చేసుకుని జోరుగా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాయి. కపిలతీర్థం టు రామతీర్థం అంటూ కమలనాథులు, ధర్మ పరిరక్షణ యాత్ర అంటూ తెలుగు తమ్ముళ్లు హ‌ల్ చ‌ల్ చేశారు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రెండు రోజులు అక్క‌డ ప‌ర్య‌టించి స్థానిక రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. వైఎస్సార్‌సీపీకి తామే నిజమైన ప్రత్యర్థి అని ప్రకటించుకునేందుకు టీడీపీ, బీజేపీ–జనసేన కూటమి పోటీ ప‌డ్డాయి. ప్ర‌జ‌ల్లో ప‌ట్టు కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేశాయి. స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ప‌రిస్థితి అర్థం కావ‌డంతో ఆఘ‌మేఘాల మీద స‌మీక‌ర‌ణాలు మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు మాని మ‌రో మార్గంలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ముఖ్య నేత‌ల‌తో గురువారం స‌మావేశ‌మైన చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌తో ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Also Read:బీసీలు, మహిళలతో కోట కట్టుతున్న జగన్

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే విప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వంపై దుష్ప్రచారం ప్రారంభించాయి. మ‌తోన్మాదాన్ని రెచ్చ‌గొట్టి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా మత రాజకీయాలు చేశాయి. అవ‌న్నీ రివ‌ర్స్ లో త‌మ‌కే దెబ్బ కొట్టాయ‌ని స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఆయా పార్టీల్లో చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌జ‌ల్లో వైసీపీపై విప‌రీత‌మైన అభిమానం ఉంద‌ని తెలుసుకున్న దృష్ట్యా ఇప్పుడు రూటు మార్చుకుంటున్నాయి. ప్ర‌ధానంగా టీడీపీలో ఆ మార్పు క‌నిపిస్తోంది.

మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ తిరుప‌తి ఉప ఎన్నిక‌లో పార్టీ నేత‌లు తెగించి పోరాడాల‌ని, తెగించి పోరాడే వాళ్ల‌కే గుర్తింపు ఉంటుంద‌ని పార్టీ నేత‌ల‌కు హిత‌బోధ చేశారు త‌ప్ప ప్ర‌భుత్వంపై కానీ, జ‌గ‌న్ పై కానీ విమ‌ర్శ‌లు చేసినట్లుగా క‌నిపించ లేదు. అలాగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో దెబ్బ‌తిన‌డంపై టీడీపీ నాయ‌కుల క్షేత్ర‌స్థాయి ప‌నితీరు బాగోలేద‌న్నారు కానీ.. వైసీపీ నేత‌లు దౌర్జ‌న్యాలు చేశారు వంటి వ్యాఖ్య‌లు ఉప‌యోగించ‌లేద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read:బాబు పిటీషన్ పై సానుకూల స్పందన దక్కేనా, 23 టెన్షన్ తగ్గేనా?

క‌నీసం ఎంతో కొంత ప్ర‌భావం చూపి ప‌రువు కాపాడుకోవాల‌న్న కోరిక చంద్ర‌బాబులో క‌నిపించిన‌ట్లు గా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఎన్నిక‌ల విష‌యంలో విధేయతలు, మోహమాటాలు ప‌ట్టించుకోకుండా ముందుకెళ్లాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని 75 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్‌కు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని బాబు సూచించారు. నారాలోకేశ్, అచ్చెన్నాయుడు, ప‌న‌బాక కృష్ణ‌య్య‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, బీదా ర‌విచంద్ర యాద‌వ్‌ల‌తో కూడిన ఐదుగురు సభ్యులతో తిరుపతి ఉపఎన్నిక పర్యవేక్షణ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. షెడ్యూల్ విడుద‌ల‌వ్వ‌గానే అంద‌రి కంటే ముందుగానే రంగంలోకి దిగిన చంద్ర‌బాబు తిరుప‌తిలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై చ‌ర్చిస్తున్నారు. ఇప్ప‌టికే అభ్య‌ర్థి ఎంపిక పూర్తి కావ‌డంతో క్షేత్ర‌స్థాయిలో చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై దృష్టి పెట్టాల‌ని శ్రేణుల‌కు సూచించారు.

మ‌రోవైపు బీజేపీలో వింత ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుత ఫ‌లితాల‌తో బేరీజు వేసుకుంటే ఇక్క‌డ పోటీ చేసిన అభ్య‌ర్ధికి డిపాజిట్లు కూడా వ‌స్తాయో రావో అనే సందేహాలు పార్టీలోనే నెల‌కొంటున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉప ఎన్నిక నేప‌థ్యంలో తిరుప‌తిలోనే మ‌కాం వేసి పార్టీ శ్రేణుల‌తో తీవ్రంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న ఆ పార్టీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఇప్పుడు వారిలో ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కార్పొరేష‌న్లో పోలింగ్ జ‌రిగిన డివిజ‌న్ల ను ప‌రిశీలిస్తే.. 27 డివిజ‌న్ల ప‌రిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చిన ఓట్ల సంఖ్య 47,745 కాగా, ఇవే డివిజ‌న్ల ప‌రిధిలో టీడీపీ అభ్య‌ర్థుల‌కు మొత్తం 18,712 ఓట్లు ద‌క్కాయి. బీజేపీకి సుమారు 2,546 ఓట్లు రాగా, జ‌న‌సేన అభ్య‌ర్థుల‌కు ద‌క్కిన ఓట్లు 231. సీపీఐ, సీపీఎంలు రెండూ క‌లిపి రెండు వేల ఓట్ల‌ను తెచ్చుకుంటే, బీజేపీ – జ‌న‌సేన‌లు వాటితో పోటీ ప‌డ్డాయి.

Also Read:గుజరాత్లో మజ్లిస్ కొత్త రాజకీయం!!

బ‌లిజ‌లు గ‌ణ‌నీయంగా క‌లిగిన తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలో జ‌న‌సేన 231 ఓట్ల‌కు ప‌రిమిత‌మైంది. ఇక సూళ్లూరు పేట‌, నాయుడుపేట‌, వెంక‌ట‌గిరి మున్సిపాలిటీల్లో కూడా ఇదే క‌థ‌. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు సాధించిన ఓట్ల‌లో స‌గం స్థాయిలో కూడా తెలుగుదేశం అభ్య‌ర్థులు ఓట్ల‌ను పొంద‌లేక‌పోయారు. బీజేపీ-జ‌న‌సేన‌లు వందల ఓట్ల స్థాయికే ప‌రిమితం అయ్యాయి.

ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే తెలుగుదేశం పార్టీతో స‌హా బీజేపీ-జ‌న‌సేన‌ల కూట‌మి కూడా డిపాజిట్ల‌ను పొంద‌డం కూడా క‌ష్ట‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా జ‌న‌సేన సూచించిన అభ్య‌ర్ధికి సీటు కేటాయిస్తామ‌ని అనుకున్న త‌రువాత ప‌లు కార‌ణాల వ‌ల‌న బీజేపీ అభ్యర్థినే ఇక్క‌డ నుంచి బ‌రిలో దించ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. అయితే బ‌రిలో నిల‌వ‌డానికి ఎవ్వ‌రు ముందుకొచ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌ని వాపోతున్నారు పార్టీలో ప‌లువురు నేత‌లు. సీనియ‌ర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాస‌రి శ్రీనివాసులు బ‌రిలో నిలుస్తారనేది కూడా ఇప్పుడు సందేహాంగా ఉంది. మొన్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపి నుంచి పోటీ చేసిన అభ్య‌ర్ధ‌ల‌కు వ‌చ్చిన ఓట్లు చూస్తే ఇక్క‌డ ఆ పార్టీ ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.