Idream media
Idream media
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెగాసస్ స్పై వేర్ కుంభకోణం కలకలం రేపుతోంది. విపక్షాలు ఈసారి నేరుగా విరుచుకు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపైన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. నరేంద్ర మోడీ స్వయంగా ఇజ్రాయెల్ వెళ్లి పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, పెగాసస్.. వీటన్నింటినీ సాధనాలుగా వాడుకుని రాష్ట్రాల గొంతు నొక్కేస్తున్నారు అంటూ రాహుల్‌గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. 1947లో భారతదేశంలో రాచరికం పోయి ప్రజాస్వామ్యం ప్రవేశిస్తే, ఇప్పుడు మోడీ హయాంలో మళ్లీ రాచరికం ప్రవేశించిందని విమర్శించారు.
ఇప్పుడు రెండు భారత్‌లు
‘‘ఇప్పుడు రెండు భారత్‌లు ఉన్నాయి. ఒకటి పేదలది. మరొకటి సంపన్నులది. రెండింటి మధ్య వ్యత్యాసం పెరుగుతోంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ఈ రెండింటినీ కలిపేందుకు కృషి చేయాలని సూచించారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి.. నిరుద్యోగం గురించి ప్రస్తావించలేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీరు పదేపదే మేడిన్ ఇండియా, మేడిన్ ఇండియా అని మాట్లాడుతుంటారు. కానీ, మేడిన్ ఇండియా ఎంత మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే మీరే మేడిన్ ఇండియాను నాశనం చేశారు. ఉద్యోగాలను సృష్టించేది చిన్న, మధ్యతరహా పరిశ్రమలే. వాటికి మద్దతు ఇవ్వకుండా మేడిన్ ఇండియా సాధ్యం కాదు.’’ అన్నారు.
మేం బయటపడేశాం.. మీరు పేదరికంలోకి నెట్టారు..
నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ వంటి విధానాల ద్వారా అసంఘటిత రంగంపై దాడి చేశారని రాహుల్ అన్నారు. కోవిడ్ సమయంలో మీరు ఎలాంటి సాయమూ చేయలేదు. దీంతో దేశ ప్రజల్లో 84%మంది ఆదాయం తగ్గిపోయింది. యూపీఏ హయాంలో 23 కోట్ల మందిని పేదరికంలోంచి బయటపడేశాం. మీరు మళ్లీ వారందరినీ పేదరికంలోకి నెట్టారు. ఇవి మా గణాంకాలు కావు. నిజమైన గణాంకాలు. అటు వ్యవస్థీకృత రంగంలోనూ మోనోపలీకి తెరతీశారు. పేరు చెప్పనుగానీ.. దేశంలోని అన్ని ఓడరేవులు, విమానాశ్రయాలు, గనులు, సహజవాయు సరఫరా.. ఒక్కటనేమిటి అన్నీ ఒక్క వ్యక్తికే ఇచ్చారు. ఒకవైపు అదానీ.. మరోవైపు అంబానీ.. దేశంలోని సంపద అంతా ఎంపిక చేసుకున్న కొందరికే పోతోంది’’ అని రాహుల్ తీవ్రస్థాయిలో తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
రిపబ్లిక్ డే వేడుకకు ఇతర దేశాలనుంచి అతిథి కూడా ఎందుకు రాలేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని రాహుల్ అన్నారు. భారతదేశం, ప్రపంచదేశాల మధ్య ఒంటరిగా మారిపోయిందని, బలహీనపడిందని, మన వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. చైనాకు తాను ఏం చేస్తున్నదో స్పష్టమైన అవగాహన ఉన్నదని, చైనాను, పాకిస్తాన్‌ను వేరు చేయడం భారత్ వ్యూహాత్మక లక్ష్యం కావాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో కూడా విపక్ష ఎంపీలు ధరల, నిరుద్యోగం పెరిగిపోతున్నాయంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read : యూపీ ఎన్నికలు ,అఖిలేష్ కాంగ్రెస్ పరస్పర సహకారం