iDreamPost
android-app
ios-app

ఉల్లిపాయ‌ల దొంగ‌!

ఉల్లిపాయ‌ల దొంగ‌!

ఒక దొంగ క‌త్తి చూపించి ఉల్లిపాయ‌ల బ‌స్తాని దోపిడీ చేశాడు.
చ‌ట్ట “ఉల్లిం “ఘ‌న‌ని స‌హించ‌లేని పోలీసులు ప్ర‌త్యేక బృందంగా ఏర్ప‌డి అత‌ని ఇంటిని క‌నిపెట్టారు. దోచుకొచ్చిన ఉల్లిపాయ‌ల్ని ఆనంద‌భాష్పాల‌తో దొంగ త‌రుగుతూ ఉండ‌గా అరెస్ట్ చేసి కోర్టులో ప్ర‌వేశ పెట్టారు.

“నేరం చేశావా? ” అడిగాడు జ‌డ్జి.
“నేరం నాది కాదు, ఉల్లిది” అన్నాడు దొంగ‌.
“నేను సినిమా పేరు అడ‌గ‌లేదు”
“జీవిత‌మే ఒక సినిమా. వింటారా ప్లాష్ బ్యాక్‌”
“ఒక‌ప్పుడు ఉల్లిపాయ‌ల్ని వీధుల్లో రాశులు పోసి అమ్మేవాళ్లు. జ‌నం కిలోల కొద్దీ కొనేవాళ్లు. నేను కూడా వాళ్ల‌ల్లో ఒక‌న్ని. ఆ రోజుల్లో మా ఇంట్లో ఉల్లిదోసె, ఉల్లిపెస‌ర‌ట్టు, ప్ర‌తి కూర‌లోనూ ఉల్లిపాయ వేసేవాళ్లు. క‌త్తితో త‌రుగుతుంటే “ట‌క్‌ట‌క్‌”మ‌ని సంగీతం వినిపించేది. కళ్లు వ‌ర్షించేవి. తిర‌గ‌మోత వాస‌న‌కి ముక్కు గుబాళించేది. ఇళ్లే కాదు స‌మాజ‌మే ఒక “ఉల్లిం”త‌గా ఉండేది. పానీపూరి తింటే అడిగిన‌న్ని ఉల్లిపాయ‌లు, ప‌రోటా తింటే గుండ్ర‌టి ఉల్లిపాయ‌లు, బిర్యానీ తింటే ముద్ద‌ముద్ద‌కి ఉల్లిపాయ‌. “ఉల్లాలా” అనే సాగుతున్న వంట‌శాల‌కి క‌ష్ట‌కాలం వ‌చ్చింది. క‌త్తికి క‌న్నీళ్ల‌కి బంధం తెగిపోయింది…”
“క‌విత్వం క‌త్తి కంటే డేంజ‌ర్‌…పాయింట్‌లోకి రా” మంద‌లించాడు జ‌డ్జి.
“ప్ర‌జాస్వామ్యం ఉల్లిపొర లాంటిది. క‌నిపిస్తుంది కానీ తాకితే చిరిగిపోతుంది. లేని ప్ర‌జాస్వామ్యం కోసం నాయ‌కులు ఉన్నారు. లేని ఉల్లికోసం క‌ల‌లు క‌నే ప్ర‌జ‌లు ఉన్నారు. ఉల్లిపాయ‌లు తిన‌ని ఆర్థిక మంత్రి ఉన్న ఈ దేశంలో ఉల్లికోసం ఉద్య‌మాలు చేసే ప్ర‌జ‌ల క‌ష్టాలు ఎలా తెలుస్తాయి యువ‌రాన‌ర్‌…” అన్నాడు దొంగ‌.
“నువ్వు దొంగ‌త‌నం ఎందుకు చేశావో అది చెప్పు. మ‌ధ్య‌లో ఆర్థిక మంత్రి ఉల్లిపాయ‌ల క‌థ ఎందుకు చెప్పు” అన్నాడు జ‌డ్జి.
“ఈ దేశంలో ప్ర‌జ‌లు ఏం తింటున్నారో తెలియ‌ని వాళ్లు ఆర్థిక మంత్రిగా ఉండ‌టం క‌రెక్ట్ అయిన‌ప్పుడు నాలాంటి వాళ్లు దొంగ‌లుగా ఉండ‌టం కూడా క‌రెక్టే”
“చూడు కోర్టు చ‌ట్టాల‌నే త‌ప్ప లాజిక్‌ని ఒప్పుకోదు”
“స‌రే చెబుతా. ఉల్లి సంక్షోభం, ముందు ఆడ‌వాళ్ల‌ని తాకి త‌ర్వాత మ‌గ‌వాళ్ల‌ని వీధుల్లోకి త‌రిమింది. ఒక‌రోజు ఉల్లి దోసె కావాల‌ని అడిగితే మా ఆవిడ అట్ల‌కాడ‌తో వాత పెట్టింది. ఉల్లి ధ‌ర‌లు పెడుతున్న వాత‌ల ముందు , తాను పెట్టిన వాత‌లు ఒక లెక్క కాద‌ని చెప్పింది. సిగ్గూశ‌రం ఉంటే రైతు బ‌జార్లో ఉల్లిపాయ‌లు తీసుకుర‌మ్మ‌ని చెప్పింది.
రైతుబ‌జారుకి వెళితే అక్క‌డ ఉల్లి క‌ల్లోలం క‌నిపించింది. పోలీసులు క‌ర్ర‌ల‌తో కొడుతున్నారు. అవ‌స‌ర‌మైతే స్పెష‌ల్ పోలీసుల్ని పిలిపిస్తార‌ట‌. నేను గుంపులో దూరాను. చిత‌క‌బాదారు. క‌డుపు మండి అక్క‌డున్న కొబ్బ‌రికాయ‌ల క‌త్తి తీసుకున్నా. దొంగ‌గా మీ ముందు నిల‌బెట్టారు” ముగించాడు దొంగ‌.
కేసు వాయిదా ప‌డింది.