iDreamPost
android-app
ios-app

25వేల టన్నుల ఉల్లి.. 30వేల టన్నుల బంగాళా దుంప..

  • Published Oct 31, 2020 | 1:37 AM Updated Updated Oct 31, 2020 | 1:37 AM
25వేల టన్నుల ఉల్లి.. 30వేల టన్నుల బంగాళా దుంప..

ఒక్క కేజీ ఉల్లిపాయలు కొనాలంటేనే జేబు తడుముకుంటుంటే ఇన్నివేల టన్నుల్లో చెబుతున్నారేంటీ అనుకోంకండే.. ఇవి త్వరలో మన దేశానికి రప్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు, పంట చేతికి రాకపోవడం, వచ్చిన పంట దెబ్బతినడం, డిమాండ్‌లో పెరుగుదల వెరసి ఉల్లి, బంగాళాదుంపల ధరలకు రెక్కలొచ్చాయి.

దీంతో రానున్న పండుగల సీజన్‌కు ముందే ఉల్లి, బంగాళా దుంప ధరలను నేలమీదికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఏడువేల టన్నుల ఉల్లిపాయలు దిగుమతి చేసుకున్నామన్నారు. ఇంకో పాతిక టన్నులు కూడా తెప్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే పదిలక్షల టన్నుల బంగాళా దుంపలను కూడా భూటాన్‌ నుంచి తెస్తున్నామన్నారు. ఈ దిగుమతుల ద్వారా సమతుల్య సరఫరాతో పాటు, ధరల నియంత్రణకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు.

ఇదిలా ఉండగా నవంబరు నెలలో దేశీయంగా ఉల్లి పంట అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఆఫ్గనిస్థాన్, టర్కీ తదితర దేశాల నుంచి ఉల్లిని దిగుమతు చేసుకుంటున్నారు.